తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-29T04:37:09+05:30 IST

కొండపి పంచాయతీ శివారు దాసరెడ్డిపాలెంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మండల పరిషత్‌ స్కూల్‌ వద్ద పెనుప్రమాదం తప్పింది.

తప్పిన పెను ప్రమాదం
స్కూల్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌, కూలిపోయిన ప్రహరీ, గేటు, ఈశ్వరమ్మ మృతదేహం

ప్రభుత్వ పాఠశాలలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

మహిళ మృతి, మరొకరికి తీవ్రగాయాలు 

ప్రహరీ, గేటు ధ్వంసం.. డ్రైవర్‌ మద్యం మత్తులో ఘటన! 

ప్రమాద సమయంలో పదుల సంఖ్యలో విద్యార్థులు 

కొండపి, అక్టోబరు 28 : కొండపి పంచాయతీ  శివారు దాసరెడ్డిపాలెంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మండల పరిషత్‌ స్కూల్‌ వద్ద పెనుప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మట్టిలోడుతో ఉన్న ట్రాక్టర్‌ స్కూలు లోపలకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్కూల్‌ వెలుపల ఉన్న ఇద్దరిని ట్రాక్టర్‌ ఈడ్చుకుంటూ వెళ్లడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకర్ని ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తుండగా మరణించారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.  ట్రాక్టర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో స్కూల్‌లో పదుల సంఖ్యలో ఉన్న చిన్నారులు ఈ సంఘటనతో బిత్తరపోయారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... 

గురువారం ఉదయం 9.30 నిమిషాలకు స్కూల్‌కు విద్యార్థులు వస్తున్నారు. కొందరు తల్లితండ్రులు తమ పిల్లలను వదిలిపెట్టి వెళ్తున్నారు. మారాం చేసిన చిన్నారులకు స్కూల్‌కు వెలుపల ఉన్న బంకులో తినుబండారాలు కొనిచ్చి  వదిలిపెట్టి వెళుతున్నారు. ఇంతలో మృత్యుశకటంగా ఓ ట్రాక్టర్‌ దూసుకొచ్చింది. మనుమడికి తినుబండారాలు కొనిచ్చేందుకు బంక్‌ ముందు నిల్చుని ఉన్న నలమాల ఈశ్వరమ్మతోపాటు చిరువ్యాపారులకు వడ్డీకి డబ్బు ఇచ్చి, వారంవారం వసూలు చేసుకునే రాజమండ్రికి చెందిన శ్రీనివా్‌సలను ట్రాక్టర్‌ ఈడ్చుకుంటూ వెళ్లి స్కూల్‌ ప్రహరీని ఢీకొట్టి ఆగింది. ప్రహరీతోపాటు గేటు ట్రాక్టర్‌ వేగానికి పడిపోయాయి. దాసరెడ్డిపాలేనికి చెందిన డ్రైవర్‌ బారెడ్డి ప్రసాద్‌ మద్దులూరు రోడ్డులో ఉన్న ఓ ఎరువుల దుకాణం యజమాని ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం నుంచి ఎరువుల దుకాణానికి మెరక కోసం చెరువు మట్టిని ట్రాక్టర్‌తో తోలుతున్నాడు. అప్పటికే రెండుసార్లు తోలి మూడో ట్రిప్పును తీసుకెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ పూటుగా మద్యం తాగి ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు ట్రాక్టరు వదిలి పరారయ్యాడు.


హాస్పటల్‌కి వెళ్తుండగా మృతి

దాసరెడ్డిపాలేనికి చెందిన నలమాల ఈశ్వరమ్మను ట్రాక్టర్‌ ఢీకొట్టిన వెంటనే ఒంగోలు రిమ్స్‌కు 108 వాహనంలో తరలించారు. చేతికి, తలకు, కాలికి బలమైన గాయాలు కాగా, వైద్యశాలకు సమీపంలోకి వెళ్తుండగానే ఈశ్వరమ్మ ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌లోనే ఈశ్వరమ్మ భౌతిక కాయాన్ని ఉంచారు. రాజమండ్రికి చెందిన మైక్రో ఫైనాన్స్‌ వసూలు చేసుకునే వ్యక్తిని కూడా ఒంగోలు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అతనికి కూడా తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై వి. రాంబాబు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-29T04:37:09+05:30 IST