Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 08 Aug 2022 15:04:32 IST

నాగర్‌కర్నూల్‌ వైద్య కళాశాలకు పచ్చజెండా

twitter-iconwatsapp-iconfb-icon
నాగర్‌కర్నూల్‌ వైద్య కళాశాలకు పచ్చజెండా

లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ ఇచ్చిన ఎన్‌ఎంసీ

ఇప్పటికే జగిత్యాల కాలేజీకి అనుమతులు

మరో 6 కాలేజీలకు ఎదురుచూపులు

పది రోజుల్లో నీట్‌ ఫలితాలు?

కౌన్సెలింగ్‌ నాటికి అనుమతులొచ్చేనా?


హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల(Govt Medical College)లో ఈ ఏడాది ప్రవేశాలకు జాతీయ వైద్యమండలి(National Medical Council) (ఎన్‌ఎంసీ) అంగీకారం తెలిపింది. 2022-23 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ కోర్సు(MBBS course)లో ప్రవేశాలను ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు శనివారం ఆ కళాశాల ప్రిన్సిపాల్‌(Principal)కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) పంపింది. త్వరలోనే లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌వోపీ) కూడా రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. నాగర్‌కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల కోసం సర్కారు గత ఏడాది దరఖాస్తు చేసింది. మరోవైపు ఇప్పటికే జగిత్యాల మెడికల్‌ కాలేజీకి కూడా ఎన్‌ఎంసీ పచ్చజెండా ఊపింది. గత ఏడాది 8 కొత్త మెడికల్‌ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు దఫాలుగా ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు కూడా నిర్వహించాయి. నిబంధనల మేరకు ఉన్న వాటికి ఎల్‌వోఐ ఇస్తున్నాయి. మరో ఆరు కాలేజీలకు అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. వాటిలో సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్‌, రామగుండం వైద్య కళాశాలలకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ కాలేజీలకు కూడా నెలాఖరులోగా అనుమతులొస్తాయని వైద్యవిద్య ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


కౌన్సెలింగ్‌ నాటికి వస్తాయా..?

జూలై 17న నీట్‌ పరీక్ష జరిగింది. ఇప్పటికే కీ విడుదలైంది. ఫలితాలు మరో పది రోజుల్లో వస్తాయని భావిస్తున్నారు. ఫలితాలు వచ్చాక నెలరోజుల్లోపే కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్‌కు ముందే కొత్త మెడికల్‌ కాలేజీలన్నింటికీ ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అలా వస్తేనే అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంతో ఎల్‌వోపీ ఆలస్యమైతే రాష్ట్ర విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి అన్ని కాలేజీలకు అనుమతి వస్తే రిజిస్ట్రేషన్‌ చేసుకొని విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇస్తారు. చాలామంది తమ నివాస ప్రాంతానికి దగ్గరగా ఉండేవి, హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉండే మెడికల్‌ కాలేజీల్లో చేరేందుకే మొగ్గు చూపుతారు. అందుకు తగ్గట్లుగా వెబ్‌ ఆప్షన్లు పెట్టుకుంటారు.  కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలయ్యేనాటికి కొత్త కాలేజీలకు అనుమతులు రాకుంటే ఉన్న కళాశాలలకే ఆప్షన్లు పెట్టుకోవాలి.


కొత్త మెడికల్‌ కాలేజీలన్నింట్లో కలిపి మొత్తం 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ సీట్లన్నింటికీ తొలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటువంటి పరిస్థితి ఏమీ ఉండదని, కొత్త కాలేజీలకు అనుమతి వస్తే.. ఆ సీట్ల వివరాలను మళ్లీ కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చుతామని కాళోజీ వర్సిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. దాంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సీటు వచ్చిన విద్యార్థికి కూడా మెరిట్‌ ఆధారంగా మరో మెడికల్‌ కాలేజీలో స్లైడింగ్‌ ద్వారా సీటు పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. గతంలో కూడా మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైన తర్వాత మల్లారెడ్డి మహిళా వైద్య కళాశాలకు అనుమతులు వచ్చాయని, ఆ సీట్లను కూడా కౌన్సెలింగ్‌లో చేర్చి అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.


పీజీ కౌన్సెలింగ్‌ ఆగింది అందుకే

మరోవైపు నీట్‌ పీజీ పరీక్ష ఈ ఏడాది మే 22న జరిగింది. జూన్‌ 1న ఫలితాలు వెల్లడయ్యాయి. కానీ, ఇంతవరకు కౌన్సెలింగ్‌ మొదలు కాలేదు. అందుకు ప్రధాన కారణం దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్యను ఎన్‌ఎంసీ పెంచుతోంది. దానికి సంబంధించిన అనుమతులు ఇంకా జారీ చేయాల్సి ఉంది. కొన్ని కళాశాలల్లో ఇప్పటికే పీజీ సీట్ల పెంపుపై అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఆ తర్వాతే పీజీ కౌన్సెలింగ్‌ను మొదలుపెడతామని ఇప్పటికే వెల్లడించింది. యూజీకి సంబంధించి కూడా కొత్త మెడికల్‌ కాలేజీలకు పూర్తిగా అనుమతులిచ్చిన తర్వాతే కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.