ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-10-18T05:34:47+05:30 IST

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు సాగుచేసిన వరి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

- 4.46 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యం

- జిల్లా వ్యాప్తంగా 292 కొనుగోలు కేంద్రాలు

- ఈనెలాఖరులో ప్రారంభం కానున్న కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు సాగుచేసిన వరి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు జిల్లాలో 292 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఈ కేంద్రాల ద్వారా సుమారు 4 లక్షల 46 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది కరోనా ప్రబలిన నాటినుంచి ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సీజన్‌లో కూడా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నది. ఏ గ్రేడ్‌ వరి ధాన్యాన్ని 1960 రూపాయలకు, సాధారణ రకం వరిధాన్యాన్ని 1940 రూపాయలకు కొనుగోలు చేయనున్నారు. 

అమల్లోకి రానున్న కొత్త ధరలు..

ప్రతిఏటా పంటల సాగు కోసం పెట్టుబడులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పంట ఉత్పత్తుల ధరలను కూడా పెంచుతున్నది. అందులో భాగంగా వరి ధాన్యానికి గత ఏడాదికంటే క్వింటాలుకు 72 రూపాయలు పెంచింది. గత ఏడాదికి ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని 1888, సాధారణ రకం ధాన్యాన్ని 1868 రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పెంచిన ధాన్యం ధరలు ఈ సీజన్‌ నుంచే అమల్లోకి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా గోదాముల్లో ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకు పోయాయని, ఎఫ్‌సీఐ ద్వారా ఉప్పుడు బియ్యాన్ని సేకరించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందా, లేదా అనే అయోమయం రైతుల్లో నెలకొన్నది. యాసంగిలో సాగుచేసే వరి ధాన్యాన్ని అధిక మొత్తంలో ఉప్పుడు బియ్యం కోసం వినియోగిస్తుంటారు. రా రైస్‌ కోసం వినియోగిస్తే నూకలు అవుతాయని పార్‌ బాయిల్డ్‌ మిల్లులకే పంపిస్తారు. అయితే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖాధికారులు ఇప్పటికే రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి చెప్పారు. ఈ సీజన్‌లో సాగైన వరి ధాన్యాన్ని అధిక మొత్తంలో రా రైస్‌ కోసమే వినియోగిస్తుంటారు. కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మర ఆడించి కొన్ని బియ్యాన్ని రేషన్‌ వినియోగదారులకు నెలనెలా ఇచ్చే బియ్యం కోటా కింద నిల్వ చేసుకుని, మిగిలిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించేందుకు మార్గం సుగమం కావడంతో ప్రభుత్వం ఈ సీజన్‌లో పూర్తి స్థాయిలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు సన్నద్ధమయ్యింది. శనివారం రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ నిర్వహించిన సమీక్షలో సీఎం ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ మేరకు జిల్లాలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

త్వరలో నిర్వాహకులకు శిక్షణ..

ఈ వర్షాకాలంలో జిల్లాలో 2,08,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 25 శాతం సన్న రకాలు, 75 శాతం దొడ్డు రకాలను సాగు చేశారు. తద్వారా సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యంలో తమ సొంత అవసరాలకు సుమారు 54 వేల టన్నుల ధాన్యాన్ని మినహాయించుకుని మిగతా 4 లక్షల 46 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వస్తారని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇందిరాక్రాంతి పథం ద్వారా 58 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 215 కేంద్రాలు, డీసీఎంఎస్‌ల ద్వారా 14 కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా 5 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్వాహకులకు త్వరలోనే శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ఈ నెలాఖరు నుంచి పంట కోతలు ఆరంభం అవుతాయని, అవసరానికి బట్టి ఆయా గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆరంభిస్తామని జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2021-10-18T05:34:47+05:30 IST