New UAE visas: యూఏఈలో వచ్చే నెల వాడుకలోకి వస్తున్న రెండు కొత్త వీసాలివే..

ABN , First Publish Date - 2022-09-06T18:58:58+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి.

New UAE visas: యూఏఈలో వచ్చే నెల వాడుకలోకి వస్తున్న రెండు కొత్త వీసాలివే..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి. అలాగే అమలులో ఉన్న ఈ వీసాలకు కొన్ని మార్పులు కూడా చేసింది. ఇక కొత్తగా వస్తున్న ఈ వీసాలలో రెండు వీసాలను అక్టోబర్ 3వ తేదీ నుంచి వాడుకలోకి తీసుకువస్తున్నట్లు యూఏఈ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే ప్రవాసులకు దీర్ఘకాలికి రెసిడెన్సీ కోసం అమలు చేస్తున్న గోల్డెన్ వీసా పథకాన్ని(Golden Visa scheme) అక్కడి ప్రభుత్వం విస్తరించిన విషయం తెలిసిందే. అలాగే గ్రీన్ రెసిడెన్సీ (Green residency) పేరిట ఐదేళ్ల కాలానికి కొత్త వీసా తీసుకొచ్చింది. దీంతో పాటు మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా (multiple-entry tourist visa), ఉద్యోగార్థుల కోసం ఉద్యోగ అన్వేషణ ఎంట్రీ పర్మిట్ (Jobseeker Visa) వంటి పలు రకాల వీసాలు ప్రకటించింది. వీటిలో గ్రీన్ రెసిడెన్సీ, జాబ్ సీకర్ వీసాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. యూఏఈ ప్రకటించిన కొత్త వీసాలు, వాటి ఉపయోగాలను పరిశీలిస్తే..


గ్రీన్ వీసా (Green Visa)..

ఐదేళ్ల వ్యవధితో వచ్చే గ్రీన్ వీసా (Green visa) ద్వారా వీసాదారులు తమ కుటుంబ సభ్యులను స్పాన్సర్ లేదా యజమాని లేకుండా తీసుకురావడానికి అనుమతిస్తుంది. ఈ వీసా నైపుణ్యం కలిగిన కార్మికులు, స్వీయ-యజమానులు, ఫ్రీలాన్సర్లు మొదలైన వారికి వర్తిస్తుంది. 


జాబ్ వీసా (Job Visa)..

యూఏఈలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ఉద్యోగార్ధులు ఈ కొత్త జాబ్ వీసా (Job visa)ను పొందవచ్చు. ఈ వీసాకు స్పాన్సర్ గానీ, హోస్ట్ గానీ అవసరం. ఇది బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్‌లకు, ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్‌లతో పాటు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ విభజించిన మొదటి, రెండవ, మూడవ నైపుణ్య కేటగిరీల కిందకు వచ్చే వారికి మంజూరు చేయబడుతుంది. 


ఈ రెండు వీసాలతో పాటు యూఏఈ (UAE) ఇటీవల మరికొన్ని వీసాలను ప్రకటించింది. వాటిలో ప్రధానమైనవి.. మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా (Multi-entry tourist visa), బిజినెస్ వీసా (Business visa), బంధువులు/స్నేహితులను సందర్శించడానికి వీసా, తాత్కాలిక వర్క్ వీసా, చదువు/శిక్షణ వీసా.


మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా (Multi-entry tourist visa)..

ఐదేళ్ల కాలపరిమితో ఇచ్చే ఈ మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా (Multi-entry tourist visa)కు స్పాన్సర్ అవసరం లేదు. అలాగే 90 రోజుల వరకు యూఏఈలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. మరో 90 రోజుల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇలా ఓ వ్యక్తి ఈ వీసాతో ఆ దేశంలో 180 రోజులు ఉండొచ్చు. అయితే, దరఖాస్తుదారుడు దరఖాస్తు చేయడానికి ముందు గత ఆరు నెలల్లో తప్పనిసరిగా 4వేల డాలర్లు(రూ.3.16లక్షలు) లేదా విదేశీ కరెన్సీలలో దానికి సమానమైన బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.  


బిజినెస్ వీసా (Business visa).. 

పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేకుండానే బిజినెస్ వీసా (Business visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 


బంధువులు/స్నేహితులను సందర్శించడానికి వీసా..

ఒక విదేశీయుడు యూఏఈలో పౌరుడు/నివాసి స్నేహితుడు లేదా బంధువు అయితే ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేదు.


తాత్కాలిక వర్క్ వీసా..

ప్రొబేషన్ టెస్టింగ్, ప్రాజెక్ట్ ఆధారిత పని వంటి తాత్కాలిక వర్క్ అసైన్‌మెంట్ ఉన్నవారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్థులు తాత్కాలిక పని ఒప్పంద పత్రాన్ని లేదా యజమాని నుండి ఒక లేఖ, ఫిట్‌నెస్ ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.


చదువు/శిక్షణ కోసం వీసా..

ఈ వీసా శిక్షణ, పరిశోధన కోర్సులు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు హాజరు కావాలనుకునే వ్యక్తులు లేదా విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఈ వీసాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా మరియు పరిశోధనా సంస్థలు స్పాన్సర్ చేసే వెసులుబాటు ఉంది. దీనికి అధ్యయనం లేదా శిక్షణ లేదా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, దాని వ్యవధి వివరాలను స్పష్టం చేస్తూ సంబంధిత సంస్థ నుండి తీసుకున్న లేఖ సమర్పించాల్సి ఉంటుంది.


Updated Date - 2022-09-06T18:58:58+05:30 IST