ఆధార్ లేకుంటే...శ్మశానాల్లో శవాన్ని కూడా దహనం చేయం

ABN , First Publish Date - 2020-02-10T17:41:04+05:30 IST

మృతులకు ఆధార్ లేకుంటే వారి ఆత్మ కూడా శాంతించని పరిస్థితులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో నెలకొన్నాయి....

ఆధార్ లేకుంటే...శ్మశానాల్లో శవాన్ని కూడా దహనం చేయం

  • బెంగళూరు మహానగర పాలిక అధికారుల ఉత్తర్వులు

బెంగళూరు (కర్ణాటక) : మృతులకు ఆధార్ లేకుంటే వారి ఆత్మ కూడా శాంతించని పరిస్థితులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో నెలకొన్నాయి. ఎవరైనా మరణిస్తే వారికి ఆధార్ కార్డు లేకుంటే, వారి శవాన్ని కూడా బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) అధికారిక శ్మశానాల్లో దహనం చేసేందుకు అనుమతించని పరిస్థితి బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా , బెంగళూరు నగరంలో మాత్రం శవ దహనానికి కూడా ఆధార్ ను తప్పనిసరి చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు నగరంలోని విజయనగర్ కు చెందిన రాజేష్ అనే ఓ యువకుడి మేనత్త మరణించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులతో కలిసి సుమనహళ్లి మున్సిపల్ శ్మశానవాటికకు తీసుకువచ్చాడు. శ్మశానవాటిక సిబ్బంది శవ దహనానికి అభ్యంతరం చెపుతూ, అంత్రక్రియలు చేయాలంటే మృతురాలి ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలని, ఆ నంబరుతో ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయాలని కోరారు. మృతురాలి పేరిట ఉన్న ఆధార్ కార్డు పోవడంతో సమీపంలోని నెట్ సెంటరుకు వెళ్లి ఈఆధార్ కోసం ప్రయత్నిస్తే రిజిస్టరు మొబైల్ నంబరు సిమ్ బ్లాక్ అయిందని గుర్తించాం. దీంతో మరో మొబైల్ నంబరుతో ఈ ఆధార్ తీసుకువచ్చాకే మున్సిపల్ అధికారులు శవదహనానికి అనుమతించారు. బెంగళూరు మహానగర పాలిక అధికారులు నగరంలో 46 శ్మశానవాటికలు నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటేనే తాము శ్మశానవాటికలో శవదహనానికి అనుమతిస్తామని మహానగర పాలిక అధికారులు చెప్పడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-02-10T17:41:04+05:30 IST