అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-08-13T06:18:20+05:30 IST

అంగన్‌వాడీ టీచర్‌, ఆయాల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గురువారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో దరఖాస్తు చేసుకొని పదినెలలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

- జిల్లాలో 587 కేంద్రాలు, 80 ఖాళీలు 

- దరఖాస్తులు స్వీకరించి పది నెలలు పూర్తి

-  39,771 మంది లబ్ధిదారులు 

- అద్దె భవనాల్లో నిర్వహణ 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అంగన్‌వాడీ టీచర్‌, ఆయాల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  గురువారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో దరఖాస్తు చేసుకొని పదినెలలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.  పాత దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుంటారా? మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తారా? అనేది మాత్రం సందిగ్ధంగానే ఉంది. గతంలోని నిబంధనల్లో మార్పులు తీసుకొస్తారనే చర్చ కూడా సాగుతోంది.  ప్రస్తుతం పదోతరగతి విద్యార్హతతో అంగన్‌వాడీ టీచర్లు, మినీ టీచర్ల రిక్రూట్‌ మెంట్‌ చేపడుతున్నారు. డిగ్రీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ వంటి అదనపు విద్యార్హతలు ఉంటే వెయిటేజీ మార్కులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులకు భర్తీకి మార్గదర్శకాలు వస్తేనేగానీ అయోమయానికి తెరపడే పరిస్థితి లేదు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఎదుగుదలకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందుతున్నా  జిల్లాలో కేంద్రాల్లో సిబ్బంది కొరత భారంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 560 ప్రధాన కేంద్రాలు, 27 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 80 ఖాళీలు ఉన్నాయి. 15 అంగన్‌వాడీ టీచర్లు, ఒక మినీటీచర్‌, 64 అంగన్‌వాడీ సహాయకుల ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో 72 ఖాళీలకు సంబంధించి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. 13 అంగన్‌వాడీ టీచర్లు, ఒక మినీ అంగన్‌వాడీ టీచర్‌, 58 మంది అంగన్‌వాడీ సహాయకుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో దాదాపు 600కుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక ప్రకియ పూర్తయిన క్రమంలో ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేశారు. 

జిల్లాలో ఖాళీల వివరాలు  

వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని బోయినపల్లి - 2, రామన్నపేట, జోగాపూర్‌ - 1, అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, కొత్తపేట మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు ఖాళీగా ఉంది. అంగన్‌వాడీ సహాయకుల్లో బోయినపల్లి -2, రామన్నపేట, నీలోజుపల్లి, విలాసాగర్‌ -1, విలాసాగర్‌ - 4, విలాసాగర్‌ - 5, వర్ధవెల్లి -1, మల్యాల -2, మర్రిగడ్డ -1, చందుర్తి -2, రుద్రంగి -3, నిమ్మపల్లి -1, పల్లిమక్త, మల్కపేట, -2, మర్రిపల్లి -1, హాన్మాజిపేట -1, మల్లారం -2, అనుపురం -1, కోడుముంజ, వేములవాడ ఓల్డ్‌ అర్బన్‌కాలనీలకు సంబంధించి 20 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సిరిసిల్ల ఐసీడీఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల్లో తుక్కారావుపల్లె, ఇందిరానగర్‌ -2, టెక్స్‌టైల్‌ పార్కు ఇందిరమ్మకాలనీ, పెద్దలింగాపూర్‌ -1, అరెపల్లి, జంగమరెడ్డిపల్లె, గోరంటాల -2, లింగన్నపేట తండా, గంభీరావుపేట - 10, పోత్గల్‌ -2 పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్‌వాడీ సహాయకుల్లో సిరిసిల్ల వెంకంపేట - 2, శాంతినగర్‌ -2, నెహ్రూనగర్‌ - 1, నెహ్రూనగర్‌ - 2, అశోక్‌నగర్‌, తంగళ్లపల్లి మండలం మండెపల్లి -1, తాడూర్‌ -2, బస్వాపూర్‌, అంకిరెడ్డిపల్లె, జిల్లెల్ల -1, టెక్స్‌టైల్‌ పార్కు ఇందిరమ్మ కాలనీ, జిల్లెల్ల - 4, అంకిరెడ్డిపల్లె, సోమారంపేట, అనంతగిరి - 2, అనంతారం - 2, సిరికొండ, నర్మాల క్యాంపు, లింగన్నపేట - 4, నర్మాల -1, నర్మాల -2, గంభీరావుపేట -2, సముద్రలింగాపూర్‌ -1, గజసింగవరం - 1, కొత్తపల్లి -4, శ్రీగాధ, కొత్తపల్లి - 1, గంభీరావుపేట - 7, గంభీరావుపేట -10, గూడెం - 2, గూడెం -3, సేవాలాల్‌ తండా, ముస్తాబాద్‌ -2, మద్దిమల్ల -2,  వీర్నపల్లి -3, పదిర - 2, ఎల్లారెడ్డిపేట -7, చీర్ల వంచ-4కు సంబంధించి 38 పోస్టులు ఖాళీలు ఉండగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటి ఫలితాలు వెల్లడించకుండా పెండింగ్‌లో పెట్టడంతో దరఖాస్తుదారులు కొలువులు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. 

అద్దె భవనాల్లో ఇబ్బందులు 

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ప్రాజెక్ట్‌ల పరిఽధిలోని 587 అంగన్‌వాడీ కేంద్రాల్లో 257  సొంత భవనాలు మాత్రమే ఉన్నాయి. 159 అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్నారు. 181 కేంద్రాలను ఇటీవల ప్రాథమిక పాఠశాలల్లోని గదుల్లోకి మార్చారు. సిరిసిల్ల ప్రాజెక్ట్‌ పరిధిలో 362 అంగన్‌వాడీ కేంద్రాల్లో 135 సొంత భవనాలు, 107 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 120 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదుల్లోకి మార్చారు. వేములవాడ ప్రాజెక్ట్‌ పరిఽధిలో 225 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 122 సొంత భవనాలు ఉండగా, 52 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 51 కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల గదుల్లోకి మార్చారు. అద్దె భవనాలు అనుకూలంగా లేకపోవడంతో  అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. 

జిల్లాలో  లబ్ధిదారులు 

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రస్తుతం పోషాకాహారాన్ని పొందుతున్న లబ్ధిదారులు 39,771 మంది ఉన్నారు. వీరిలో గర్భిణులు 4,766 మంది, బాలింతలు 2,976 మంది ఉన్నారు. వీరితోపాటు మూడు సంవత్సరాలలోపు పిల్లలు 18,748 మంది, మూడు నుంచి 6 సంవత్సరాల పిల్లలు 13,318 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. మూడు సంవత్సరాల పిల్లలకు బాలామృతం, 16 కోడిగుడ్లను టేక్‌ హోం రేషన్‌ కింద అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణభోజనం, ప్రతీ రోజు కోడిగుడ్డు, పాలు, కూరగాయలు, పప్పుతో సంపూర్ణ అహారాన్ని అందింస్తున్నారు. దీంతోపాటు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. ఆట, మాట, పాట, కథ, సృజనాత్మకత వంటి కార్యక్రమాలతో విద్యను అందిస్తున్నారు. పోషణ్‌ అభియాన్‌ ద్వారా పిల్లల బరువు, పోషణ లోపాన్ని గుర్తించి వారికి ఆహారాన్ని అందిస్తున్నారు. మున్సిపల్‌, గ్రామాలు, మండల స్థాయిలోనూ అవగాహన కార్యాక్రమాలను చేపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్రాలకు సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది. 

Updated Date - 2022-08-13T06:18:20+05:30 IST