రివర్స్ గేర్‌లో గ్రేటర్ RTC.. కావాల్సింది 7 వేలు.. తిరుగుతున్నవి 2,800.. ఏటా తగ్గిపోతున్నాయ్.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2021-11-27T16:05:21+05:30 IST

భాగ్యనగరంలో ఆర్టీసీ రివర్స్‌ గేర్‌లో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా...

రివర్స్ గేర్‌లో గ్రేటర్ RTC.. కావాల్సింది 7 వేలు.. తిరుగుతున్నవి 2,800.. ఏటా తగ్గిపోతున్నాయ్.. ఎందుకిలా..!?

భాగ్యనగరంలో ఆర్టీసీ రివర్స్‌ గేర్‌లో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సింది పోయి ఏటా వాటిని తగ్గిస్తూ వస్తోంది. కొత్త బస్సులను తీసుకువచ్చే దిశగా కూడా అడుగులు వేయడం లేదు. పెట్రో భారం పెరిగిపోవడంతో నష్టాలు మూటగట్టుకుంటున్న యాజమాన్యం ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారిస్తే లాభాల బాటలో నడిచే అవకాశముంది


హైదరాబాద్‌ సిటీ : సిటీ బస్సుల్లో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. రద్దీ వేళల్లో ఫుట్‌బోర్డు ప్రయాణాలు చేయలేక ప్రైవేట్‌వాహనాల్లో పరుగులు తీస్తున్నారు. కొవిడ్‌ ఎఫెక్ట్‌తో రెండు నెలలక్రితం వరకు ఖాళీగా కనిపించిన బస్సుల్లో ప్రస్తుతం రద్దీ పెరిగింది. విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో అమీర్‌పేట, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఘట్‌కేసర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర మార్గా ల్లో విద్యార్థులతోపాటు ప్రయాణికులు ఎక్కువగా సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్‌లో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా బస్సులు పెంచకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలు రోడ్లపైకి భారీగా వస్తున్నాయి. 


పదేళ్ల క్రితంతో పోలిస్తే నగరంలో ప్రైవేట్‌ వాహనాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. గ్రేటర్‌లో ప్రస్తుత జనాభాతో పోలిస్తే వ్యక్తిగత వాహనాలు 40 శాతం వరకు ఉండగా.. మరో 25 ఏళ్లలో అది 60 శాతానికి పెరుగుతుందని ఓ అధ్యయనంలో అంచనా వేశారు. గ్రేటర్‌లో 2012 సంవత్సరంలో 3,811 బస్సులు ఉండగా 2021 నాటికి బస్సుల సంఖ్య 2,800 పడిపోయింది. గడిచిన తొమ్మిదేళ్లలో పెరిగిన జనాభా అవసరాల మేరకు 7 వేల బస్సులు అవసరం. ప్రస్తుతం సిటీ రోడ్లపై 2,800 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి.  2019 వరకు గ్రేటర్‌లో 3,800 బస్సులుండగా వాటిలో వెయ్యిబస్సులు పాతబడ్డాయని స్ర్కాప్‌ చేశారు.


మినీతో.. సో మెనీ లాభాలు

నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తే ప్రయోజనం చేకూరే అవకాశాలున్నా ఆ దిశగా ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చార్మినార్‌ పరిధిలో గతంలో 100 మినీ బస్సులు నడిపింది. క్రమం గా వాటిని పక్కనపెట్టేయడంతో గ్రేటర్‌లో వాటి సంఖ్య తగ్గిపోయింది. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తుండటంతో కాలనీలు, బస్తీలకు ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో అనుసంధానం చేయడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో 5-8 కిలోమీటర్లు వెళ్లాలంటే ప్రైవేట్‌ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సులు కనిపించడం లేదు. 


గతంలో సంజీవరెడ్డి నగర్‌, బల్కంపేట మార్గంలో బస్సులు నడిపిన ఆర్టీసీ ఇప్పుడు ఆయా రూట్లలో వాటిని ఎత్తేసింది. ఇలాంటి పరిస్థితులే నగరంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కాలనీలు, బస్తీల నుంచి ప్రధాన రహదారుల వరకు మినీ బస్సులు 24 గంటలు నడిపితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతోపాటు నష్టాలు కూడా తగ్గే అవకాశాలుంటాయని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. టికెట్‌ లేకుండా మినీబస్సుల్లో స్వైపింగ్‌ మిషన్లు, కార్డు సిస్టం అందుబాటులోకి తీసుకువచ్చి తక్కువ సిబ్బందితో బస్సులు ఆపరేట్‌ చేసే అవకాశాలున్నా ఆ దిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.


కొత్త బస్సులు ఎప్పుడో..

గ్రేటర్‌లో నడుస్తున్న బస్సుల్లో సగానికి పైగా బస్సుల్లో వచ్చేసంవత్సరం స్ర్కాప్‌కు వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాయి. ఆర్టీసీ ముందుకు వెళ్లాలన్నా, నష్టాలు తగ్గించుకోవాలన్నా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం తప్పనిసరి అని రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ మినీ బస్సులు పెద్ద సంఖ్యలో నగరంలో అందుబాటులోకి తీసుకువస్తే డీజిల్‌ భారం తగ్గడంతోపాటు ఆ డీజిల్‌ ఖర్చులకు చెల్లిస్తున్న మొత్తాలను ఈఎంఐ రూపంలో చెల్లించుకునే వీలుంటుందని కొంతమంది సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచితే పదేళ్లలో ఆర్టీసీ రూపు రేఖలు మారిపోతాయని, ఆ దిశగా ప్రభుత్వం ఆర్టీసీకి ఆర్థిక సహాయం అందించాలంటూ పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Updated Date - 2021-11-27T16:05:21+05:30 IST