Greater RTC రూట్‌ సర్వే.. కొత్త రూట్లపై దృష్టి

ABN , First Publish Date - 2022-02-22T12:06:50+05:30 IST

కొవిడ్‌ తీవ్రత తగ్గింది. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఐటీ సంస్థలూ తెరుచుకుంటున్నాయి...

Greater RTC రూట్‌ సర్వే.. కొత్త రూట్లపై దృష్టి

  •  ప్రయాణికులను పెంచుకునే దిశగా ప్రయత్నాలు
  • ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులు
  • ఈ ఏడాది చివరి నాటికి మరో 300 ఎలక్ట్రిక్‌ బస్సులు

హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ తీవ్రత తగ్గింది. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఐటీ సంస్థలూ తెరుచుకుంటున్నాయి. కొన్నిరోజులుగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో గ్రేటర్‌ ఆర్టీసీ రద్దీ రూట్లపై దృష్టి సారించింది. ఏ సమయంలో ఎక్కడ రద్దీ అధికంగా ఉంటుంది, ఏ రూట్లలో బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి.. అనేది తెలుసుకునేందుకు రూట్‌ సర్వేలు చేస్తోంది. నివేదికల ఆధారంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల ట్రిప్పులు పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. అందుబాటులో ఉన్న బస్సులతో రోజుకు రెండు, మూడు వేల అదనపు ట్రిప్పులు పెంచేదిశగా ప్రణాళికలు రచిస్తోంది. రద్దీ రూట్లలో సూపర్‌ వైజర్లను నియమించడంతో స్టాప్‌లో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటోంది.


ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులు..

నగరంలో బస్సుల సంఖ్య పెంచుకుంటే నష్టాలు కొంత తగ్గించుకునే అవకాశాలుంటాయని, ఆ దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గత ఏడేళ్లుగా గ్రేటర్‌లో కొత్తబస్సులు లేవని, 40 ఎలక్ర్టిక్‌బస్సులు మాత్రమే కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఏడాదిలో మరో వెయ్యి బస్సులు స్ర్కాప్‌కు వెళ్లనుండటంతో గ్రేటర్‌లో దశల వారీగా కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చేదిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. మార్చిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇందు కోసం ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తునట్లు సమాచారం. గ్రేటర్‌లో 300 ఎలక్ర్టిక్‌ బస్సులు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.


కొన్నేళ్లుగా కొత్త రూట్లు లేవు..

గ్రేటర్‌లో 800కు పైగా రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. కొన్నేళ్లుగా కొత్తరూట్లు పెద్దగా అందుబాటులోకి తీసుకురాలేదు. గ్రేటర్‌ విస్తరించడంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా నివాస సముదాయాలు వెలిశాయి. దీంతో ఆయా ప్రాంతాలను కలుపుతూ కొత్తబస్‌ రూట్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా డిపోల వారీగా సర్వేలు చేపడుతోంది. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో 50-60 వరకు కొత్త రూట్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు రూట్‌మ్యా్‌పలు సిద్ధం చేస్తున్నారు. బస్సుల సమయపాలన వివరాలు తెలిసేలా బస్టా్‌పలలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో ప్రతి బస్టా్‌పలో బస్సుల వివరాలు తెలిపే బోర్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రూట్లు పెంచితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో రోజు 2800 బస్సులు 25 వేలకుపైగా ట్రిప్పులు తిరుగుతుండగా, 22 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ట్రిప్పుల సంఖ్య పెంచుకుంటూ 30 లక్షల మంది ప్రయాణికులను పెంచుకునే లక్ష్యంగా ముందుకువెళ్తునట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.



Updated Date - 2022-02-22T12:06:50+05:30 IST