‘మహా’ సంచలనం

ABN , First Publish Date - 2021-08-25T06:12:16+05:30 IST

చట్టం ఎవరికైనా ఒకటే అన్న మాట నిజమే కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి అరెస్టు కావడం మాత్రం విడ్డూరమే. గత ఇరవై సంవత్సరాల కాలంలో దేశంలో ఒక కేంద్రమంత్రి...

‘మహా’ సంచలనం

చట్టం ఎవరికైనా ఒకటే అన్న మాట నిజమే కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి అరెస్టు కావడం మాత్రం విడ్డూరమే. గత ఇరవై సంవత్సరాల కాలంలో దేశంలో ఒక కేంద్రమంత్రి ఇట్లా పదవిలో ఉండగా అరెస్టు కావడం ఇదే మొదలట. మహారాష్ట్రకు చెందిన కేంద్రమంత్రి నారాయణ రాణే, దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ నిర్వహిస్తున్న ‘జన ఆశ్వీరాద్ యాత్ర’లో భాగంగా ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో, వచ్చి ఎన్నేళ్లయిందో ఠాక్రేకు తెలియదని, మొన్న ఆగస్టు 15 నాడు, జెండావందన కార్యక్రమంలో పక్కవారిని అడిగి తెలుసుకున్నాడని నారాయణ రాణే విమర్శించారు. తాను ఆ సమయంలో అక్కడ ఉండి ఉంటే కనుక గట్ఠిగా చెంప మీద ఒకటి ఇచ్చి ఉండేవాడిని- అని కూడా రాణే తన వ్యాఖ్యలకు ముక్తాయింపు ఇచ్చారు. చెంపదెబ్బ అన్న మాట సహజంగానే ఠాక్రేను నొప్పించింది. ఆయన అసంఖ్యాక అభిమానులైన శివసైనికులనూ నొప్పించింది. దుర్భాషలాడినందుకు రాణే మీద కేసులు నమోదయ్యాయి. అరెస్టవుతారు జాగ్రత్త అని పాత్రికేయులు హెచ్చరిస్తే, తాను సామాన్యుడిని కాదని తననెవరూ ఏమీ చేయలేరన్న ధీమాను రాణే ప్రకటించారు. ముందస్తు బెయిలు కోసం ముంబయి హైకోర్టును ఆశ్రయిస్తే, న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా పరిగణించలేదు. ఫలితంగా రాణే అరెస్టు జరిగిపోయింది. 


ఠాక్రేకు నిజంగానే స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియదా, నిజంగానే ఆయన ఆగస్టు 15 నాడు, పక్కన కూర్చున్న వారితో లెక్కలు వేశారా- ఇవేవీ ఇంకా నిర్ధారణ కాని అంశాలు. వీడియోలు చూసుకొమ్మని రాణే అంటున్నారు. ఇక్కడ ఆసక్తి కలిగిస్తున్నది, ఆ వ్యాఖ్యలు కాదు, మహారాష్ట్ర ప్రభుత్వ స్పందన. రాణే మామూలు మనిషేమీ కాదు. కొద్ది నెలలపాటే అయినప్పటికీ ఒకప్పుడు శివసేన తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నవాడు. తరువాత కొద్దికాలానికి శివసేన నుంచి బహిష్కృతుడై, ఆ తరువాత కాంగ్రెస్‌­లో కొంతకాలం ఉండి చివరకు బిజెపిలో చేరారు. చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా ఈమధ్య మంత్రివర్గ విస్తరణలో పదవి స్వీకరించారు. మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నది. దీర్ఘకాలం చెలిమి చేసి, గత ఎన్నికల తరువాతనే విడిపోయిన బిజెపి-, శివసేనల మధ్య వైరం పతాకస్థాయికి చేరిందనడానికి రాణే అరెస్టు ఒక సూచన. బిజెపి మీద ఠాక్రే ఆగ్రహం కట్టలు తెగిందనడానికి ఇది ఒక దృష్టాంతం. ఈ అరెస్టుకు పర్యవసానాలు ఉంటాయి. రేపోమాపో బెయిల్ వస్తుంది. దీన్ని రాణే మరచిపోతారేమో కానీ, అమిత్ షా మరచిపోరు. పర్యవసానాలు ఆలోచించే ఠాక్రే ఇట్లా స్పందించారా?  లేక, క్షణికావేశమా?


మొన్నమొన్నటి దాకా రాజకీయవర్గాల్లో, మీడియాలో కొనసాగుతూ వస్తున్న ఊహాగానాలు ఏమిటంటే, శివసేన తిరిగి బిజెపి గూటికి చేరుతోందని. అందుకు ఆధారాలుగా ఇదిగో పులి అంటే అదిగో తోక పద్ధతిలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. జూన్ నెల రెండోవారంలో ఠాక్రే, ప్రధాని నరేంద్రమోదీతో ఏకాంతంగా సమావేశం కావడం సంచలనం కలిగించింది. భారతీయ జనతాపార్టీ నాయకుడొకరు, మళ్లీ మనం మనం కలసిపోదామని ప్రతిపాదిస్తూ రాసిన లేఖ కూడా ఆసక్తి కలిగించింది. అంతకు ముందు దాకా, శివసేన-, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో మహారాష్ట్ర సంబంధాలు ఉప్పు, నిప్పుగానే ఉంటూ వచ్చాయి. బాలీవుడ్ వ్యవహారాల మీద కేంద్రం చూపిన ఆసక్తి, అందుకు భిన్నమైన వైఖరి తీసుకున్న మహారాష్ట్ర, అర్ణవ్ గోస్వామిని అరెస్టు చేయించి అతని ప్రభను తగ్గించిన ఠాక్రే, కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన విధాన ఘర్షణ.. వీటన్నిటి నేపథ్యంలో, బిజెపి, శివసేన పార్టీల మధ్య సఖ్యత గురించిన చర్చ మొదలయింది. మహారాష్ట్ర కూటమిలో చీలికలు వస్తున్నాయన్న వార్తలు వచ్చినప్పుడల్లా, శివసేన ఖండిస్తూ వస్తోంది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో ఠాక్రేకు సత్సంబంధాలున్నాయని శివసేన వక్కాణిస్తోంది. తాజా పరిణామాలు, అటువంటి సఖ్యత అవకాశాలను ఇప్పుడు పూర్తిగా పూర్వపక్షం చేస్తున్నాయి.


ఒకే రకం భావజాలం, ఒకే ఓటుబ్యాంకు కలిగిన ఈ రెండు పార్టీల మధ్య ఎడం పెరగడం ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. ప్రాంతీయతత్వం, మతతత్వం రెండూ కలగలసిన పార్టీగా శివసేన, బిజెపి నుంచి తనను భిన్నంగా చూపుకోవడానికి ప్రాంతీయతత్వం మీదనే ఎక్కువగా ఆధారపడుతోంది. కొన్ని కొన్ని సందర్భాలలో ఆశ్చర్యకరమైన విధాన ప్రకటనలు కూడా చేస్తోంది. తమ రెండు పార్టీల మధ్య విభజనను స్పష్టం చేసేందుకు, తాను ఇతర మిత్రులతో కలసి విడిగానే ప్రయాణిస్తానని రాణే అరెస్టు ద్వారా దృఢంగా, కటువుగా కూడా చెప్పిందనుకోవాలి. 


కేంద్రంలోను, రాష్ట్రంలోను వేర్వేరు ప్రభుత్వాలున్న సందర్భాలలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు పర్యటించినప్పుడల్లా రాజకీయ యుద్ధాలు చెలరేగేవి. రాజకీయ పోరాటంలో భాగంగానే వాటిని పరిగణించి, మాటకు మాట జవాబుతో సరిపుచ్చేవారు. ఇప్పుడు అభ్యంతర వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితో కాక, నేరస్మృతి దృష్టితో చూడడం మొదలవుతోంది. సాంకేతికంగా అందులో తప్పేమీ లేదు, విమర్శల తీరు మరింత సంస్కారవంతంగా మారుతుంది. కానీ, మరీ అరెస్టుల దాకా వెళ్లాలా అన్న ప్రశ్న కూడా ఉచితంగానే ధ్వనిస్తుంది.

Updated Date - 2021-08-25T06:12:16+05:30 IST