మహా నిర్మాణ వేదిక

ABN , First Publish Date - 2021-05-31T05:53:13+05:30 IST

బలం, బలగం... ధనం, దర్పం కాసింత కూడా గాలినివ్వలేక తేలిపోయే దూది పింజలని తెలిసాక ప్రతి చావూ, సాయంత్రానికి రాలిపోయే పూవులా కనిపిస్తున్నది. నిన్నటి దాకా...

మహా నిర్మాణ వేదిక

బలం, బలగం...  ధనం, దర్పం 

కాసింత కూడా గాలినివ్వలేక

తేలిపోయే దూది పింజలని తెలిసాక 

ప్రతి చావూ, 

సాయంత్రానికి రాలిపోయే పూవులా కనిపిస్తున్నది.


నిన్నటి దాకా...

కళ్ళ ముందటి సత్యాన్ని కలుగులో దాచేసి 

భ్రమల భ్రమరాల సమూహాలమై 

బ్రతుకు బందిఖానా చుట్టూ 

లౌల్యపు బరి గీసుకొని పరిభ్రమించి వుండవచ్చు 


మనిషి ఉనికే ఊపిరందని ఉత్తి తిత్తని తేలాక కూడా,

మనసు కిటికీ మరి కొంచెం తెరుచుకోకుంటే ఎలా?


ఇపుడిపుడే బోధపడుతున్న 

బైరాగి పాటలోని బతుకు తత్త్వం

మెలమెల్లగా వీడిపోతున్న

మనో వికారపు మాయా తెరల మర్మం 


కులాలుగా...  కరెన్సీ పొలాలుగా

మతాలుగా... మారణాయుధాలుగా

విద్వేష ధృవాలుగా వికర్షిస్తున్న మనం 

విలువల పూదోటగా విరబూసే సమయమిది


ఇవాళో... రేపో

ముందో...  వెనుకో

నువ్వూ... నేనూ

కాలపు శిలువను మోయక తప్పని 

కలల బేహారులమే 


నడి సంద్రంలోని నావ 

చిల్లుపడిన చివరి క్షణాన సైతం 

సైతాను దూతలా సందడి చేస్తున్న 

ధన దాహ, నిర్లజ్జ, వ్యాపార, వ్యామోహీ!

మునిగిపోతున్న నావలో 

నువ్వూ మునగబోతున్న ముసాఫిర్‌వే 

పట్టుకు పోవడానికి 

పిడికెడు మట్టీ పనికిరానిదయ్యాక 

పుట్లకొద్దీ సంపదలు 

చెదపురుగుల పుట్టలే


బిర్యానీ పార్సిల్‌తో వచ్చిన జొమాటో కుర్రాడిలా 

మరణం తలుపు ముందర నిల్చొని ఎదురు చూస్తోంది 

స్త్రీలు వదిలిన బతుకమ్మ పూలకు బదులు

నదులు శవాలను మోసుకుంటూ ప్రవహిస్తున్నాయి 


రిక్త హస్తాల నిష్క్రమణల సాక్షిగా

ఇది ప్రకృతి హెచ్చరికల కొత్త పాఠం


ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు

మలినమైన మనో దేహాలను నిప్పులతో కడిగేది

నదైనా... జీవితమైనా 

నడిచీ నడిచీ తేటపరుచుకుంటేనే 

నవ నాగరికతకు నాంది


పగిలిన బండరాళ్ళ మధ్య మిగిలిన తడిలోంచి 

తలెత్తే ముకుళిత హస్తాల మొక్కలా 

బతుకు పచ్చగా చిగురించడాన్ని ఎవడాపగలడు 

ఎన్ని విలయానంతర 

మహా నిర్మాణాలకు వేదికైందో ఈ సృష్టి 


విస్ఫోటనానంతర

వినిర్మాణ సౌందర్య రూపమే జగత్తంతా

గాజోజు నాగభూషణం 

98854 62052 

Updated Date - 2021-05-31T05:53:13+05:30 IST