Greater Chennai Corporation: నివాసయోగ్యంకాని పాత భవనాల లెక్కింపు

ABN , First Publish Date - 2022-08-13T13:35:12+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) పరిధిలో ప్రాచీన, నివాసయోగ్యం కాని పాత భవనాలను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు.

Greater Chennai Corporation: నివాసయోగ్యంకాని పాత భవనాల లెక్కింపు

                                       - నగర కార్పొరేషన్‌ నిర్ణయం


చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) పరిధిలో ప్రాచీన, నివాసయోగ్యం కాని పాత భవనాలను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు సన్నాహాలు చేపట్టారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి కూలేందుకు సిద్ధంగా వున్న భవనాలను గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ముందస్తు పనులను కూడా చేపట్టినట్లు కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఆ సమయంలో పాత భవనాలు కూలే అవకాశముందని అధికారులు యోచిస్తున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు.. పురాతన భవనాలను కూల్చివేయాల్సిందేనని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరంలో చేపట్టాల్సిన వరద ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టే విషయమై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌(Gagandeep Singh) ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆ సమావేశంలో నగరంలో శిథిలస్థితిలో ఉన్న, ఏ మాత్రం నివసించేందుకు వీలుకాని పాత భవనాలు, ఇళ్ళను లెక్కించాలని అధికారులను ఆదేశించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను కూల్చివేసేందుకు కూడా చర్యలు చేపట్టాలన్నారు. ఆ మేరకు నగరంలో ప్రాచీన భవనాలను లెక్కింపు పనులను చేపట్టేందుకు అన్నా విశ్వవిద్యాలయం నిపుణుల కమిటీని కూడా రంగంలోకి దింపారు. ఆ కమిటీ సభ్యులు ప్రస్తుతం నగరమంతటా రెసిడెన్షియల్‌(Residential) ప్లాట్ల వద్ద పాత భవనాలను పరిశీలిస్తున్నారు. అంబత్తూరు జోన్‌లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు చెందిన భవన సముదాయంలో కొంత భాగం పూర్తిగా దెబ్బతినడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల మొదటివారంలోపు పాత భవనాల లెక్కింపు, పరిశీలన పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత శిథిల స్థితిలో ఉన్న కట్టడాలను కార్పొరేషన్‌ అధికారులు ఎక్స్‌కవేటర్ల ద్వారా కూల్చివేయనున్నారు.

Updated Date - 2022-08-13T13:35:12+05:30 IST