ఆసక్తికరం.. ‘గ్రేటర్‌’ సమరం..

ABN , First Publish Date - 2021-05-05T05:35:11+05:30 IST

ఆసక్తికరం.. ‘గ్రేటర్‌’ సమరం..

ఆసక్తికరం.. ‘గ్రేటర్‌’ సమరం..

 టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నువ్వా - నేనా

 ఏడు డివిజన్లలో విజయం అంచులకు వెళ్లిన బీజేపీ

 34వ డివిజన్‌లో 4 ఓట్లతో బయటపడిన ‘దిడ్డి’

 5, 63వ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

 3 డివిజన్లలో గులాబీకి చెక్‌ పెట్టిన స్వతంత్రులు

 22వ డివిజన్‌లో టీఆర్‌ఎ్‌సను ఓడించిన ఏఐఎ్‌ఫబీ

వరంగల్‌ సిటీ, మే 4: జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయం సాధించినా పలు డివిజన్లలో ప్రత్యర్థులతో హోరాహోరీ పోరును ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 10 డివిజన్లలో గెలవడం ఒక అంశమైతే.. మరికొన్ని డివిజన్లలో టీఆర్‌ఎ్‌సకు గట్టి పోటీ ఇచ్చింది. 34వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. చివరకు 4 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దిడ్డి కుమారస్వామి విజయం సాధించినప్పటికీ బీజేపీజరిపిన బలమైన యుద్ధం చర్చనీయాంశమైంది. 

ఇక కాంగ్రెస్‌ రెండు డివిజన్లలో టీఆర్‌ఎ్‌సకు గట్టిపోటీ ఇచ్చి స్వల్ప ఓట్లతో నెగ్గింది. ప్రధాన పార్టీలతో ఎదురైన పోటీ ఒక ఎత్తు అయితే.. ముగ్గురు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి ఖంగు తినిపించారు. ఓడించిన ముగ్గురిలో కేడల పద్మ, మాడిశెట్టి శివశంకర్‌ వంటి వారు ఆపార రాజకీయ అనుభవం ఉన్న వారే కావడం ప్రస్తావనార్హం. ఏఐఎ్‌ఫబీ పక్షాన 22వ డివిజన్‌లో బస్వరాజు కుమరస్వామి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించారు. 60 డివిజన్లు గెలుస్తామనుకున్న గులాబీ దళానికి కొన్ని డివిజన్లలో జరిగిన హోరాహోరీ పోరు కారణంగా 48 డివిజన్లే ఆ పార్టీ ఖాతాలో చేరాయి. 

టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య..

  టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య కొన్ని డివిజన్లలో రసవత్తర పోరు జరిగింది. ముఖ్యంగా 34వ డివిజన్‌ పోరు ఉత్కంఠను రేపింది. ఒక దశలో బీజేపీ అభ్యర్థి బైరబోయిన శ్యాంసుందర్‌ గెలిచాడనే అనధికార వెల్లడిలతో హోరు రేకెత్తింది.  11 ఓట్లతో శ్యాంసుందర్‌ గెలిచాడనే సంకేతాలు బయటకు రావడంతో బీజేపీ సంబురపడింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మళ్లీ కౌంటింగ్‌ జరిపారు. చివరకు 4ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దిడ్డి కుమారస్వామి విజయం సాధించినట్లు అధికార ప్రకటన వెల్లడైంది. 

 7వ డివిజన్‌లో కూడా బీజేపీ తన బలాన్ని చాటింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల శ్రీనివా్‌సకు బీజేపీ అభ్యర్థి గండ్రాతి శ్రీనివాస్‌ బలమైన పోటీ ఇచ్చాడు. దీంతో వేముల శ్రీనివాస్‌ 88 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచాడు. 51వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి రంజిత్‌రావు కూడా బీజేపీ నుంచి బలమైన పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది. 80 ఓట్ల మెజారిటీతో ఆయన బీజేపీ అభ్యర్థి అమర్‌నాథ్‌రెడ్డిపై గెలిచారు. 

  23వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఆడెపు స్వప్న టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి ఎలగం లీలావతి మధ్య హోరాహోరి పోరు జరిగింది. చివరకు బీజేపీనే విజయం వరించింది. 100 ఓట్ల మెజారిటీతో ఆడెపు స్వప్న విజయం సాధించారు. 27వ డివిజన్‌లోనూ బీజేపీ, టీఆర్‌ఎ్‌సల మధ్యనే జరిగిన పోరులో బీ జేపీ అభ్యర్థి చింతాకుల అనిల్‌కుమార్‌ 314 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమే్‌షబాబును ఓడించాడు. 

  37వ డివిజన్‌లో బీజేపీ, టీఆర్‌ఎ్‌సల మధ్యనే బలమైన పోరు జరిగింది. 289 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేల్పుగొండ సువర్ణ విజయం సాధించారు. 54వ డివిజన్‌ పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుంటి రజిత బీజేపీ అభ్యర్థి రాధిక నుంచి గట్టి పోటీనే ఎదుర్కొవాల్సి వచ్చింది. 180 ఓట్ల ఆధికత్యతో గుంటి రజిత గెలిచారు.  ఏడు డివిజన్లలో నువ్వా, నేనా అనే రీతిలో టీఆర్‌ఎ్‌సకు బీజేపీ పోటీ ఇచ్చి చెమటలు పట్టించింది. పది డివిజన్లు బీజేపీ గెలిచి, మరో ఏడు డివిజన్లలో విజయం అంచుల వరకు వెళ్లడం ఆ పార్టీకి పెరిగిన బలానికి సూచికగా నిలిచింది. 

కాంగ్రెస్‌ - టీఆర్‌ఎస్‌

 2016 ఎన్నికల్లోవలే కాంగ్రెస్‌ ఈ సారి కూడా నాలుగు డివిజన్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థిగా నిలిచింది. 63వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌,  కాంగ్రె్‌సల మధ్య  హోరాహోరీ పోరు జరిగింది. చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి యెలిగేటి విజయశ్రీ 21 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంచు కోమలపై విజయం సాధించారు. 

  5వ డివిజన్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పోతుల శ్రీమన్నారాయణ 101 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాడిశెట్టి విద్యాసాగర్‌పై విజయం సాధించాడు. 61వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలకంటి రాములుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాగరిక గట్టి పోటీనే ఇచ్చారు. 338 ఓట్లతో రాములు విజయం సాధించాడు. 64వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆవాల రాధికరెడ్డికి కాంగ్రెస్‌ అభ్యర్థి బైరి వరలక్ష్మ్టి బలమైన పోటీనే ఇచ్చారు. ఆవాల రాధికరెడ్డి 199 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

గట్టి పోటీ

ఈ ఎన్నికల్లో ఏఐఎ్‌ఫబీ పార్టీ బోణీ కొట్టింది. 22వ డివిజన్‌ నుంచి బస్వరాజు కుమారస్వామి ఏఐఎ్‌ఫబీ పక్షాన బరిలో నిలిచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గీతారెడ్డిపై 320 ఓట్లతో విజయం సాధించారు. మొత్తంగా టీఆర్‌ఎ్‌సకు బలమైన పోటీని ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఆకర్షించగా.. స్వతంత్ర అభ్యర్థులు సిట్టింగ్‌ కార్పొరేటర్లను ఓడించి ప్రత్యేకంగా నిలిచారు. ఇక కాంగ్రెస్‌ నాలుగు డివిజన్లలో టీఆర్‌ఎ్‌సను ఓడించి మరో మూడు డివిజన్లలో గట్టి పోటీని ఇచ్చింది. తూర్పు నియోజకవర్గంలో ఒక్క డివిజన్‌ కూడా సొంతం చేసుకోకపోవడం పార్టీ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. గెలిచిన నాలుగు డివిజన్లు వరంగల్‌ పశ్చిమలోనివే కావడం గమనార్హం.  


స్వతంత్రుల జోరు

ఎన్నికల బరిలో స్వతంత్రుల్లో నలుగురు తమ సత్తా చాటారు. నలుగురిలో ఒకరైన 55వ డివిజన్‌ స్వతంత్ర అభ్యర్థి శ్రీదేవి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జక్కుల రమా వెంకటేశ్వర్లుకు బలమైన పోటీ ఇచ్చి 84 ఓట్ల తేడాతో ఓడారు. ఇక 42వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేడల పద్మపై స్వతంత్ర అభ్యర్థి గుండు చందన 1,174 ఓట్ల ఆధిక్యతతో గెలువడం గమనార్హం. 31వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి మామిళ్ల రాజు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాడిశెట్టి శివశంకర్‌ను 800 ఓట్ల మెజారిటీతో ఓడించారు. 49వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి ఏనుగుల మానస టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 357 ఓట్లతో గెలిచారు.

Updated Date - 2021-05-05T05:35:11+05:30 IST