ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2020-07-06T09:54:32+05:30 IST

గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సాయిబాబా మందిరాల్లో వేడుకలు ..

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సాయిబాబా మందిరాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలుచేశారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నదానం, తీర్ధప్రసాదాలు అందజేశారు. గుంటూరు నగరంలోని పలు సాయిమందిరాల్లో గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. బ్రాడీపేట 4/7లోని శ్రీశ్రీ అభయహస్త షిరిడీసాయి మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా బాబాని ప్రత్యేక పూలతో అలంకరించి, భక్తులకు ఆలయంలోకి ప్రవేశం లేకుండా  దర్శనం కల్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేడుకలను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వి.చంద్రశేఖర్‌ తెలిపారు.  నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులోని సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించారు.


పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణానికి చెందిన విలువిద్య నిపుణులు లింగంగుంట్ల సుబ్బారావును ఆ పార్టీనాయకులు రంగిశెట్టి రామకృష్ణ తదితరులు సన్మానించారు. పిడుగురాళ్లలోని షిరిడిసాయి మందిరంలో  సాయిబాబాను ప్రత్యేకంగా అలంకరించారు. థర్మల్‌స్కాన్‌ పరీక్షలు నిర్వహించి భక్తులను అనుమతించారు. కరోనా వైరస్‌ నిర్మూలనకోసం ప్రత్యేకపూజలు నిర్వహించారు. కారంపూడి, రొంపిచర్ల, సత్తెనపల్లి, నకరికల్లు, ఫిరంగిపురం, అమీనాబాద్‌ శ్రీదత్తపీఠం, వైకుంఠపురంలోని భవఘ్ని ఆరామం, పలు సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళగిరి మండలం పెదవడ్లపూడి షిరిడీ సాయిబాబా ఆలయంలో జడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాపట్లలోని శ్రీషిరిడిసాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు.సంపత్‌ గణపతిపరివార్‌ ఆధ్వర్యంలో శ్రీమహర్షి ఆశ్రమ గోశాలలో ఆదివారం సుబ్రహ్మణ్య పాశుప్రతి రుద్రహోమం నిర్వహించారు. కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవాసమితి ఆవరణంలో ప్రత్యేక పూజలు జరిపారు.


తెనాలి పట్టణంలోని ఆలయాల్లో గురుపౌర్ణమి పూజలు నిర్వహించారు. మారీసుపేట, సాయిబాబా మందిరాల్లో సాప్తాహం నిర్వహించి బాబాకు రుద్రాభిషేకం, పుష్పార్చన జరిపారు. మారీసుపేట శివాలయంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి పూజలు చేశారు. దత్తసాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భట్టిప్రోలు రథం సెంటర్‌లోని శ్రీ షిర్డిసాయిబాబా మందిరంలో షిర్డిసాయినాథునికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. బాలాత్రిపుర సుందరి సమేత హేమవిఠలేశ్వరస్వామి దేవస్థానంలోనూ, సమరసత సేవాఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. పొన్నూరు పట్టణ, మండలంలోని సాయిమందిరాలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పట్టణానికి చెందిన జెమిలి శ్రీనివాసరావు, సునీత దంపతులు 8 గ్రాములు బంగారు బొట్టును శ్రీ షిర్డీ సాయిబాబాకు బహూకరించారు.పెదకాకాని సమీప ఆటోనగర్‌ బైపాస్‌లోని గణేష్‌సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు బండారు సుబ్బారావు దంపతులు తెలిపారు.  చేబ్రోలు మండలం శలపాడు తదితర గ్రామాల్లో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. పెదనందిపాడు సాయిమందిరంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. 

Updated Date - 2020-07-06T09:54:32+05:30 IST