మహానగరంలో మహాకర్తవ్యాలు

ABN , First Publish Date - 2020-11-27T06:10:01+05:30 IST

మానవాభివృద్ధిక్రమంలో ప్రభుత్వాలు ఏర్పడుతాయి. ఆ ప్రభుత్వాలు ప్రజావసరాలు సవ్యంగా తీర్చినప్పుడే మనగలుగుతాయి. లేకుంటే కూలిపోతాయి...

మహానగరంలో మహాకర్తవ్యాలు

విద్యా, వైద్య, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుస్తారా? మట్టిదిబ్బలూ, చెత్తకుప్పలూ ఎత్తిపోస్తారా? పిచ్చిమొక్కలు కొట్టేసి గుంతలను పూడ్చేసి వీధులను శుభ్రంగా ఉంచుతారా? మూసీని ప్రక్షాళనం చేసి, శ్మశానవాటికల్లో చివరి ప్రయాణం చేసేవారి భౌతికకాయాల మర్యాద కాపాడుతారా? ఇవి, విశ్వనగరంగా హైదరాబాద్‌్‌కు విఖ్యాతి సాధించేందుకు విధిగా నిర్వర్తించాల్సిన అత్యంత ప్రాథమిక కర్తవ్యాలు. మరి అధికారాన్ని ఆపేక్షిస్తున్న పార్టీలకు ఈ సోయి ఉందా?


మానవాభివృద్ధిక్రమంలో ప్రభుత్వాలు ఏర్పడుతాయి. ఆ ప్రభుత్వాలు ప్రజావసరాలు సవ్యంగా తీర్చినప్పుడే మనగలుగుతాయి. లేకుంటే కూలిపోతాయి. ఇది చారిత్రక సత్యం. తాము ఏర్పరచుకున్న ప్రభుత్వాలను మానవులు తమకు అనుగుణంగా మార్చుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ముఖాలుగా స్పష్టంగా కనిపించేవి, ప్రజల అవసరాలను సత్వరమే తీర్చేవి మున్సిపాలిటీలు. జనావాసాలు పెరగడంతో ఈ మున్సిపాలిటీలు కూడా ఇంతింతై పెరిగి మహానగరాలుగా విస్తరిస్తున్నాయి. అలా విస్తరించిందే హైదరాబాదు మహానగర పాలక సంస్థ. నిజానికి ప్రపంచ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఓ పెద్ద మురికివాడలా ఉంది. ఈ మహానగర ప్రజల అవసరాలను గుర్తించి పార్టీలు ఓ కొత్త మానిఫెస్టో రాసుకోవలసి ఉంది. ఆ అవసరాలు ఏమిటన్నది ఒకసారి పరిశీలిద్దాం.


మున్సిపాలిటీలంటే మొట్టమొదటగా గుర్తువచ్చేది చెత్త. మానవ మనుగడలో అనునిత్యం అభివృద్ధితో పాటు చెత్తకూడా ఉత్పత్తి అవుతుంది. హైదరాబాదు మహానగరంలో ఎటు చూసినా చెత్తకుప్పలూ, దినచర్యలోని వ్యర్థాలూ, ఇళ్లు కట్టగా వదిలేసిన రాళ్లూ రప్పలూ, మురికికాలువల్లోంచి బయటికు తీసిన బురదా, ప్లాస్టిక్‌ వ్యర్థాలూ కంపు కొడుతూ కుప్పలుతెప్పలుగా కనిపిస్తాయి. ఈ వ్యర్థాలకూ మురికికుప్పలకూ ఓ ప్రదేశమంటూ ప్రత్యేకంగా లేదు. అది రాజ్‌భవన్‌ రోడ్డయినా, అసెంబ్లీ ముందు రోడ్డయినా, మారుమూల కాలనీ అయినా ఒకటే. ఘన వ్యర్థపదార్థాలు కంపుకొడుతుంటాయి. హైదరాబాదు మహానగర పాలకులకు ఇంకా ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ (సాలిడ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్) ఒంటబట్టలేదు. అలాగని ద్రవవ్యర్థాలు బాగానే తొలగిస్తున్నారని కాదు. నగరం నిండా మ్యాన్‌హోల్స్‌ గోదావరి కన్నా మిన్నగా పొంగిపొరలుతుంటాయి. ఎన్నికలలో గెలుస్తామనుకునే వారు ఈ విషయంలో తామేమిచేస్తారో చెత్తాచెదారాల నుంచి హైదరాబాదు ప్రతిగల్లీని ఎప్పుడు విముక్తి చేస్తారో మానిఫెస్టోలో ప్రకటించి ప్రజలకు చెప్పి మెప్పించాలి. 


రెండోది రోడ్లు. హైదరాబాదు ఓ విశ్వనగరమని ఆరేళ్లుగా చెప్పుకుంటున్న పాలకులు విశ్వంలో ఏ నగరం చూసి వచ్చారో కానీ, ఏ నగరంలో కూడా హైదరాబాదులో లాంటి రోడ్లు లేవు. గుంతలూ, పగుళ్లూ తప్పిస్తే, మన రోడ్లు ఒక చివర నుంచి మరో చివరకు అంటే వాల్‌ టు వాల్‌ ఉండవు. రోడ్డెమ్మట విపరీతంగా పిచ్చి మొక్కలు మొలుస్తున్న నగరం బహుశా మనదేనేమో. అసెంబ్లీ హాలు ముందు రోడ్డయినా, హైటెక్‌ సిటీ అయినా, ఐ.ఎస్‌.బీ రోడ్డయినా బంజారాహిల్స్ అయినా, రోడ్డెంట పిచ్చి మొక్కలు, నాచు పార్థీనియం మొక్కలు లేని రోడ్డు లేదు. ఇల్లు కట్టకుండా ఉన్న ఖాళీ ప్లాటయితే అదో పిచ్చిమొక్కల వనం లేదా చెత్తకుండీ. దీంతో ప్రయాణాల మీద, ప్రజారోగ్యం మీదా ఎంత దెబ్బపడుతుందో పాలకులు గ్రహించే స్థితిలో లేరు. ఈ పిచ్చి మొక్కల పెరుగుదల కేవలం రోడ్లకే పరిమితం కాలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చూసినా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం చూసినా, సర్కారు దవాఖానాలు చూసినా ఎక్కడబడితే అక్కడ ఏపుగా పెరిగిన ఈ పిచ్చిమొక్కలు దర్శనమిస్తాయి. విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న ఈ విశ్వవిద్యాలయాలు వారికి ఏం నేర్పించి పంపిస్తున్నాయో తెలియదు, వారికి మన నగరాన్ని ఎలా సుందరంగా చూపాలో పాలకులకూ తెలియదు. ఈ దుర్దశను మార్చే పార్టీ ముందుకొస్తుందా? 


నగరం నిండా ప్రతి కాలనీలో ప్రతి కరెంటు స్తంభానికీ కనెక్షను ఎవరిదో తెలియని కేబుల్‌ వైర్ల సమస్య మరోటి. నగరాభివృద్ధి సంస్థకు ఓ ప్రణాళిక కానీ, పద్ధతి కానీ, నియంత్రించే యంత్రాంగం కానీ లేనట్టున్నాయి. అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా కేబుల్‌ వైర్లను కడుతున్నప్పుడు నగర పాలక సంస్థ అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న? నేరస్థులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ప్రభుత్వాలు నేరాన్ని నిరోధిస్తున్నాయా? ఏమీ చేయలేనప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు అన్నది సామాన్యులకు వచ్చే సామాన్యమైన ప్రశ్న. 


మునిసిపల్‌ పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థ మరో పెద్ద సవాల్. ఈ వ్యవస్థ మీద మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎలాంటి నియంత్రణ లేదు. వారానికోసారి కాని కాలనీల్లోకి వచ్చి ఊడ్వరు. ఇక్కడో విషయం గమనించాల్సి ఉంది. కాలనీల్లో చెత్త ఊడ్చే పారిశుద్ధ్య కార్మికులు ఒక బృందం అయితే, ఈ ఊడ్చిన చెత్తను తీసుకుపోయేది మరో బృందం. ఈ రెండు బృందాల మధ్య సమన్వయం కరువై ఊడ్చిన చెత్త కాలనీల్లో పెంటకుప్పలుగా మారుతోంది. తద్వారా దోమలు, ఈగలు, రోగాలు తప్పడంలేదు. దానికితోడు కాలనీల్లో పైపులు పెట్టి కార్లూ, లోగిళ్లూ కడిగే సంస్కృతి. మన మహానగర పాలనలో ఈ అంశాలు గమనానికి వచ్చినట్టు లేదు.


ఓట్లడిగే మహాశయులు దశాబ్దాలుగా ప్రజలకు చేస్తున్న వాగ్దానం మూసీ ప్రక్షాళన. తెరాస ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన 2014లోనే ఈ వాగ్దానం చేసింది. కానీ ఇప్పటికీ ఒక అంగుళం కూడా ప్రక్షాళనం కాకపోగా మొన్నటి అతివృష్ఠిలో మూసీ ప్రతాపం చూపించింది. మూసీ వెంట ఉన్న ఆవాసాలు కడు దీన పరిస్థితుల్లో బతకడమే కాకుండా కాలుష్యానికి తమ వంతు దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఓట్లడిగే వారు వారి ఆవాసాలు శుభ్రంగా ఉంచడంతో పాటు మూసీని ఎలా రక్షిస్తారో చెప్పాల్సి ఉంది.


మహానగర పరిపాలనలో శ్మశానాల నిర్వహణ మరో అంశం. బతికున్నవారి కోసం ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తూ నందనవనాల వాగ్దానాలు చేస్తుంటే, చనిపోయిన వారి అంత్యక్రియలు చేసే ప్రదేశాలు హీనాతి హీనంగా ఉన్నాయి. దేవుని గుళ్లలా తళతళలాడాల్సిన శ్మశానాలు అత్యంత హీనంగా ఉన్న విషయం విశ్వనగర నిర్మాతలకు ఇప్పటికీ పట్టలేదు. ప్రేతకర్మలు సక్రమంగా చేసుకునే ఏ వసతీ ఏ శ్మశానంలోనూ లేదు. కాని మామూళ్లు అడగటం, ప్రతిచిన్న సహాయానికీ అక్కడ పనిచేస్తున్న వాళ్లు డబ్బులతో ముడిపెట్టడం, సమయం సందర్భం లేకుండా చేయిచాచడం మామూలయిపోయింది. మూసీ వెంట ఉన్న శ్మశానాల సంగతయితే సరేసరి. చనిపోయిన తర్వాత నన్నిక్కడికి తెస్తారా? అని బతికున్న వాడే భయపడిపోయే పరిస్థితులు. ఈ అంశాన్నీ మానిఫెస్టోలో చేర్చుకుంటారా? 


మహానగర అధికార పీఠాన్ని ఆపేక్షిస్తున్న పార్టీల మానిఫెస్టోల్లో లేని మరో అంశం, నగరవాసులను కలవరపెడుతున్న నేర సంఘటనలు. హత్యలు, అత్యాచారాలు, చిన్నపిల్లలను అమ్మడం, ఆత్మహత్యలు, గృహహింస, దోపిడీలు, చడ్డీగ్యాంగులు, మాదక ద్రవ్యాల వినియోగం మొదలైనవి హైదరాబాదు మహానగరంలో అటు పోలీసులకూ ఇటు నగర పౌరులకూ కంటికి నిద్రలేకుండా చేస్తున్నాయి. నగర పౌరులకు కడుపు నిండా తిండి పెట్టలేకపోయినా కంటి నిండా నిద్రపట్టేలా నేర నియంత్రణ చర్యలు తీసుకోవలసిన బాధ్యత నగర పాలకులదే. ఓట్లు అడిగే ముందు మీ రక్షణ భారం మాది అని చెప్పుకుని గెలిచాక చిత్తశుద్ధితో అందుకు పని చేయకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. అరాచకం ప్రబలుతుంది. 


నగర పౌరుల అవసరాల్లో విద్యా వైద్య సేవలు కూడా ఉంటాయి. వైద్యసేవల స్థితిగతులు మనకు కరోనా కాలంలో కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఇక విద్యాసంస్థల వైనమూ చెప్పనవసరం లేదు. పాఠశాలలకు, జూనియర్‌ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు అనుమతులు పునరుద్ధరించడం ప్రతి సంవత్సరం ఓ ప్రహసనమే. కరోనా భయం మాటున ఈ సంవత్సరం అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఒక మహానగరంలో జరిగే అన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు ఒకే అధికార నియంత్రణ పరిధిలో ఉండటం భావ్యం. కానీ విశ్వనగరమని చెప్పుకుంటున్న మన మహానగర పరిపాలనలో అది లేకపోవడం క్షమించరానిది. ఓట్లడిగే ముందు ఇది ప్రతి పార్టీ ఆలోచించాల్సిన విషయం. నగరంలో నివాస వసతుల కల్పన మరో విషయం. మానిఫెస్టోల్లో చేర్చుకోవాల్సిన ముఖ్యవిషయం. నగరం నిండా అనుమతులు లేకుండా లే ఔట్లు వేసి ఇల్లు కడుతుంటే కళ్లుమూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు లే ఔట్లు క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టింది. నిజానికి అక్రమమైన చర్య డబ్బులు కడితే సక్రమమెలా అవుతుంది? ప్లాటు అలాగే ఉంటుంది, ప్లాటు యజమాని అలాగే ఉంటాడు, అక్రమ లే ఔట్లు వల్ల కలిగిన అనర్థాలు అలాగే ఉంటాయి, కాని కాగితాల మీద సక్రమమయి ప్రభుత్వ ఖజానా మాత్రం నిండుతుంది! అసలు ప్రజలు ఎందుకు తప్పులు చేస్తున్నారు? అన్నది ప్రభుత్వాలు ఆలోచించవలసిన మరో ముఖ్యవిషయం. ఎందువల్ల అనుమతులు తీసుకోవడం లేదని నిష్పాక్షికంగా ఆలోచిస్తే అనుమతులు తీసుకునే ప్రక్రియ ఎంత క్లిష్టతరమో, కష్టతరమో; ఆ కష్టాలను భరించలేకే ప్రజలు తప్పుదోవపడుతున్నారన్నది స్పష్టమవుతుంది. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు తమ మానిఫెస్టోలు సరిచేసుకుని ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయిందని అన్ని లే ఔట్లనూ, కట్టడాలనూ అనుమతించి ఇకమీదట చాలా కఠినమయిన చర్యలు తీసుకోగలమని చెబితే ప్రజలకు నమ్మకం కలగవచ్చు. 


హైదరాబాదును విశ్వనగరం చేస్తామని ఘోషిస్తున్నవారు విశ్వనగరానికి నిర్వచనమేమో చెప్పలేకపోవడం విచారకరం. చీకట్లో వీధులనూ, విద్యుద్దీపాలనూ ఛాయాచిత్రాలు తీసి ఓహో మానగరం అని మురిసిపోవడం అమాయకత్వమో అజ్ఞానమో తెలియదు. మహానగరాన్ని సుందరసీమలా తీర్చిదిద్దే ఉద్దేశం స్పష్టంగా కనిపించే, వినిపించే మానిఫెస్టోలు రూపొందాలి. విశ్వనగరం చేస్తామన్న మాట అటుంచి ఆ విశ్వనగరం అంటే ఏమిటి, అందులో ఏముంటుంది? ఏవేవి మెరుగుపడతాయన్నది స్పష్టంగా తెలియజేయాలి. 


విద్యా, వైద్య, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుస్తారా? మట్టిదిబ్బలూ, చెత్తకుప్పలనూ ఎత్తిపోస్తారా? పిచ్చిమొక్కలను కొట్టేసి గుంతలను పూడ్చేసి వీధులను శుభ్రంగా ఉంచుతారా? మూసీని ప్రక్షాళనం చేసి, శ్మశానవాటికల్లో చివరి ప్రయాణం చేసే వారి భౌతికకాయాల మర్యాద కాపాడుతారా? లేక నాకెక్కువ ఓట్లు నీకెక్కువ ఓట్లు అంటూ తప్పులను మరొకరి మీదకు నెట్టేస్తూ బతుకుతారా? నగరాన్ని డల్లాస్‌లా కాకున్నా కాస్త కాబూల్‌ నగరంలానైనా రూపొందిస్తారా? 

డాక్టర్‌ పి. మాధవరావు

ఐక్యరాజ్యసమితి మాజీ సీనియర్‌ సలహాదారు

Updated Date - 2020-11-27T06:10:01+05:30 IST