మహా ఉత్కంఠ!

ABN , First Publish Date - 2022-06-26T08:00:02+05:30 IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ కల్లోలం శనివారానికి కూడా ఒక కొలిక్కి రాలేదు. వేరు కుంపటి పెట్టిన శివసేన ఎమ్మెల్యేలపై..

మహా ఉత్కంఠ!

రెబెల్స్‌పై స్వరం పెంచిన శివసేన


ఉద్ధవ్‌ అధ్యక్షతన జాతీయ కార్యనిర్వాహక భేటీ.. ఆరు తీర్మానాలు

బాలాసాహెబ్‌ పేరును ఇతరులు వాడితే చట్టపరమైన చర్యలు

బాలాసాహెబ్‌ హిందుత్వ సిద్ధాంతం కొనసాగింపు: ఠాక్రే

24 గంటల్లో రెబెల్‌ మంత్రుల బర్తరఫ్‌: సంజయ్‌ రౌత్‌

రెబెల్స్‌ గ్రూప్‌ పేరు  ‘శివసేన-బాలాసాహెబ్‌’.. ఎమ్మెల్యేల ప్రకటన

ఖండించిన ఏక్‌నాథ్‌.. 16 మంది రెబెల్స్‌పై అనర్హత వేటు?

రెబెల్స్‌ ఇళ్లపై శివసైనికుల దాడులు.. ముంబైలో 144 సెక్షన్‌ 


ముంబై, జూన్‌ 25: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ కల్లోలం శనివారానికి కూడా ఒక కొలిక్కి రాలేదు. వేరు కుంపటి పెట్టిన శివసేన ఎమ్మెల్యేలపై.. ఆ పార్టీ మరింత తీవ్రంగా స్వరాన్ని పెంచగా.. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని తిరుగుబాటుదారులు తమ పంథాను పునరుద్ఘాటిస్తూ ప్రకటనలు చేశారు. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతకు శివసేన ప్రయత్నాలు ప్రారంభించగా.. రెబెల్స్‌ ఏకంగా డిప్యూటీ స్పీకర్‌పైనే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అటు మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సతో తిరుగుబాటు వర్గం నేత ఏక్‌నాథ్‌ షిండే భేటీ అయ్యారు.


ఈ నేపథ్యంలో శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఆరు కీలక తీర్మానాలను ఈ సమావేశం ప్రకటించింది. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు దాడులకు దిగారు. దీంతో.. ముంబైలో 144 సెక్షన్‌ను, పుణె, థానెల్లో నిషేధాజ్ఞలను విధించారు. కాగా, రెబెల్స్‌కు బాలాసాహెబ్‌(బాల్‌ఠాక్రే) పేరుతో ఓట్లు అడుక్కునే అధికారం లేదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ అన్నారు. శివసేన జాతీయ కార్యనిర్వాహక సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ సమావేశంలో ఆరు కీలక తీర్మానాలు చేశాం. అవి.. ప్రస్తుత పరిస్థితిని అదుపు చేసేందుకు పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు సర్వాధికారాలు ఉంటాయి. కొవిడ్‌ కల్లోలంలో ఉద్ధవ్‌ సమర్థంగా పనిచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాం. ముంబైలో వనరుల కల్పనపై ధన్యవాద తీర్మానం నాలుగోది. ఐదో తీర్మానం- బాలాసాహెబ్‌ పేరును వాడుకునేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బాలాసాహెబ్‌ హిం దూత్వ సిద్ధాంతం చివరి తీర్మానం’’ అని ఆయన వివరించారు.


అనర్హత.. అవిశ్వాసం లేఖలు

ఏక్‌నాథ్‌ వేరుకుంపటి తర్వాత ఆయనను శివసేన శాసనసభాపక్ష నేతగా తొలగించి అజయ్‌చౌదరిని నియమించిన విషయం తెలిసిందే. అజయ్‌చౌదరి శనివారం 16మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌కు లేఖ రాశారు. దీంతో నరహరి 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సోమవారంలోగా లిఖితపూర్వక సమాధానమివ్వాలని ఆదే శించారు. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్‌ నరహరిపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఏక్‌నాథ్‌ సహా.. 34 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు తాము సంతకం చేసిన లేఖను ఈ-మెయిల్‌లో పంపారు. అయితే.. ఆ మెయిల్‌ గుర్తుతెలియని, విశ్వసించలేని సోర్స్‌ నుంచి వచ్చిందని పేర్కొంటూ.. నరహరి అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. మరోవైపు మహారాష్ట్ర విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సతో కేంద్ర మంత్రి రాందాస్‌ ఆఠవాలే భేటీ అయ్యారు. ఇక.. తిరుగుబాటు వర్గీయుల ఇళ్లు, కార్యాలయాలపై శివసైనికులు దాడులకు పాల్పడ్డారు. థానెలోని ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో.. థానె కలెక్టర్‌ రాజేశ్‌ నర్వెకార్‌ నగరంలో నిషేధాజ్ఞలను విధించారు. బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పా టుపై ఏక్‌నాథ్‌ షిండే, ఫడణవీస్‌ చర్చించినట్లు తెలుస్తోంది. 


హోటళ్ల బిల్లు ఎవరు భరిస్తున్నారు?

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు లగ్జరీ హోటళ్లకు ఖర్చులు, చార్టర్డ్‌ విమానాల చార్జీలను ఎవరు భరిస్తున్నారని ఎన్‌సీపీ ప్రధాన అధికార ప్రతినిధి మహేశ్‌ తాప్సీ ప్రశ్నించారు. దీనిపై ఈడీ, ఐటీ శాఖలు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కాగా.. గువాహటి రాడిసన్‌ బ్లూ హోటల్‌లో రెబెల్‌ ఎమ్మెల్యేల కోసం బుక్‌ చేసిన 70 గదులకు వారానికి రూ. 1.12 కోట్లు అవుతుందని అంచనా. నేతల తరలింపునకు వినియోగించిన చార్టర్డ్‌ విమానాల్లో ఒక్క ట్రిప్‌నకు రూ.50 లక్షలు ఖర్చవుతుంది.


శివసేన బాలాసాహెబ్‌!

తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కొందరు తమ గ్రూప్‌ పేరును ‘శివసేన-బాలాసాహెబ్‌’గా ప్రకటించడం దుమారాన్ని రేపింది. ముంబై విలేకరులతో గువాహటి నుంచి వర్చువల్‌గా ప్రెస్‌మీట్‌ పెట్టిన అసమ్మతి ఎమ్మెల్యే దీపక్‌ కేసర్కర్‌ తాము బీజేపీతో కలవాలనుకుంటున్నామని, ఉద్ధవ్‌ను దించడం తమ లక్ష్యం కాదని తెలిపారు. ‘‘మేం శివసేనలోనే శివసేన-బాలాసాహెబ్‌ వర్గంగా కొనసాగుతాం. 55 మంది ఎమ్మెల్యేలున్న మా గ్రూప్‌.. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోగలదు’’ అని వ్యాఖ్యానించారు. ఏక్‌నాథ్‌ మాత్రం ఈ ప్రకటనలను ఖండించారు. ‘‘మేము బాలాసాహెబ్‌ తయారు చేసిన శివసైనికులమే. వేరే గ్రూపుపై మేము ఏ నిర్ణయమూ తీసుకోలేదు’’ అని తెలిపారు.

Updated Date - 2022-06-26T08:00:02+05:30 IST