మహా రాజకీయం!

ABN , First Publish Date - 2022-06-22T10:37:32+05:30 IST

‘నేనుసముద్రాన్ని, మరింత బలంగా మళ్ళీ వస్తాను’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో చేసిన వ్యాఖ్య ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది...

మహా రాజకీయం!

‘నేనుసముద్రాన్ని, మరింత బలంగా మళ్ళీ వస్తాను’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో చేసిన వ్యాఖ్య ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. మహా వికాస్ అఘాఢీ సంకీర్ణ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభాలు కొత్తేమీ కాదు కానీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ మారు గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ చేస్తున్న మూడో విస్పష్టమైన యత్నం ఇది, ఈ సారికూడా అది విఫలం కాక తప్పదు అని ఎన్సీపీ, శివసేన నాయకులు చెబుతున్నప్పటికీ, వ్యవహారం అంత తేలికగా ముగిసేట్టు కనిపించడం లేదు.


మనవాడేనని అనుకుంటున్నవాడు, అందునా శాసనసభాపక్ష నేతగా ఉన్నవాడు ఉన్న పళంగా అర్ధరాత్రి ఇరవైమందికి పైగా ఎమ్మెల్యేలను ముంబైలో విమానం ఎక్కించి నేరుగా మోదీ స్వరాష్ట్రానికి తరలించుకుపోతే ఠాక్రే అయినా ఏం చేయగలరు? ఏక్‌నాథ్ షిండేతో ఓ పక్కన చర్చలు జరుపుతూనే మరోపక్కన ఆయన పదవులూ అధికారాలూ కత్తిరించేశారు ఉద్ధవ్. ఇరవైనిముషాల సుదీర్ఘ టెలిఫోన్ సంభాషణలో షిండే ప్రధాన షరతు బీజేపీతో శివసేన గతంలో మాదిరిగానే సయోధ్య కుదర్చుకోవడం, అధికారం పంచుకోవడం. ఇది జరిగే పనికాదని ఠాక్రే చెప్పడంతో మాటలు ముగిసిపోయాయని అంటున్నారు. ఆపరేషన్ కమల్ వంటి పెద్దపెద్దమాటలు వాడేయకండి, ఇందులో మా పాత్ర ఇసుమంతైనా లేదు అని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి షిండే సిద్ధపడితే కచ్చితంగా చేయూతనిస్తామని అంటున్నారు. ఇది శివసేన అంతర్గత విషయం అని బీజేపీ మాదిరిగానే పవార్ కూడా అంటున్నారు, ఈ కుట్రలను ఛేదించగలిగే శక్తి ఠాక్రేకు ఉన్నదనీ ప్రశంసిస్తున్నారు. కానీ, ఇందులో పవార్ పాత్ర కూడా ఉండివుండవచ్చునని మరికొందరి అనుమానం. రాష్ట్ర హోంమంత్రి పవార్ మనిషి కనుక, సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర ప్రాంతంలో అంతమంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత సూరత్ వెళ్ళే విమానం ఏక్కుతూంటే ఇంటలిజెన్స్ వర్గాలనుంచి హోంమంత్రికి సమాచారం చేరదంటారా? అని వారి అనుమానం. పైగా, ఈ పరిణామానికి పదిరోజుల ముందునుంచీ పరిస్థితులు అనుకూలంగా లేవు కూడా. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ తనకు దక్కాల్సినకంటే మరో సీటు అదనంగా తన్నుకుపోయింది. అలాగే, సోమవారం శాసనమండలి ఎన్నికల సందర్భంగానూ పన్నెండుమంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటుచేయడమే కాక, ఇండిపెండెంట్లు, చిన్నాచితకా పార్టీల మద్దతును కూడా శివసేన కోల్పోయింది. ఈ బీజేపీ అనుకూల పరిణామాలతో షిండేను ఉద్ధవ్ మందలించారనీ, దానితో తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదనీ, పార్టీలో సంజయ్ రౌత్ పెత్తనం పెరిగిందనీ ఆగ్రహంతో ఉన్న షిండే ఉద్ధవ్‌కు ఇలా వెన్నుపోటు పొడిచారనీ అంటారు.


అఘాడీ ప్రభుత్వానికి ప్రమాదం లేదని ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. 288మంది సభ్యుల అసెంబ్లీలో, యాభైఐదుమంది బలంతో శివసేన అధికారంలో కొనసాగుతున్నది. ఆ కాస్త బలం కూడా తగ్గిపోతే పవార్ బుర్రలో చెడు ఆలోచనలు పుట్టవచ్చు. షిండేతో సూరత్‌లో శివసేన ఎమ్మెల్యేలు పాతికమందికిపైగానే ఉన్నారనీ, ఇండిపెండెంట్లు కూడా ఎక్కువమందే ఉన్నారని ఓ లెక్క. మంగళవారం ఉద్ధవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి 17మంది సేన ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని మరోవార్త. ఈ సంఖ్యలకంటే, మహా శక్తిసంపన్నుడైన ఈ షిండే శివసేనలో కనీసం ఓ ముప్పైమంది ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకోగలవాడని ప్రతీతి. అందువల్ల, మరో అరడజనుమంది ఎమ్మెల్యేలను లాక్కుంటే షిండే శివసేనను చీల్చేయగలడని అర్థం. తిరుగుబాటు షిండే త్వరలోనే వెనక్కువచ్చేస్తాడని చెప్పుకుంటున్న శివసేన ఆయన తన్నుకుపోగా మిగిలిన తన ఎమ్మెల్యేలను జాగ్రత్తగా ఓ హోటల్‌లో దాచింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో ఇప్పుడు మహారాష్ట్రలోనూ ‘ఆపరేషన్ కమల్’ సక్సెస్ అవుతుందా అని కొందరి ప్రశ్న. ఉద్ధవ్‌తో షిండే ఈ దశలో రాజీపడటం, వెళ్ళినవారంతా వెనక్కువచ్చేయడం దాదాపు అసాధ్యం. షిండే మద్దతుదారులంతా రాజీనామా చేస్తే మొత్తంగా అసెంబ్లీ బలం పడిపోతుంది కనుక, తనకున్న శక్తితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సిద్ధపడవచ్చు. ఆపరేషన్ కమల్ లక్ష్యం బలమైన ప్రభుత్వాలను బలహీనపరచి అంతిమంగా బీజేపీ అధికారంలోకి రావడమే, అనుసరించే విధానంలో మాత్రం ఆయా రాష్ట్రాలను బట్టి స్వల్ప తేడాలుంటాయి.

Updated Date - 2022-06-22T10:37:32+05:30 IST