అత్యాశ!

ABN , First Publish Date - 2021-04-07T05:30:00+05:30 IST

ఒక గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేది. ఆ కుటుంబం చాలా పేదరికంలో

అత్యాశ!

ఒక గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేది.  ఆ కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. తినడానికి తిండిలేక రాత్రుళ్లు కొన్నిసార్లు ఆకలితో పడుకునేవారు. రోజూ రాత్రి ఆమె ఆకాశంలోకి చూస్తూ వాళ్ల జీవితంలో మార్పు రావాలని, మంచి జీవనం సాగించేందుకు సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థించేది. ఆమె ప్రార్థనలను ఒకరోజు దేవదూత విన్నది. ఆమెకు సహాయం చేయాలని అనుకుంది. ఆ పేద మహిళ ఇంటికి వచ్చి ఒక చెట్టును బహుమతిగా ఇచ్చింది.


‘‘ఈ చెట్టు నుంచి ఆకు రాలినట్టయితే, ఆ ఆకు బంగారంగా మారుతుంది. నువ్వు దాన్ని అమ్ముకుని కుటుంబ అవసరాలు తీర్చుకో’’ అని చెప్పి అదృశ్యమయింది. ఆ మాటలు విన్న మహిళ చాలా సంతోషపడింది. చెట్టును జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. రోజూ చెట్టు ఆకులు రాలేవి. అవి బంగారంగా మారగానే అమ్మి డబ్బులు తెచ్చుకోవడం చేసేది. కొన్ని రోజుల్లోనే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఒకరోజు మహిళ చెట్టు కింద నిలుచుని ‘‘రోజూ రాలే ఆకుల కోసం ఎదురుచూసే బదులు ఒకేసారి చెట్టు ఆకులన్నింటిని తెంపుకుంటాను’’ అని అనుకుంది.


ఆకులన్నింటిని తెంపి ఇంట్లో పోసి, బంగారంగా మారతాయని చూడటం మొదలుపెట్టింది. కానీ ఆ ఆకులు బంగారంలా మారకుండా ఎండిపోయాయి. దాంతో ఆ మహిళకు చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఆకులన్నీ తెంపడంతో చెట్టు కూడా చనిపోయింది. దాంతో ఆ కుటుంబం కొద్ది నెలల్లోనే పూర్వ స్థితికి చేరుకుంది. 


Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST