‘గ్రేటర్‌’ పోరుకు సై

ABN , First Publish Date - 2020-09-24T08:46:05+05:30 IST

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో ఆరు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ పార్టీలు

‘గ్రేటర్‌’ పోరుకు సై

జీడబ్ల్యుఎంసీ ఎన్నికలకు మరో ఆరునెలలే గడువు

ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన ప్రధాన పార్టీలు

ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కేటీఆర్‌

డివిజన్ల స్థాయిలో కమిటీల ఏర్పాటులో కాంగ్రెస్‌

దూకుడు పెంచిన బీజేపీ

పోరాటాలతో సిద్ధమవుతున్న వామపక్షాలు 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ అర్బన్‌

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.  మరో ఆరు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా కార్యకర్తలను సమీకరించేందుకు కుదరడం లేదు.. లేదంటే ఇప్పటికే భారీ ఎత్తున ఆశావహులు మద్దతు కూడగట్టే యత్నంలో హోటళ్లు, లాడ్జీలు కిటకిటలాడేవి. ఈసారి ఏ విధంగానైనా కార్పొరేషన్‌పై జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు ముందస్తుగా కసరత్తు చేస్తున్నాయి.


 రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అతి పెద్దది. 58 డివిజన్లతో నాలుగు నియోజకవర్గాల పరిధిలో జీడబ్ల్యూఎంసీ విస్తరించి ఉంది. గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు వరంగల్‌ అభివృద్ధిపై భారీగా హామీలు గుప్పించారు. కానీ అమలు జరగలేదు. 2016లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 58డివిజన్లలో 44 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగలిగారు. బీజేపీ, సీపీఎంలు ఒక్కో స్థానాలతో సరిపెట్టుకున్నాయి. మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. టీఆర్‌ఎ్‌సకు చెందిన నన్నపునేని నరేందర్‌ మేయర్‌గా ఎంపికయ్యారు. మూడేళ్ల తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్‌ మేయర్‌ పదవికి రాజీనామా చేసి వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కొద్ది నెలలకు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత గుండా ప్రకాశ్‌రావు మేయర్‌గా ఎంపికయ్యారు. 


2015లో వరంగల్‌లో మూడురోజులపాటు బసచేసిన సీఎం కేసీఆర్‌.. నగర అభివృద్ధికి ఏడాదికి రూ.300కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అలాగే 2016 జీడబ్ల్యూఎంసీ ఎన్నికల సందర్భంగా భూగర్భ డ్రెయినేజీ నిర్మిస్తామని ప్రకటించినా అది పట్టాలు ఎక్కలేదు. ఇక మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఊసే లేకుండా పోయింది. 


చినుకు పడితే చాలు.. వరంగల్‌ నగర కాలనీలు ఏరులై పారుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పలు కాలనీలు రోజుల తరబడి నీళ్లల్లోనే ఉండిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. స్మార్ట్‌సిటీ, హృదయ్‌, అమృత్‌ వంటి కేంద్ర పథకాలతో జరిగే పనులు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌తో కలిపి గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని టీఆర్‌ఎస్‌ నేతలే అంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌కు మార్చిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశముందని పేర్కొంటున్నారు. ఈలోపు వరంగల్‌ అభివృద్ధిపై అధికార పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 


రంగంలోకి మంత్రి కేటీఆర్‌..!

గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ అంశాలు లేకపోతే ప్రజలు తమ వైపు ఏ విధంగా మొగ్గుతారన్న అనుమానం టీఆర్‌ఎ్‌సకు ఉంది. జీడబ్ల్యూఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మునిసిపల్‌ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ ఆరు నెలల్లో వరంగల్‌ ప్రజల అభిమానం చూరగొనేందుకు ప్రత్యేక పథకాలు అవసరమనే భావన ఉంది. దీనికితోడు కాజీపేట నుంచి వరంగల్‌ వరకు మోనో రైలు మార్గం ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే వరంగల్‌ నగరంలోని ప్రధానమైన సమస్యల పరిష్కారంపై కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.


దూకుడు పెంచిన బీజేపీ 

ఇటీవలి కాలంలో గ్రేటర్‌వరంగల్‌ పరిధిలో బీజేపీ దూకుడు పెంచింది. అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో పార్టీ కార్యకలాపాలు జోరందుకున్నాయి. దీనికితోడు ఇటీవల నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కుమార్‌ వరంగల్‌ పర్యటన టీఆర్‌ఎస్‌- బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎంపీ అర్వింద్‌ వాహనంపై దాడిచేయడం.. ప్రతిగా వరంగల్‌ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేల ఇళ్లపై కోడిగుడ్లతో బీజేపీ శ్రేణుల దాడి ఉద్రిక్తతలకు దారితీసింది. గత పాలకవర్గంలో బీజేపీకి కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్‌ ఉన్నారు. ఈసారి ఏకంగా మేయర్‌ స్థానాన్నే కైవసం చేసుకోవాలనే యత్నంలో ఉన్నారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే వరంగల్‌పై నజర్‌ వేశారు. అలాగే ఎంపీ అర్వింద్‌ను గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలకు ముందు రంగంలోకి దించనున్నట్లు సమాచారం.


కాంగ్రెస్‌ కసరత్తు..

గ్రేటర్‌ వరంగల్‌లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. డివిజన్‌ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి నేతలను ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారు. వీరంతా వారానికి ఒకసారి వరంగల్‌కు వచ్చి డివిజన్‌ నాయకులతో సమావేశమవుతారు. దీనికితోడు గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో నెలకొన్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు గుర్తించే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి సారిస్తున్నారు. వరంగల్‌లో నెలకొన్న సమస్యలపై ఆందోళనలు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సంబంధించిన నాయకులతో తరచుగా జూమ్‌ ద్వారా హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.


వామపక్షాలు సైతం..

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో వామపక్షాలు నిర్ణయాత్మక శక్తిగా ఉంటాయి. వామపక్షాలు ముందు నుంచి కార్మికవర్గాల కోసం అనేక రూపాల్లో పోరాటాలు చేశాయి. ప్రస్తుతం సీపీఎం ఒక స్థానంలో  ప్రాతినిథ్యం వహిస్తోంది. వామపక్షాలతో కార్మికులు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. వామపక్షాల నాయకత్వంలోనే అనేక ప్రాంతాల్లో కాలనీలు వెలిశాయి. దీంతో గుడిసేవాసుల్లో  ఇప్పటికీ వామపక్షాలకు గట్టి పట్టు ఉంది. కొంత కాలంగా నిశబ్దంగా ఉన్న వామపక్షాలు.. తిరిగి ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. 

Updated Date - 2020-09-24T08:46:05+05:30 IST