మట్టిని.. మింగేస్తున్నారు

ABN , First Publish Date - 2022-05-19T05:14:58+05:30 IST

అధికారంలో ఉన్నాం.. అడిగెదెవ్వరు అనుకున్నారేమో.. అనుమతులు గోరంతకు తెచ్చుకుని.. కొండంత మట్టిని తవ్వేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్జనకు తెరదీశారు.

మట్టిని.. మింగేస్తున్నారు
మట్టిని లోడు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లు

రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి

అనుమతులు గోరంత.. తవ్వకం కొండంత

గురజాల టౌన్‌, మే 18: అధికారంలో ఉన్నాం.. అడిగెదెవ్వరు అనుకున్నారేమో.. అనుమతులు గోరంతకు తెచ్చుకుని.. కొండంత మట్టిని తవ్వేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్జనకు తెరదీశారు. గురజాల మండలంలోని దైదలో మట్టి మాఫియా రోజురోజుకు చెలరేగిపోతోంది. మండలంలోని పులిపాడుకు చెందిన వ్యక్తి నవంబరు 26, 2020న దైద గ్రామంలోని 570బై27 సర్వే నంబరులో ఉన్న 5.90 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఐదేళ్లపాటు మట్టి తవ్వుకునేందుకు లీజు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి మైనింగ్‌ శాఖ కేవలం 10,596 క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. నిబంధనకు మించి ఒక్క మీటరు పరిమాణం మట్టిని తవ్వితే ఐదు రెట్లు, అనుమతులు ఉన్న ప్రాంతానికి మించి తవ్వకాలు జరిపితే పది రెట్లుగా జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. అయితే లీజుదారుడు ఈ నిబంధనలను గాలికి వదిలేశాడు. 6 మీటర్ల లోతు మేరకు తవ్వకాలు జరపాల్సి ఉండగా, 10 అడుగుల లోతుకు తవ్వకాలను జరిపారు. తవ్వకాల్లో నిబంధనలకు పాతరేశారు. మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా గురజాల శివారులో నూతనంగా వేస్తున్న వెంచర్లకు తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

చర్యలు తీసుకుంటాం

అనుమతులకు మించి తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం.   సర్వే చేయించి చర్యలు తీసుకుంటాం. లీజుకు తీసుకున్న భూ విస్తరణకు మించి తవ్వకాలు జరిపినా జరిమానా విధిస్తాం.  - కిషోర్‌, భూగర్భ గనుల శాఖ ఏడీ, దాచేపల్లి


Updated Date - 2022-05-19T05:14:58+05:30 IST