మహనీయులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-11T06:37:37+05:30 IST

మహనీయులను స్మరించుకోవాలి

మహనీయులను స్మరించుకోవాలి
స్టేషన్లో ర్యాలీ చేస్తున్న రైల్వే ఉద్యోగులు

  • డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ప్రత్యూషకుమారి
  • పలుచోట్ల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

 రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 10: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేటి ఆనందకర జీవితాలకు ప్రతీకలని, మహనీయులను అందరు స్మరించుకోవాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం రాజమహేంద్రవరంలో పలుచోట్ల బుధవారం నిర్వహించారు. డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా నిర్వహించారు. స్థానిక డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయం నుంచి శేషయ్యమెట్ట, ఆర్యాపురం, జాంపేట, క్వారీ ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ప్రతీ ఒక్కరు తమ ఇళ్ళపై జాతీయ జెండాలను ఎగురవేయ్యాలని ప్రత్యూషకుమారి సూచించారు. ర్యాలీలో డీఎల్‌ఎస్‌ఏ ప్యానల్‌ న్యాయవాదులు పెల్లూరి రమేష్‌, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, మాగాపు పద్మ, సిరిపురపు నాగేశ్వరావు, కట్టా జనార్ధనరావు, ప్రసన్న, పీఏల్వీలు జీఎస్వీఎస్‌ఎస్‌ వరప్రసాద్‌, వసంతరాయుడు పాల్గొన్నారు. 


ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు.. 


నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కళాకేంద్రంలో జరిగిన చిత్రలేఖనంలో జూనియర్స్‌, సీనియర్స్‌లో 72 మంది పాల్గొని ప్రతిభ చాటారు. అలాగే సాంస్కృతిక, నాట్య ప్రదర్శనలకు సంబంధించి సీనియర్స్‌లో 71 మంది, జూనియర్స్‌లో 160 మంది పాల్గొన్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి వీవీ గిరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ ఎం.సత్యవేణి నివాళులర్పించారు. అనంతరం జరిగిన ప్రదర్శనల్లో శ్రీలాస్య ప్రియా కూచిపూడి అకాడమీ, త్రిబుల్‌ స్టార్‌ డ్యాన్స్‌ అకాడమీ సంప్రదాయ, గిరిజన, జానపద డ్యాన్సు, దేశభక్తి గీతాలపై పలు ప్రదర్శనలు నిర్వహించాయి. కార్యక్రమంలో డీఈవో ఎస్‌ అబ్రహాం, కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 


రైల్వే ఉద్యోగుల ర్యాలీ..


స్థానిక ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఉద్యోగులు మొదటి ప్లాట్‌ ఫాం నుంచి స్టేషన్‌ బయట వరకు జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. స్టేషన్‌ మేనేజరు ఎం.గంగాప్రసాద్‌, చీఫ్‌ టిక్కెట్‌ ఇన్స్‌పెక్టర్‌ కేశవభట్ల శ్రీనివాస్‌ మాట్లాడారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంతో దేశ ప్రజల్లో మరోసారి దేశ భక్తిని, జాతీయ స్ఫూర్తిని రగిలించాలని అన్నారు. రైల్వేస్టేషన్‌ ఆపరేటింగ్‌, టీసీలు, ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:37:37+05:30 IST