ఘనంగా ఫ్రీడం రన్‌

ABN , First Publish Date - 2022-08-12T05:38:37+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం నిర్వహించిన ఫ్రీడం రన్‌కు మంచి స్పందన వచ్చింది. పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు పట్టణంలోని యువతి, యువకులు, పోలీసులు పెద్ద ఎత్తున రన్‌లో పాల్గొన్నారు.

ఘనంగా ఫ్రీడం రన్‌
కామారెడ్డిలో ఫ్రీడం రన్‌ నిర్వహిస్తున్న విద్యార్థులు

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 11: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం నిర్వహించిన ఫ్రీడం రన్‌కు మంచి స్పందన వచ్చింది. పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు పట్టణంలోని యువతి, యువకులు, పోలీసులు పెద్ద ఎత్తున రన్‌లో పాల్గొన్నారు. ఈ రన్‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌లు జితేష్‌ వి.పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రేలు ప్రారంభించగా కామారెడ్డి సీఎస్‌ఐ చర్చి ముందు నుంచి ఇందిరాగాంధి స్టేడియం వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడిస్తూ పట్టణ ప్రజలు ముందుకు కదిలారు. ఆద్యంతం కన్నుల పండుగగా రన్‌ కొనసాగడంతో పాటు దేశభక్తి పెంపొందించేలా పోలీసులు స్లోగన్‌లు ఇస్తూ రన్‌ చేపట్టి జాతీయ గీతాలాపనతో ఫ్రీడంరన్‌ను విజయవంతం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటాన్ని భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పాఠశాల విద్యార్థులకు గాంఽధీ చిత్రాన్ని ఉచితంగా సినిమా థియేటర్లలో చూపించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. త్యాగం, శాంతి, అభివృద్ధి వంటి అంశాలను జాతీ య జెండా తెలియజేస్తుందని తెలిపారు. ఫ్రీడం రన్‌కు అన్ని వర్గా ల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడం అభినందనీయమన్నా రు. ప్రతీ వ్యక్తిలో జాతీయభావం పెంచాలనే లక్ష్యంతో ఈనెల 15న ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, పిట్ల వేణు, మున్సిపల్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


లింగంపేటలో..

లింగంపేట: మండల కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడం రన్‌ లో కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ పాల్గొని మాట్లాడారు. గాంధీజీ శాంతి, అహింసలతో స్వాతంత్య్రం సాధించారని, శాంతియుత పద్ధతుల్లో హక్కులను సాధించుకోగలమని నేటి పౌరులకు తెలియజేప్పే బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేలుకొలిపేలా పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్న తాధికారులు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులను స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగస్వాములను చేయాలని ఆయన తెలిపారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో శ్రీరాముని నుంచే జాతీయతా భావాన్ని వారసత్వంగా పొం దామని లంకను జయించినా జన్మభూమి కోసం రాముడు అయోధ్యకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే జాజాల సురెందర్‌ మాట్లాడుతూ ప్రజలందరిలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్రంలో 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నా రు. కుల, మత, పార్టీలకు అతీతంగా సమైక్యతను చాటి చెప్పేందుకే ఫ్రీడం రన్‌ నిర్వహించినట్లు ఆయన తెలియజే శారు. ర్యాలీ మండల కేంద్రంలో రెండు కిలోమీటర్ల దూరం వరకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు సుమారు 6వేల మంది విద్యార్థులతో 100 మీటర్ల జాతీయజెండాతో నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్డీవో శ్రీను నాయక్‌, జడ్పీటీసీ శ్రీలత, సర్పంచ్‌ లావణ్య, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


స్వాతంత్య్రంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి 

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి  

బాన్సువాడ: బాన్సువాడలో నిర్వహించిన ఫ్రీడం రన్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ఆర్డీవో రాజాగౌడ్‌, డీఎస్పీ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ్రీడం రన్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బాల బాలికలు పోలీసు శాఖ వారికి స్వతంత్ర భారత వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లల మధ్య స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకోవడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. నేటి తరం పిల్లలకు స్వాతంత్య్రం అంటే ఏమిటీ అనే విషయంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఆంగ్లేయుల పాలనలో దేశం, ప్రజలు బానిసలుగా బతికారన్నారు. వారి నుంచి స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధులు అనేకమంది పోరాటాలు చేసి 200 సంవత్సరాల పరాయి పాలనను విముక్తి చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఈనెల 8 నుంచి ప్రారంభించి 22వ తేది వరకు జరిపే విధంగా రోజువారీ కార్యక్రమాలతో షెడ్యూల్‌ పెట్టామన్నారు. ఆయా కార్యక్రమాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని స్పీకర్‌ కోరారు.


విద్యార్థులతో గాంధీ సినిమాను వీక్షించిన స్పీకర్‌ 

స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా గురువారం బాన్సువాడ పట్టణంలోని మహేశ్వరి థియేటర్‌లోప్రత్యేకంగా ప్రదర్శించిన గాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీక్షించారు. సినిమాను వీక్షించిన వారిలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-12T05:38:37+05:30 IST