హరిత బాదుడు

ABN , First Publish Date - 2022-04-24T05:48:50+05:30 IST

పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను, వ్యాపారులను భాగస్వామ్యులను చేసేందుకు ప్రభుత్వం హరితనిధిని తీసుకొచ్చింది.

హరిత బాదుడు

- ట్రేడ్‌ లైసెన్స్‌ బట్టి ఒక్కో వ్యాపారి నుంచి రూ.వెయ్యి వసూలు

- వసూళ్లకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో ప్రభుత్వం మార్పులు

- ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం హరితనిధి చెల్లించేలా ప్రణాళిక

- ట్రేడ్‌ లైసెన్స్‌ రూ.500 ఉంటే హరితనిధికి మరో 1000 చెల్లించాల్సిందే..

- జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో 60 వేలకు పైగానే చిరు వ్యాపారులు


కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 22: పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను, వ్యాపారులను భాగస్వామ్యులను చేసేందుకు ప్రభుత్వం హరితనిధిని తీసుకొచ్చింది. మున్సిపాలిటీల్లో ఇక నుంచి ప్రతీ ఏటా ట్రేడ్‌ లైసెన్స్‌తో(వ్యాపార అనుమతులు), రెన్యూవల్‌ ఫీజుతో పాటు రూ.1000 హరితనిధి కింద చెల్లించాల్సి ఉంటుంది. వీరితో పాటు ఐఏఎస్‌, గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల మొదలు ప్రజాప్రతినిధుల నుంచి కొంత మొత్తంలో ఈ నిధి వసూలు చేయనున్నారు. అయితే రోడ్డు పక్కల వ్యాపారాలు నిర్వహిస్తూ పూట గడవడమే కష్టంగా ఉండే చిరు వ్యాపారులపై రూ. వెయ్యి భారం మోపితే ఎలా అంటూ పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ కింద రూ.500 చెల్లించే వారు అదనంగా మరో రూ.1000 చెల్లించాలంటే భారంగా మారుతుందని పేర్కొంటున్నారు. పెద్ద వ్యాపారానికి, చిన్న వ్యాపారానికి ఒకే రకమైన హరితనిధి ఉండడం పట్ల పెదవి విరుస్తున్నారు. హరితనిధి వసూలు చేస్తూ పచ్చదనం పెంపొందించే నిర్ణయం మంచిదే అయినప్పటికీ అందరికీ ఒకే రకంగా వసూలు చేయడంపై మాత్రం ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

అన్ని వర్గాల నుంచి నిధుల వసూలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తూ అన్ని శాఖలకు బాధ్యతలు అప్పగిస్తున్నా ఆశాజనకమైన ఫలితాలు రావడం లేదు. నాటిన అనంతరం మొక్కలకు సరైన సంరక్షణ లేక చనిపోవడం,మళ్లీ హరితహారంలో అక్కడే మొక్కలు నాటడం సర్వసాధారణమైంది. అలా కాకుండా హరితహారం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేలా తెలంగాణ హరితనిధి పేరుతో అన్ని వర్గాల నుంచి నిధుల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు సమాజంలో వివిధ వర్గాల ద్వారా నిధులు రాబట్టనున్నారు. ప్రజాప్రతినిధుల జీతాలు, గౌరవ వేతనం, రెమ్యూనరేషన్లలో కొంత మొత్తం చొప్పున మినహాయించుకోనున్నారు. ఇదిలా ఉండగా గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల నుంచి సైతం వసూలు చేయనున్నారు. ఇక ఇంజనీరింగ్‌ విభాగంలో నిర్వహించే పనులపై ఒక శాతం, నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో 10 శాతం, రిజిస్ట్రేషన్‌శాఖలో నిర్వహించే ప్రతీ రిజిస్ట్రేషన్‌పై రూ.50, దుకాణాలు, వ్యాపారాలు ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌పై రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ సంవత్సరానికోసారి నిధులు సమీకరించనున్నారు.

ట్రేడ్‌ లైసెన్స్‌లతో భారీగా హరితనిధి వసూలు

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోని వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ సంవత్సరం చాలా వరకు ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలోని దుకాణ సముదాయాలు పెద్ద ఎత్తున లైసెన్స్‌ లేకుండా నడుపుతున్నారని వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయా దుకాణాల వివరాలను సిబ్బంది ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నమోదు చేసుకుని వచ్చారు. ఈ లెక్కన అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల విషయంలో పకడ్బందీ చర్యలు చేపడితే ఫీజులతో పాటు హరితనిధి కింద రూ.50లక్షలకు పైగానే ఆదాయం రానుంది. హరితనిధి వసూళ్లకు అనుగుణంగా ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌కు ఇటీవలే సవరణ చేశారు.

చిరు వ్యాపారులకు భారం

వ్యాపార అనుమతుల రుసుములలో ఏప్రిల్‌ 1 నుంచి సవరణలు సైతం ప్రారంభించారు. ఆస్తిపన్ను మదింపునకు అమలు చేస్తున్న విఽధానాన్నే దుకాణాలకు సైతం అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయ కొలతల ఆధారంగా ఫీజులు ఖరారు చేసి అదనంగా రూ.1000 హరితనిధి వసూలు చేస్తున్నారు. పట్టణంలో పెద్ద వ్యాపారంపై దీని ప్రభావం అంతగా లేకున్నా చిరు వ్యాపారులకు మాత్రం భారం కానుంది. జిల్లాలో చిరు వ్యాపారులు 60 వేలకు పైగానే ఉన్నారు. వారి లైసెన్స్‌ ఫీజు రూ.500 నుంచి రూ.700 మధ్య ఉన్నా హరితనిధి రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రకాల వ్యాపారులకు వెయ్యి రూపాయలే నిర్ణయించడం సమంజసం కాదని, లైసెన్స్‌ఫీజుపై కొంత శాతాన్ని నిర్ణయిస్తే చిరువ్యాపారులకు ఊరట కలిగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. 


ట్రేడ్‌ లైసెన్స్‌ చెల్లించేప్పుడే హరితనిధి చెల్లించాలి

- దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

గతంలో మాదిరి కాకుండా ఈ సంవత్సరం ప్రభుత్వం ట్రేడ్‌ లైసెన్స్‌ విఽధానంలో మార్పులు తీసుకువచ్చింది. కొలతల ప్రకారం ట్రేడ్‌ లైసెన్స్‌ వసూలు చేయడమే కాకుండా హరితనిధి కింద రూ.1000లను సైతం కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు సైతం చేసింది.

Updated Date - 2022-04-24T05:48:50+05:30 IST