మిషన్‌ భగీరథలో అదనపు పనులకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-04-15T05:42:52+05:30 IST

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీటిని ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం చేపట్టింది.

మిషన్‌ భగీరథలో అదనపు పనులకు గ్రీన్‌ సిగ్నల్‌

- గ్రామాలు, పట్టణాల్లో పనులను గుర్తిస్తున్న సిబ్బంది

- దీంతో సంపూర్ణంగా తాగునీటి సమస్యకు పరిష్కారం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీటిని ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం చేపట్టింది. దీని ద్వారా ఇంకా ఎక్కడైనా అదనపు పనులు ఉంటే చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పట్టణాలు, గ్రామాల్లో సంపూర్ణంగా తాగునీటి సమస్యకు పరిష్కారం కానున్నది. అదనపు పనులను గుర్తించి అంచనాలతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎక్కడెక్కడ గ్యాప్స్‌ ఉన్నాయో గుర్తించాలని పేర్కొన్నది. ప్రతి గ్రామం, పట్టణంలో మరొకసారి పరిశీలన జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అందులో నిమగ్నం అయ్యారు. జిల్లాలోగల పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించిన అధికారులు అంచనాలను రూపొందించారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆ నియోజకవర్గంలోని 40గ్రామాలకు, పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలతో పాటు 207 గ్రామాలకు రూ.758 కోట్లకు రూ.415.16 కోట్లు వెచ్చించారు. మంథని నియోజకవర్గంలోని మంథని మున్సిపాలిటీతో పాటు 146 గ్రామాలకు ప్రభుత్వం రూ.290 కోట్ల నిధులను మంజూరు చేస్తే రూ.128.45 కోట్లు వెచ్చించారు. మొత్తం రూ.1048 కోట్లకు రూ. 543.61 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో 1039.12 మీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణ పనులను, 2 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను, 294 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను కొత్తగా నిర్మించారు. పాతవి, కొత్తవి కలిపి 570 వరకు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఇంట్రా విలేజ్‌ పథకం కింద పైపులైన్ల నిర్మాణ పనులను 81.74 శాతం పూర్తి చేయగా, మిగతా పనులు కొనసాగుతున్నాయి. బల్క్‌ వాటర్‌ అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నప్పటికీ, కొత్త లైన్ల ద్వారా 358 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇంకా 42గ్రామాలకు ఇవ్వాల్సి ఉన్నది. ఆ పనులు నడుస్తున్నాయి. ఇవేగాకుండా మంథని నియోజవర్గంలో మరో 40గ్రామాలను గుర్తించిన అధికారులు ఆ గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు గాను చేపట్టాల్సిన పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు.

అదనపు పనులకు ప్రతిపాదనలు..

మిషన్‌ భగీరథ పథకాన్ని 2015లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అన్ని పట్టణాలు, గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఎక్కడైతే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడి నుంచి నీటిని సరఫరా చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా ఆ జనాభా అవసరాలకు తగ్గట్లుగా అన్ని వీధుల్లో పైపులైన్లు వేసి, అదనంగా ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను నిర్మించి ఇంటింటికి నల్లా నీటిని ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పది సంవత్సరాల వరకు మరల కొత్త పనులు చేపట్టకుండా ఉండేందుకు వీలుగా పథకాన్ని రూపొందించారు. విద్యుత్తు బిల్లులు, బావుల్లో పూడిక తీతలు, కొత్త బావుల తవ్వకాలు, బోర్లు వేయడం, మోటార్లు రిపేరు చేయడం, తదితర ఇబ్బందులు ఏవి లేకుండా ఉండేందుకు పథకాన్ని రూపొందించారు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం ఆయా గ్రామాలు, పట్టణాల అవసరాలను తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించారు. ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్‌ కాస్త మిగలడంతో, ఇంకా ఎక్కడైనా పైపులైన్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు గానీ, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే గుర్తించి ఆ పనులకు అంచనాలు తయారు చేయాలని ఆదేశించడంతో అధికారులు ఆయా గ్రామాలు, పట్టణాల స్థితిగతులు తెలుసుకుంటూ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. దీంతో జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు సంపూర్ణంగా తాగునీటి సరఫరాను చేసినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

Updated Date - 2021-04-15T05:42:52+05:30 IST