గ్రేటర్‌ RTC టార్గెట్‌.. రోజుకు నాలుగు కోట్లు.. Sajjanar స్పెషల్‌ ఫోకస్‌..

ABN , First Publish Date - 2022-04-25T15:06:23+05:30 IST

ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌లో నెల క్రితం వరకు రోజుకు రూ. 3 కోట్ల వరకు ఆదాయం వచ్చేది...

గ్రేటర్‌ RTC టార్గెట్‌.. రోజుకు నాలుగు కోట్లు.. Sajjanar స్పెషల్‌ ఫోకస్‌..

  • ఆ దిశగా ప్రత్యామ్నాయాలపై దృష్టి
  • మరిన్ని పెట్రోల్‌ బంకులు, బస్టాండ్లలో మెడికల్‌ షాపులు
  • జూన్‌ నాటికి మరో 500 బస్సులు 
  • ఏప్రిల్‌లో 3.5 కోట్లకు చేరిన ఆదాయం

ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌లో నెల క్రితం వరకు రోజుకు రూ. 3 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. సేఫ్టీ, డీజిల్‌ సెస్‌లతో రోజు వారీ ఆదాయం ఈ నెలలో రూ.3.5 కోట్లకు చేరింది. ఆదే దిశలో ప్రజలపై భారం మోపకుండా రోజూ రూ.4 కోట్లకు ఆదాయం  సమకూర్చుకునేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


హైదరాబాద్‌ సిటీ : ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై గ్రేటర్‌ ఆర్టీసీ దృష్టి సారిస్తోంది. డిపోలలో ఖాళీ స్థలాలను కమర్షియల్‌ అవసరాలకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో ఖాళీస్థలాలను గుర్తిస్తూ ఆయా ప్రాంతాల్లో మరిన్ని పెట్రోల్‌ బంకులు అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. బస్టాండ్లను ఆధునికీకరిస్తూ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తో పాటు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మెడికల్‌ షాపులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.


తొలుత బస్సుల పెంపుపై..

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల పెంపుపై ఆర్టీసీ దృష్టి సారిస్తోంది. 2019లో కొవిడ్‌కు ముందు గ్రేటర్‌లో ఆర్టీసీ 3,800 బస్సులను నడిపేది. పాతవి కావడంతో వెయ్యి బస్సులను పక్కన పెట్టింది. దీంతో ఒకేసారి బస్సుల సంఖ్య 2800కు పడిపోయింది. గ్రేటర్‌లో ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే సుమారు 7 వేల బస్సులు కావాల్సి ఉంటుంది. భారీ నష్టాల్లో ఉన్న సంస్థ ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనే పరిస్థితిలో సంస్థ లేనందున అద్దె ప్రాతిపదికన అయినా జూన్‌ నాటికి మరో 500 బస్సులు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.


ఎలక్ర్టిక్‌ బస్సులతో కోట్లు ఆదా..

గ్రేటర్‌లో పూర్తి స్థాయిలో ఎలక్ర్టిక్‌ బస్సులు అందుబాటులోకి తీసుకు వస్తే సంస్థ ఆర్థిక కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. దశల వారీగా రెండు, మూడేళ్లలో 5 వేలకు పైగా ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెడితే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఆర్టీసీ రోజువారి ఆదాయంలో సుమారు 1.6-1.8 కోట్లు డీజిల్‌కే వెచ్చించాల్సి వస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్సులతో ఆ ఖర్చు తగ్గనుంది. ప్రస్తుతం ఓలెక్ర్టా కంపెనీతో కలిసి ఆర్టీసీ 44 ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రూట్‌లో నడుపుతోంది. 


సజ్జనార్‌ స్పెషల్‌ ఫోకస్‌ 

గ్రేటర్‌లో నష్టాలు తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకోవడంపై ఎండీ సజ్జనార్‌ మొదటి నుంచీ ప్రత్యేక దృష్టిసారించారు. సీనియర్‌ రిటైర్డ్‌ అధికారుల సూచనలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంజీబీఎస్‌లో ఉచిత ఎలక్ర్టిక్‌ బగ్గీ సేవలు, టాయిలెట్‌ సేవలు ప్రారంభించారు. ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీకి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై సజ్జనార్‌ దృష్టి సారించారు.

Updated Date - 2022-04-25T15:06:23+05:30 IST