Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మార్పునకు ‘మహా’ నాంది!

twitter-iconwatsapp-iconfb-icon
మార్పునకు మహా నాంది!

ఎన్టీఆర్‌.. అనే పేరులోనే వైబ్రేషన్‌ ఉంది. తెలుగునాట రాజకీయాలలో ప్రభంజనంలా దూసుకువచ్చిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నేలను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. ‘ఈ శతాబ్దం నాది..’ అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనదైన శకాన్ని సృష్టించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ గుత్తాధిపత్యంలో రాజకీయాలు నలిగిపోతున్న వేళ నాలుగు దశాబ్దాల క్రితం, సినిమా రంగంలో వెండితెర ఇలవేల్పుగా కొలుపులందుకున్న నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రం చేశారు. ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా!’ అంటూ ఎన్టీఆర్‌ ఇచ్చిన పిలుపునకు తెలుగు నేల పులకించింది. తిరుగులేని ఆధిపత్యంతో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే మట్టి కరిపించి అధికారంలోకి వచ్చారు. రాజకీయ అనుభవం ఏమాత్రం లేని ఎంతో మంది యువతను ఎమ్మెల్యేలు, మంత్రులుగా తీర్చిదిద్దారు. భారత రాజకీయాలలో ఆదిపరాశక్తిగా వెలుగుతున్న ఇందిరాగాంధీతో ముఖ్యమంత్రిగా కలబడ్డారు. సినిమావాడికి రాజకీయాలు ఏమి తెలుసు? పాలించడం చేతనవుతుందా? అని హేళన చేసిన వారి నోళ్లు మూతపడ్డాయి. సినిమాలలో వేసిన పాత్రల ప్రభావమో ఏమో గానీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగునాట సంక్షేమానికి తొలిసారిగా పెద్దపీట వేశారు. సంక్షేమానికి, సామాజిక న్యాయానికి తామే చిరునామా అని ఇవాళ ఎవరైనా చెప్పుకొంటూ ఉండవచ్చు గానీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్ర్తాలు, యాభై రూపాయలకే హార్స్‌ పవర్‌ విద్యుత్‌ను రైతులకు సరఫరా చేయడం, పేదలకు మొదటిసారిగా పక్కా ఇళ్లు వంటి పథకాలను అమలుచేసిన ఘనత ఎన్టీఆర్‌దే! అప్పుడు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ పది వేల కోట్ల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.


పెత్తందారీ వ్యవస్థకే పరిమితమైన రాజకీయాలలో బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేశారు. సామాజిక న్యాయభేరి అంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు బస్సు యాత్ర చేస్తుండవచ్చు గానీ, నిజమైన సామాజిక న్యాయాన్ని ఎన్టీఆర్‌ ఆనాడే చిత్తశుద్ధితో అమలుచేసి చూపించారు. రాజకీయాలలో అవినీతికి తావు ఉండకూదని ఎన్టీఆర్‌ బలంగా నమ్మారు. పంజాబ్‌లో ఆప్‌ ముఖ్యమంత్రి మాన్‌ తన మంత్రిమండలిలోని ఒక మంత్రి అవినీతికి పాల్పడ్డాడని తెలిసి వెంటనే బర్తరఫ్‌ చేయడమే కాకుండా జైలుకు పంపడాన్ని ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకొంటున్నాం కానీ, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఈ పని అప్పుడే చేశారు. కార్మిక శాఖ మంత్రి రామచంద్రరావు పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా అప్పట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆ రోజుల్లో అదొక సంచలనం. కపటం తెలియని ఎన్టీఆర్‌ ఇలాంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థల రద్దు వంటివి మచ్చుకు కొన్ని. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాకుండా రాజకీయాలలో 33 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. స్వచ్ఛ భారత్‌ అంటూ మరుగుదొడ్ల నిర్మాణానికి ఇవాళ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం గానీ మూడున్నర దశాబ్దాల క్రితమే ఎన్టీఆర్‌ మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇలా చెప్పుకొంటూ పోతే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ కీర్తి కిరీటంలో ఎన్నో కలికితురాయిలు కనిపిస్తాయి. పేదల గుండెల్లో గూడుకట్టుకున్న ఎన్టీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక నాటి కాంగ్రెస్‌ నాయకులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.. చివరికి కులాన్ని కూడా ఆయనకు ఆపాదించారు. రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలోనూ ఆయన పెను సంచలనం అయ్యారు. కుటుంబసభ్యులను అధికారానికి ఆమడ దూరంలో ఉంచేవారు.


ప్రభుత్వ వాహనాలను వాడనిచ్చే వారు కాదు. కారణం ఏమైనప్పటికీ, ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించారు. ఫలితంగా 1995లో ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడయ్యారు. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే ఆయన కన్నుమూశారు. ఎన్టీఆర్‌ శకాన్ని చూసిన వారికి ఇప్పటి రాజకీయాల పట్ల ఏవగింపు కలగకుండా ఉండదు. కుల, మతాలు, ప్రాంతీయ వివాదాలు నేటి రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలకు నిర్వచనమే మారిపోయింది. అధికారం అంటే బాధ్యత అని విస్మరించి, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రులు రారాజులుగా అధికారాన్ని అనుభవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు నాయుడు చేపట్టారు. 1995 నుంచి నేటి వరకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. రాజకీయాలలో వచ్చిన మౌలిక మార్పుల ప్రభావంతో తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని అవలక్షణాలు ప్రవేశించాయి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కూడా మారిపోయాయి. అభ్యుదయవాదంతో పాలనా సంస్కరణలను అమలుచేసి నాడు సంక్షేమానికి ఎన్టీఆర్‌ ఎనలేని ప్రాధాన్యం ఇవ్వగా, అభివృద్ధికి, టెక్నాలజీకి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన పేదలకు కొంత దూరమయ్యారు. చంద్రబాబు చొరవ తీసుకొని ఉండకపోతే రెండు రోజుల క్రితం ద్విదశాబ్ది ఉత్సవాలు జరుపుకొన్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బి) హైదరాబాద్‌లో ఏర్పాటై ఉండేది కాదు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించి ద్విదశాబ్ది ఉత్సవాలు జరుపుకొన్న ఐఎస్‌బి నిర్వాహకులు కనీసం చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించకపోవడం బాధాకరం. తనను గుర్తుచేసుకోకపోవడంతో చంద్రబాబు కూడా నొచ్చుకున్నారు. అయితే నాయకుడు ఎంత గొప్పవాడు అయినా అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు అన్నదానితో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న వారినే గుర్తించి గౌరవించే రోజులివి అని చంద్రబాబు తెలుసుకోవాలి. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం అలుపెరుగకుండా దేశ విదేశాల్లో పర్యటించి కియా వంటి పరిశ్రమలను తెచ్చిన చంద్రబాబు కృషిని కూడా ప్రజలు గుర్తించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో విహారయాత్రకు వెళ్లినట్టుగా దావోస్‌ వెళ్లి పెట్టుబడిదారులను కనీసం కలవకపోయినా అడిగేవారు లేరు. అదానీతో, అరబిందో శరత్‌చంద్రారెడ్డి వంటి వారితో మాత్రమే సమావేశమైన జగన్మోహన్‌ రెడ్డి, రాష్ర్టానికి లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రకటించుకున్నారు. మన దేశానికి చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి దావోస్‌ వరకూ వెళ్లాల్సిన అవసరం ఉందా? అందుకే కాబోలు జగన్‌ చర్యలను ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త దినేష్‌ జోషి ట్విటర్‌ వేదికగా ఆక్షేపించారు. అయినా జగన్‌ దావోస్‌ వెళ్లి ఎంతో సాధించినట్టుగా నీలి మీడియా, కూలి మీడియా ప్రచారం చేసుకుంటోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నిర్దిష్టమైన ఎజెండాతో దావోస్‌లో పలువురిని కలిసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. దావోస్‌ సదస్సు ముగిసి రెండు రోజులైనా జగన్‌ ఎక్కడున్నారో తెలియదు. ఈ నెల 30న మాత్రమే ఆయన తిరిగి వస్తారు. అయినా ముఖ్యమంత్రిని తప్పుబట్టకూడదు. ఎవరైనా తప్పుబడితే వారిని పాపులుగా చిత్రీకరిస్తారు. ప్రస్తుత రాజకీయ పోకడలు ఇలానే ఉంటున్నాయి.


దమనకాండ ఫలితం!

రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబునాయుడు రాజకీయాల్లో వచ్చిన మార్పులను గమనించలేకపోయారు. ఫలితంగా 2019లో ఓడిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పదవులు అనుభవించిన నాయకులు ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి భయపడి కలుగుల్లో దాక్కోగా, కార్యకర్తలు దిక్కులేని వారయ్యారు. జగన్మోహన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలను పసిగట్టలేకపోయిన చంద్రబాబునాయుడు తన పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లడిల్లిపోయారు. నలభై ఏళ్ల అనుభవం నిండా యాభై ఏళ్ల వయసు కూడా లేని జగన్‌ ముందు ఎందుకూ కొరగాకుండా పోయింది. కోడెల శివప్రసాదరావు వంటి బలమైన నాయకుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించారంటే ప్రభుత్వ దమననీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కూడా అష్టకష్టాలు పడి పార్టీని కాపాడుకోగలిగిన చంద్రబాబుకు కూడా ఒక దశలో దిక్కు తెలియలేదు. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నట్టుగా ప్రభుత్వ దమనకాండతో విసిగిపోయిన తెలుగుదేశం కార్యకర్తలు, ధైర్యం కూడదీసుకొని ప్రతిఘటనకు సిద్ధపడ్డారు. దీంతో నాయకులు కూడా కలుగుల్లోంచి బయటకు వచ్చారు. రెండేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు ఉంటుందా? అని ఎవరిని కదిలించినా ప్రశ్నించేవారు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో ఒంగోలులో జరిగిన మహానాడులో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి. మూడేళ్లుగా మహానాడు కూడా జరుపుకోలేని స్థితిలో ఉండిపోయిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఇప్పుడు ఊరట లభించింది. అంచనాలను పటాపంచలు చేస్తూ ఆహ్వానం అందకపోయినా అశేష సంఖ్యలో కార్యకర్తలు మహానాడుకు అనూహ్యంగా కదిలివచ్చారు. గతంలో ఎన్టీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన మహానాడులను ఎన్నో చూశాను. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు మహానాడుకు ఉప్పొంగిన ఉత్సాహంతో తరలిరావడం ఇదే ప్రథమం.


మీరు అధైర్యపడొద్దు.. మేమున్నాం అని చంద్రబాబునాయుడితో సహా పార్టీ నాయకులకు ధైర్యం చెప్పారు. ఒంగోలులో జరుగుతున్నది మహానాడు కాదు, తెలుగుదేశం పార్టీకి తద్దినం పెట్టుకుంటున్నారు అని తమ్మినేని సీతారాం వంటి వారు హేళన చేసినా, తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో ప్రజలు చూశారు. సామాజిక న్యాయం పేరిట మంత్రులతో చేయిస్తున్న బస్సు యాత్రకు జనం లేక వెలవెలపోగా మహానాడుకు ఇంతమంది పోటెత్తడం దేనికి సంకేతమో సీతారాం వంటి వారికి త్వరలోనే తెలుస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తమ్మినేని సీతారాం కూడా ఎన్నో మహానాడులకు హాజరయ్యారు. అప్పుడు కనిపించని ఉత్సాహం ఇప్పుడు ఎందుకు కార్యకర్తల్లో కనిపిస్తున్నదో సీతారాంకు తెలియకుండా ఉంటుందా? కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి  పొందాలనుకునేవారికి ఈ మహానాడుకు హాజరైన జనం రూపంలో సమాధానం లభిస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తుని వద్ద రైలు దహనం చేసిన సంఘటన వెనుక, నిన్నగాక మొన్న అమలాపురంలో జరిగిన దహనకాండ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలిసిపోయింది. అందుకే పాలకులు ఆశలు పెట్టుకున్న వర్గాలు కూడా సామాజిక న్యాయ భేరి యాత్ర పట్ల ఆసక్తి చూపించలేదు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం జగన్మోహన్‌ రెడ్డి వల్ల కాదని మహానాడు రూపంలో ఇప్పుడు రుజువైంది. మహానాడుకు వచ్చిన వారంతా ముఖ్యమంత్రికి ఇష్టంలేని సామాజిక వర్గానికి చెందినవారేనని అధికార పార్టీ వారు ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. రాజకీయాల్లో ఆత్మవంచనకు పాల్పడకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా 70 శాతం మంది తన పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పుకొనేవారు. 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ కావడానికి చంద్రబాబు కానీ, నాయకులు కానీ కారణం కాదు. ఆ క్రెడిట్‌ జగన్మోహన్‌రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఈ స్థాయిలో దమనకాండకు పాల్పడకపోయి ఉంటే కార్యకర్తల్లో ఇంత కసి ఏర్పడి ఉండేది కాదు.


మారాలి బాబూ!

మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ అయి ఉండవచ్చును గానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లున్నాయి. ఎన్టీఆర్‌ వేసిన పునాది బలంతో తెలుగుదేశం పార్టీ ఇంతకాలం నెట్టుకొచ్చింది. ఇప్పుడు మరో మూడు నాలుగు దశాబ్దాలపాటు పార్టీ నిలబడేలా నాటి పునాదిని పటిష్ఠం చేయవలసిన బాధ్యత పార్టీ అధినేత చంద్రబాబుపై ఉంది. ప్రభుత్వ జులుంను ఎదిరించడం ద్వారా పార్టీ పట్ల తమకున్న అంకితభావాన్ని కార్యకర్తలు రుజువు చేసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలబడిన కార్యకర్తలు పార్టీ రుణం తీర్చుకున్నారు. ఇకపై పార్టీని బలోపేతం చేయవలసిన బాధ్యత చంద్రబాబుతో పాటు ఇతర నాయకులపై ఉంది. 2014-2019 మధ్య ఏం జరిగింది? ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం ఏమిటి? జగన్‌ ప్రవేశంతో రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు ఏమిటి? చంద్రబాబు బలహీనతలు, వైఫల్యాలు ఏమిటి? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించుకోవాలి. ఎన్టీఆర్‌ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల బలహీనవర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్నారు. కారణాలు ఏమైనా బలహీనవర్గాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయి. మరోవైపు ఆ వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ కోలుకోకుండా చేయాలని జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి దరిచేర్చుకోవడానికి చంద్రబాబు చర్యలు తీసుకోవాలి.


చంద్రబాబులో ఉన్న ప్రధాన బలహీనత మొహమాటం. ఈ మొహమాటం కారణంగా అనర్హులను కూడా ఆయన దూరం పెట్టలేకపోయారు. శుక్రవారంనాడు ప్రకటించినట్టుగా పార్టీలోకి యువ రక్తాన్ని ఎక్కించాలి. 40 శాతం కొత్త వారికి పార్టీ టికెట్లు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు గానీ, ఈ సంఖ్యను మరికాస్త పెంచాలి. కనీసం 60 శాతం కొత్త ముఖాలు కనిపించాలి. తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఎన్టీఆర్‌ 90 శాతం కొత్త వారికి పార్టీ టికెట్లు ఇచ్చారు. అభ్యర్థులు ఎవరో తెలియకపోయినా ప్రజలు ఎన్టీఆర్‌ను చూసి గెలిపించారు. ఇప్పుడు కూడా ప్రజల్లో మార్పు వచ్చిన విషయం నిజమైతే అది చంద్రబాబు కోసమే అవుతుంది. ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు నిర్ణయించుకుంటే పార్టీ టికెట్‌ ఎవరికిచ్చినా గెలిపించుకుంటారు. 2019 ఎన్నికల్లో జగన్‌ పోటీ పెట్టిన అభ్యర్థుల్లో చాలా మంది ముఖాలు ఎవరికీ తెలియవు. పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు అయినందున ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్న వారికి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు, తీసుకువచ్చిన సంస్కరణల గురించి తెలియదు. ఈ కారణంగా యువతను ఆకర్షించే చర్యలు ఉండాలి. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్‌ ఈ దిశగా కృషి చేయాలి.


చంద్రబాబు తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటే లోకేశ్‌కు జనామోదం ఉండాలి. తనకంటే చిన్నవాడైన లోకేశ్‌ రాజకీయాలలో తనకు పోటీగా ఉండకూడదన్న ఉద్దేశంతో జగన్‌ అండ్‌ కో ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే లోకేశ్‌ తనను తాను రుజువు చేసుకుంటున్నారు. అనువైన సమయం చూసుకొని అతను పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు చేరువ కావాలి. ఇక చంద్రబాబునాయుడు కూడా తన అనుభవం గురించి మరచిపోయి ఈ తరం రాజకీయాలకు అనువుగా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మెతక వైఖరిని, మొహమాటాన్ని ఆయన దూరం పెట్టాలి. తాను పిరికివాడిని కానని తన నిర్ణయాల ద్వారా రుజువు చేసుకోవాలి. పోయిన పర్యాయం జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. కార్యకర్తల యోగక్షేమాలతో పాటు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. పార్టీ కోసం వేలాది మంది కార్యకర్తలు ఎంతో త్యాగం చేశారు. ఇకపై నాయకులు కూడా త్యాగాలకు సిద్ధపడాలి. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏ కొంతమందిదో కాదు- అందరిదీ అన్న భావన కల్పించాలి. తెలుగుదేశం పార్టీ అంటే తమదీ అన్న భావన అన్ని వర్గాల ప్రజల్లో కలిగేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పులు వచ్చాయి. సమాజంలో సున్నితత్వం నశించింది. ఆంధ్రప్రదేశ్‌ సమాజం తెలంగాణతో పోల్చితే భిన్నమైనది. కులాల కుంపట్లు రగులుకోకుండా చూడటంతో పాటు తెలుగుదేశం పార్టీని అన్ని వర్గాల వారికి చేరువగా తీసుకెళ్లడానికి చంద్రబాబు కృషి చేయాలి. ప్రభుత్వం ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించినా కార్యకర్తలు లెక్కచేయకుండా మహానాడును విజయవంతం చేయడం ద్వారా పార్టీలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఇప్పుడు భవిష్యత్తుపై కార్యకర్తల్లో భరోసా నింపవలసిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్న విషయం వాస్తవం అయితే కారణాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తులో అటువంటి లోపాలు చోటుచేసుకోకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా చంద్రబాబుపైనే ఉంటుంది. ఏ బ్రహ్మ ముహూర్తంలో ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఆలోచన వచ్చిందో  తెలియదు గానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని ఇప్పటివరకూ నిలబడింది. ఇకపై పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే దిశగానే చంద్రబాబు అడుగులు ఉండాలి. పార్టీ కార్యాలయాల్లో ఇప్పటికీ కోటరీ వ్యవస్థ నడుస్తోందన్న వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి సమాచారం యథాతథంగా తనవరకూ చేరేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల్లో తిరుగుతూ వారితో సత్సంబంధాలు పెట్టుకున్న నాయకులకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది అలాంటి వారిని గౌరవించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని కార్పొరేట్‌ కంపెనీల తరహాలో కాకుండా రాజకీయ పార్టీగానే నడపాలి. పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమైన బాధ్యతలను ప్రజలతో సంబంధం ఉన్న నాయకులకే అప్పగించాలన్న డిమాండ్‌ చాలా మంది నుంచి వినిపిస్తోంది. మొత్తమ్మీద జగన్‌ ప్రభుత్వం దాష్టీకాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీ నిలబడిందని మహానాడు ద్వారా రుజువైంది. ఇకపై పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనే ప్రధాన బాధ్యత చంద్రబాబుపైనే ఉంటుంది. ఇందుకోసం ఏమేం చేయాలో గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి పార్టీ అధినేత పూనుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పటివరకు కనిపించిన చంద్రబాబు స్థానంలో సరికొత్త చంద్రబాబు ఆవిష్కృతం కావాలి. అప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీకి గొప్ప పునాది పడుతుంది!

ఆర్కే

మార్పునకు మహా నాంది!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.