టీడీఆర్‌.. గ్రేటర్‌ రికార్డ్‌.. 1500 కోట్ల ఆదా!

ABN , First Publish Date - 2021-04-10T16:14:44+05:30 IST

ఆస్తుల సేకరణకు అందుబాటులోకి తీసుకువచ్చిన అభివృద్ధి బదలాయింపు హక్కు

టీడీఆర్‌.. గ్రేటర్‌ రికార్డ్‌.. 1500 కోట్ల ఆదా!

  • అత్యధిక స్థాయిలో సర్టిఫికెట్ల జారీ
  • వాటి విలువ రూ.3095 కోట్లు
  • ఆస్తుల సేకరణలో భాగంగా ఇస్తోన్న జీహెచ్‌ఎంసీ
  • సంస్థకు రూ.1500 కోట్ల ఆదా
  • కొనుగోలుకు మొగ్గు చూపుతోన్న రియల్టర్లు

ఆస్తుల సేకరణకు అందుబాటులోకి తీసుకువచ్చిన అభివృద్ధి బదలాయింపు హక్కు(టీడీఆర్‌) సక్సెస్‌ అయ్యిందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడేళ్లలో రికార్డు స్థాయిలో టీడీఆర్‌ సర్టిఫికెట్లు జారీ చేశామని సంస్థ పేర్కొంటోంది. నీతి ఆయోగ్‌ కూడా జీహెచ్‌ఎంసీలో టీడీఆర్‌ల జారీని ప్రశసించిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 807 టీడీఆర్‌లు ఇచ్చామని, వీటి విలువ రూ.3095.50కోట్ల వరకు ఉంటుందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.


హైదరాబాద్‌ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ), రోడ్లు, నాలాల విస్తరణ, చెరువుల సుందరీకరణ వంటి పనుల్లో భాగంగా సేకరిస్తోన్న ఆస్తుల కోసం అధికారులు టీడీఆర్‌లు జారీ చేస్తున్నారు. ఆస్తులు కోల్పోయే బాధితులకు రావాల్సిన పరిహారం కంటే స్థలం/నిర్మాణాన్ని బట్టి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ విలువైన సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మిస్తోన్న వంతెనలు, అండర్‌పా్‌సలు, రోడ్ల కంటే ఆస్తుల సేకరణకు ఎక్కువ నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వంతోపాటు జీహెచ్‌ఎంసీకి ఆర్థిక భారంగా మారుతోంది. ఆ భారం తగ్గించేందుకు టీడీఆర్‌ను అమలు చేస్తున్నారు.


మార్పులతో పెరిగిన డిమాండ్‌

ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు 2006లో నగరంలోటీడీఆర్‌ ప్రారంభించారు. అప్పటి నిబంధనల ప్రకారం మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల విస్తరణలో కోల్పోయే ఆస్తులకు 100 శాతం, చెరువులు, కుంటల్లో ఉన్న నిర్మాణాలకు 50 శాతం టీడీఆర్‌ ఇచ్చేవారు. 2012లో ఈ నిబంధనలు మారాయి. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల ఆస్తుల సేకరణకు 200 శాతం, చెరువులు, కుంటల్లోని ఆస్తులకు 100 శాతం పరిహారం ఇచ్చేవారు. టీడీఆర్‌కు డిమాండ్‌ లేకపోవడంతో 2017లో ప్రభుత్వం మరోసారి నిబంధనలు సవరించింది. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల విస్తరణ పరిహారాన్ని 400 శాతం, చెరువులు, కుంటల్లో ఉన్న ఆస్తులకు 200 శాతం, హెరిటేజ్‌ భవనాలకు 100 శాతానికి పెంచింది. అదనపు అంతస్తుతోపాటు సెట్‌ బ్యాక్‌లకూ మినహాయింపునిచ్చింది. దాంతోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఎక్కడైనా జీహెచ్‌ఎంసీ జారీ చేసిన టీడీఆర్‌ను వినియోగించుకోవచ్చనే వెసులుబాటు కల్పించింది. దీంతో టీడీఆర్‌లకు డిమాండ్‌ పెరిగింది. రియల్‌ వ్యాపారులతోపాటు సామాన్యులు ఈ సర్టిఫికెట్‌  తీసుకుంటున్నారని నగర ముఖ్య ప్రణాళికాధికారి ఎస్‌. దేవేందర్‌రెడ్డి తెలిపారు. 


ఏంటీ టీడీఆర్‌..? 

వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా సేకరించే ఆస్తులకు పరిహారానికి బదులు కల్పించే అభివృద్ధి బదలాయింపు హక్కు టీడీఆర్‌. డబ్బులు కాకుండా.. వాస్తవ పరిహారానికి రెండు నుంచి నాలుగు రెట్లు విలువైన టీడీఆర్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఆస్తుల సేకరణలో భాగంగా ఎవరైనా వ్యక్తి కోల్పోయిన ఆస్తి విలువ (చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో లేని నిర్మాణమైతే) సబ్‌రిజిస్ర్టార్‌ ధర ప్రకారం రూ.50 లక్షలు అనుకుంటే.. రూ.2 కోట్ల విలువ చేసే సర్టిఫికెట్‌ను జీహెచ్‌ఎంసీ అతనికి జారీ చేస్తుంది. దాన్ని సొంతంగా భవనం నిర్మిస్తే రుసుము చెల్లింపునకు వినియోగించుకోవచ్చు. లేదా రియల్‌ వ్యాపారులకు విక్రయించవచ్చు. టీడీఆర్‌ వినియోగించిన భవనానికి సెట్‌ బ్యాక్‌ల్లో మినహాయింపుతోపాటు అదనంగా ఒక అంతస్తు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది. ఆస్తి కోల్పోయిన బాధితుడితో పాటు కొనుగోలు చేసిన నిర్మాణదారుడికీ దీని వల్ల ఉపయోగం ఉంటుంది. జీహెచ్‌ఎంసీకి ఆస్తుల సేకరణ ఆర్థిక భారం తగ్గుతుంది. 


రూ.1500 కోట్ల వరకు ఆదా... 

ఎస్‌ఆర్‌డీపీ, లింక్‌ రోడ్లు, రహదారుల విస్తరణ, చెరువుల సుందరీకరణ, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ, నాలాల విస్తరణ పనుల కోసం చేస్తోన్న ఆస్తుల సేకరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ టీడీఆర్‌లు జారీ చేస్తోంది. ఇప్పటి వరకు 807 టీడీఆర్‌ సర్టిఫికెట్లు జా రీ చేయగా.. వాటి విలువ రూ.3095.50 కోట్లు. కొన్ని ఆస్తుల కు సంబంధించి నాలుగు రెట్లు, మరి కొన్నింటికి రెండు రెట్ల వి లువైన టీడీఆర్‌లు ఇచ్చారు. దీంతో జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ. 1500 కోట్ల వరకు ఆదా అయ్యిందని అధికారులు చెబుతున్నారు.

 

టీడీఆర్‌ బ్యాంక్‌ చూడండి ఇలా...

ఆన్‌లైన్‌లో టీడీఆర్‌ బ్యాంక్‌ చూసేందుకు http://tdr.ghmc.telangana.gov.in:80 80// లేదా www.ghmc.gov.in ద్వారా జీహెచ్‌ఎంసీ హోమ్‌ పేజీకి వెళ్లి ఆన్‌లైన్‌ సర్వీసె్‌సపై క్లిక్‌ చేయాలి. అందులో కనిపించే ట్రాన్స్‌ఫర్‌ డెవల్‌పమెంట్‌ రైట్‌ (టీడీఆర్‌)పై క్లిక్‌ చేస్తే బ్యాంక్‌ ఓపెన్‌ అవుతుంది.


టీడీఆర్‌ బ్యాంక్‌...

టీడీఆర్‌ల సమాచారం అందరికి తెలిసేలా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఆన్‌లైన్‌ బ్యాంక్‌ యాప్‌ రూపొందించారు. గతేడాది ఫిబ్రవరిలో యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ బ్యాంక్‌లో టీడీఆర్‌ వివరాలతోపాటు సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబర్‌, సర్టిఫికెట్‌ విలువ ఎంత..? అన్న సమాచారం ఉంటుంది.  టీడీఆర్‌ ఉన్న వారికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. వాటి ద్వారా విక్రయానికి అవకాశం ఉంటుంది. అవసర మున్న నిర్మాణదారులు వివరాలను పరిశీలించి టీడీఆర్‌ యజమానులను ఫోన్‌ నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. ఇందులో అధికారుల జోక్యం ఉండదు. ఒక వ్యక్తి వద్ద రూ.50 లక్షల విలువైన టీడీఆర్‌ ఉంటే.. అవసరం ఉన్న వారు తమకు కావాల్సిన రూ.20 లక్షల విలువ మేరకు కొనుగోలు చేసిన పక్షంలో మిగతా రూ.30 లక్షల టీడీఆర్‌ బ్యాంక్‌లో ఉంటుంది. ఎవరు టీడీఆర్‌ విక్రయించారు..? దాని విలువ..? ఎవరు కొనుగోలు చేశారు..? మిగిలిన టీడీఆర్‌ ఎంత..? అన్న వివరాలు ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయి.

Updated Date - 2021-04-10T16:14:44+05:30 IST