ఆకుపచ్చ నగరం!

ABN , First Publish Date - 2022-03-18T08:38:28+05:30 IST

హైదరాబాద్‌ నగరానికి పశ్చిమాన ఉన్న జంట జలాశయాల ఎగువన అమల్లో ఉన్న 111 జీవో ఎత్తివేతతో హైదరాబాద్‌ మహానగరం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

ఆకుపచ్చ నగరం!

  • ఉనికిలోకి మరో హైదరాబాద్‌!
  • 111 జీవో రద్దుతో హైదరాబాద్‌ జిల్లాకు
  • రెండున్నర రెట్ల భూమి అందుబాటులోకి
  • మారనున్న మహానగర రూపు రేఖలు
  • పర్యావరణహితంగా ఇక్కడ ‘మాస్టర్‌ ప్లాన్‌’
  • దశల వారీగా 111 జీవో ప్రాంత అభివృద్ధి
  • శివార్లలో పచ్చదనంతో సుందర టౌన్‌షిప్‌లు
  • నగరమంతటా దిగిరానున్న భూముల ధరలు
  • సర్కారుకు 31,483 ఎకరాలు అందుబాటులోకి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ నగరానికి పశ్చిమాన ఉన్న జంట జలాశయాల ఎగువన అమల్లో ఉన్న 111 జీవో ఎత్తివేతతో హైదరాబాద్‌ మహానగరం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్‌ చుట్టుపక్కల నగర విస్తరణకు అవకాశాలు దండిగా పెరగనున్నాయి. ప్రస్తుతం 538 చదరపు కిలోమీటర్ల పరిధిలో 111 జీవో అమల్లో ఉంది. ఇందులో చాలావరకు హైదరాబాద్‌ నగరంలో అంతర్భాగంగానే ఉంది. 111 జీవో ఆంక్షల కారణంగా ఇక్కడ భూమిని వినియోగించే పరిస్థితి లేదు. జీవోను ఎత్తేస్తే 538 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 1.32 లక్షల ఎకరాల భూమి నగర విస్తరణకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌ పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు నెలవుగా మారింది. ప్రపంచంలోనిఅతి పెద్ద సంస్థలు ఇక్కడ తమ కార్యాకలాపాలు కొనసాగిస్తున్నాయి. తిరుగులేని విధంగా ఐటీ రంగం విస్తరిస్తోంది. 


ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దేశ, విదేశాల్లోని ప్రధాన నగరాలకు హైదరాబాద్‌తో విమానాల ద్వారా రాకపోకలు పెరిగాయి. నగరం చుట్టూ రవాణా మౌలిక సదుపాయాలు మెండుగా ఉండడంతో పెట్టుబడుదారులంతా కంపెనీలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్‌కు తగ్గ విధంగా శివార్లలో భూమి లభించడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల్లో కంపెనీల కోసం స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇళ్లకు కూడా ఇటీవల కాలంగా భారీగా డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా ఔటర్‌ రింగు రోడ్డుకు ఇరువైపుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోర్‌ సిటీలో కంటే ఽఇక్కడ అధిక ధరలున్నాయి,. 111 జీవో ఎత్తివేయడం ద్వారా అందుబాటులోకి వచ్చే భూమి విస్తీర్ణం(538 చదరపు కిలోమీటర్లు) హైదరాబాద్‌ జిల్లా విస్తీర్ణం(217 చదరపు కిలోమీటర్లు) కన్నా పెద్దది. జీవో ఎత్తివేతకు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు  111 జీవో ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా, పర్యావరణ హితంగా అభివృద్ధి చేసేందుకు నివేదికలు రూపొందిస్తోంది. సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌ను న్యాయస్థానాల ముందు పెట్టి వాటి అనుమతితో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. తుది నివేదిక రూపొందించే ముందు ముఖ్యమంత్రితో ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. 111 జీవో పరిధిలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలనూ పరిష్కరిస్తూ నివేదికలు రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 


గ్రీన్‌ కాలనీలు... రిసార్ట్‌లు.. క్యాంప్‌సలు

111 జీవో తొలగించి వాటి స్థానంలో కొత్త జీవో తేవాలని భావిస్తున్న ప్రభుత్వం నిర్మాణాల విషయంలో ఆంక్షలు కఠినతరం చేయనుంది. పర్యవరణహితంగా చేపట్టే నిర్మాణాలకే అనుమతులు ఇస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసే మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు. దశల వారీగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపించే విధంగా చర్యలు తీసుకుంటారు. రహదారులు, తాగునీరు, మురుగునీరు, వరద ప్రవాహ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు ప్రణాళికాబద్ధంగా చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో గరిష్ఠంగా 50 శాతం భూమిలో మాత్రమే నిర్మాణాలకు అనుమతిచ్చే అవకాశాలున్నాయి. జలాశయాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత తగ్గిస్తారు.ఇళ్లు, పార్కులు, ఇతర ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు పెంచే విధంగా నిబంధనలు విధిస్తారు. నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలంటే దరఖాస్తుతో పాటు సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసిన తర్వాతే నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. విశాలమైన రోడ్లు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఎకరా, అరఎకరా విల్లాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గచ్చిబౌలి చుట్టుపక్కల 500 గజాల విస్తీర్ణంలో విల్లా కొనాలంటే కనీసం రూ.10 కోట్ల నుంచి 15 కోట్లవరకు ఖర్చు పెట్టాల్సి ఉంది. అదే ఈ ప్రాంతంలో ఽభూములు అందుబాటులోకి వస్తే ఎకరా సువిశాల విస్తీర్ణంలో సుందరమైన విల్లాలను నిర్మించుకోవచ్చని డబ్బున్న వారు భావిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఇక్కడ నిబంధనలు కూడా కలిసివస్తాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో రిసార్ట్‌లు, సువిశాల గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్లు నిర్మించే అవకాశాలు ఉంటాయి. ఐటీ కంపెనీలు కూడా ఈ ప్రాంతాల్లో భారీగా భూముల కొనుగోలుకు సిద్ధమవుతున్నాయి.


సర్కార్‌కు కాసుల పంటే

111 జీవో పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్‌, భూదాన్‌, సీలింగ్‌ భూములు కలిపి 31,483 ఎకరాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 18,332 ఎకరాల ప్రభుత్వ, 9235 ఎకరాల అసైన్డ్‌, 2660 ఎకరాల వ్యవసాయ సీలింగ్‌, 1256 ఎకరాల భూదాన భూములున్నాయి. జీవో సడలింపుతో స్థానిక ప్రజలు, ప్రభుత్వానికి లబ్ధి చేకూరనుంది. 31,483 ఎకరాల భూమిని ప్రభుత్వం తన ఆర్థిక అవసరాలకు వినియోగించుకొనే అవకాశం ఉంది. శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలోని 5 వేల ఎకరాలు ప్రభుత్వానికి కాసుల పంట పండించనున్నాయి. 


భూముల ధరల స్థీరీకరణ

111 జీవో ఎత్తివేత లేదా సవరించడం వల్ల నగర శివార్లలో భూమి లభ్యత భారీగా పెరగడంతో కొన్ని చోట్ల అడ్డగోలుగా పెరుగుతున్న భూముల ధరలకు కళ్లెం పడనుంది. ఔటర్‌ రింగు రోడ్డుకు సమీపంలోని అనేక ప్రాంతాల్లో భూములు అందుబాటులోకి రానుండడంతో దూర ప్రాంతాల్లో ఽభూముల ధరలు కొంత దిగివస్తాయి. ఒకేసారి భారీగా భూమి అందుబాటులోకి రావడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుందని, ధరల స్థిరీకరణ జరుగుతుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఔటర్‌ రింగురోడ్డుకు అవతల కూడా కొన్నిచోట్ల గజం రూ.లక్ష పలుకుతోంది. ఐటీ రంగం విస్తరించిన గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరా కనీసం రూ.50 కోట్లకు పైగానే పలుకుతోంది. దీంతో శంకరపల్లిలాంటి సుదూర ప్రాంతాల్లో కూడా ఎకరా రూ.15 కోట్లకు పైగా పెరిగింది. నగరానికి అతి సమీపంలో ఉండే కొన్ని ప్రాంతాల్లో 111 జీవో అమల్లో ఉండడంతో ఇక్కడ నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోతున్నారు. తమ పాలిట శాపంగా మారిన జీవోను ఎత్తివేయడం.. లేదా సవరించడం చేయాలని ఎన్నోఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు. కేసీఆర్‌ ప్రకటనతో వీరంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ భూముల ధరలు పెరిగి ఆర్ధికంగా నిలబడతామని సంతోషపడుతున్నారు.

Updated Date - 2022-03-18T08:38:28+05:30 IST