గ్రేటర్‌ Chennaiలో గెలుపెవరిది?

ABN , First Publish Date - 2022-02-18T15:43:40+05:30 IST

రాజధాని నగరం చెన్నై కార్పొరేషన్‌ ఈసారి ఎవరి సొంతం కానుంది?... రాష్ట్ర అధికార డీఎంకే పార్టీదా? లేక గతంలో ఈ పీఠంపై చక్రం తిప్పిన అన్నాడీఎంకేదా?.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన డీఎంకే

గ్రేటర్‌ Chennaiలో గెలుపెవరిది?

                             - ఈసారి Dmk వశమేనా! 


పెరంబూర్‌(చెన్నై): రాజధాని నగరం చెన్నై కార్పొరేషన్‌ ఈసారి ఎవరి సొంతం కానుంది?... రాష్ట్ర అధికార డీఎంకే పార్టీదా? లేక గతంలో ఈ పీఠంపై చక్రం తిప్పిన అన్నాడీఎంకేదా?.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన డీఎంకే చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల్లో అదే స్థాయిలో మెజారిటీ కౌన్సిలర్లను గెలిపించుకుంటుందా? లేక అన్నాడీఎంకే వ్యూహం ముందు బోర్లా పడుతుందా?.. మరో రెండ్రోజుల్లో నగర ఓటరు ఏం తీర్పు ఇవ్వనున్నాడు?.. ఇదీ ఇప్పుడు ఎవరి నోట విన్నా జరుగుతున్న చర్చ. అయితే గత చరిత్రను పరిశీలిస్తే నగరంపై డీఎంకేదే ఆధిక్యమని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు రాష్ట్ర అధికారం కూడా ఆ పార్టీ చేతిలో ఉండడంతో నగరంలో డీఎంకే విజయం నల్లేరుపై నడకేనని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక అన్నాడీఎంకే అయితే కనీసస్థాయి కౌన్సిలర్లను సంపాదించుకున్నా చాలని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తుండగా, ఈపీఎస్‌ పట్టుదలను అంత సులువుగా తీసుకోవడానికి లేదని డీఎంకే వర్గాలు అప్రమత్తమవుతున్నాయి. పారిశుద్ధ్యం, శాంతిభద్రతలు, ప్రజలకు వసతుల కల్పన, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సహా పలు అంశాల్లో దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా చెన్నై అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే ఏటారూ.700 కోట్ల ఆస్తి పన్ను వసూలు, రూ.2,500 కోట్ల బడ్జెట్‌తో చెన్నై కార్పొరేషన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇంతటి కీర్తి ప్రతిష్టలు సంతరించుకున్న ఈ కార్పొరేషన్‌ చేజిక్కించుకొనేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు పరుగు మొదలుపెట్టాయి. 


200 వార్డుల్లో 2,670 మంది పోటీ

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని 200 వార్డు కౌన్సిలర్‌ పదవులకు మొత్తం 3,546 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిల్లో 243 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 633 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో, ఎన్నికల బరిలో 2,670 మంది నిలిచారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే 200 వార్డులు, నామ్‌ తమిళర్‌ పార్టీ 199, బీజేపీ 198, పీఎంకే 194, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం 189, మక్కల్‌ నీది మయ్యం 176, డీఎంకే 167 స్థానాలు, 954 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక, డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ 16 స్థానాలు, డీపీఐ 6, సీపీఎం 5, సీపీఐ 3, ఎండీఎంకే 2 స్థానాల్లో పోటీచేస్తున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలోని 22 శాసనసభ, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులే విజయం సాధించి ఉన్నారు. దీంతో, తమ తమ నియోజకవర్గాల పరిధిలోని వార్డుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రచారం చేయగా, మంత్రులు ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు పార్టీ అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌, నటి ఖుష్బూ ప్రచారం నిర్వహించారు.


మేయర్‌ పదవి ఎవరికి?

ప్రస్తుత ఎన్నికల్లో చెన్నై మేయర్‌ పదవిని ఎస్సీ (మహిళ)కి కేటాయించారు. అలాగే, 200 వార్డుల్లో 28, 31, 46, 47, 52, 53, 59, 70, 74, 77, 85, 111, 120, 135, 159, 196 తదితర 16 వార్డులు ఎస్సీ మహిళలకు కేటాయించారు. ఈ స్థానాల నుంచి ఎన్నికైన మహిళల్లో ఒకరు మేయర్‌ పీఠం అధిరోహించనున్నారు. 16 వార్డుల్లో 4 వార్డులు కూటమి పార్టీలకు కేటాయించిన డీఎంకే 12 వార్డుల్లో పోటీచేస్తోంది. డీఎంకే మెజార్టీ వార్డులు గెలిస్తే, ఆ పార్టీ తరఫున 17వ వార్డులో పోటీచేస్తున్న పంచాయతీ అధ్యక్షుడు పుళల్‌ నారాయణన్‌ భార్య కవికి మేయర్‌ పదవి దక్కే అవకాశముందని పార్టీలోని ఒక వర్గం చెబుతుండగా, సీఎం స్టాలిన్‌ నియోజకవర్గమైన కొళత్తూర్‌ 70వ వార్డులో పోటీచేస్తున్న శ్రీధని కూడా మేయర్‌ రేసులో ఉందని మరో వర్గం చెబుతోంది. అలాగే, 100వ వార్డు (ఎస్సీ జనరల్‌) లో పోటీచేస్తున్న మాజీ కౌన్సిలర్‌ వసంతి పరమశివం కూడా మేయర్‌ పదవికోసం పోటీపడుతున్నారు.ఇక డిప్యూటీ మేయర్‌ పదవి కోసం 110వ వార్డులో పోటీచేస్తున్న ఎన్‌.సిట్రరసు, 169వ వార్డులో పోటీచేస్తున్న ఎం.మహే్‌షకుమార్‌, 137వ వార్డులో పోటీచేస్తున్న కె.ధనశేఖర్‌, 177వ వార్డులో పోటీచేస్తున్న పి.మణిమారన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అన్నాడీఎంకే అధిక స్థానాలు కైవసం చేసుకొంటే, ఆ పార్టీ తరఫున ‘రెండాకులు’ చిహ్నంపై పోటీచేస్తున్న మాజీ ఐఏఎస్‌ అధికారి, సమూహ సమత్తువ పడై అధ్యక్షురాలు పి.శివగామి మేయర్‌ అభ్యర్థి రేసులో ముందున్నారు. అలాగే, 47వ వార్డు అభ్యర్థి ఎస్‌ఆర్‌ అంజులక్ష్మి, 62వ వార్డు అభ్యర్థి పీవీ జయకుమారి, 46వ వార్డు అభ్యర్థి జి.కృష్ణవేణి, 196వ వార్డు అభ్యర్థి కె.అశ్విని కూడా మేయర్‌ రేసులో ఉన్నారు. అయితే వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది 23న తేలిపోనుంది. 

Updated Date - 2022-02-18T15:43:40+05:30 IST