గ్రావెల్‌ మాఫియా దందా

ABN , First Publish Date - 2021-09-14T04:53:20+05:30 IST

చేబ్రోలు మండలంలోని వీఎన్‌ పాలెంలో గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. తమకు అడ్డే లేదన్న రీతిలో నిత్యం ట్రాక్టర్లతో గ్రావెల్‌ని పక్క గ్రామంలో చేపల చెరువుకు తరలిస్తోంది.

గ్రావెల్‌ మాఫియా దందా
వీఎన్‌ పాలెంలో ఎక్స్‌కవేటర్‌తో ట్రాక్టర్‌కి గ్రావెల్‌ని లోడింగ్‌ చేస్తున్న మాఫియా

అసైన్డ్‌, పోరంబోకు భూములపై కన్ను

రైతులు అభ్యంతర పెట్టినా ఆగని వైనం


గుంటూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): చేబ్రోలు మండలంలోని వీఎన్‌ పాలెంలో గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. తమకు అడ్డే లేదన్న రీతిలో నిత్యం ట్రాక్టర్లతో గ్రావెల్‌ని పక్క గ్రామంలో చేపల చెరువుకు తరలిస్తోంది. దీని వెనక అధికార పార్టీ నేతల అనుచరులు ఉండటంతో అడ్డుకొనేందుకు పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు ముందుకు రావడం లేదు. అడపాదడపాగా విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించినా ఆ సందర్భంలో అక్కడ లభించిన వాహనాలకు పెనాల్టీలు విధించి వదిలేస్తున్నారు. స్థానికులు ఎవరైనా అభ్యంతరం పెట్టినా వారిపై దాడులకు మాఫియా తెగబడుతోంది. ఆదివారం కూడా వీఎన్‌ పాలెం నుంచి పెద్దఎత్తున గ్రావెల్‌ని ట్రాక్టర్లలో పక్క గ్రామానికి తరలించారు. అక్కడున్న అసైన్డ్‌, పోరంబోకు భూముల్లో పెద్దఎత్తున మట్టి తవ్వేస్తుండటంతో పక్కనే ఉన్న తమ పొలాల గట్లు జారిపోతాయని కొంతమంది రైతులు అభ్యంతరం పెట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తరలించారు. 

వీఎన్‌ పాలెంలో సుమారు 6 ఎకరాల వరకు అసైన్డ్‌, పోరంబోకు భూములున్నాయి. ఇన్నాళ్లు వీటిల్లో పిచ్చిమొక్కలు మొలిచి ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇక్కడి భూములపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఒక ఉద్యోగిని వైసీపీ నాయకులు పోస్టింగ్‌ చేయించుకొన్నారు. అతను అసైన్డ్‌, పోరంబోకు భూముల మార్గం చూపిస్తుండటంతో ముఖ్యంగా ప్రభుత్వ సెలవుదినాలను మాఫియా ఎంచుకొంటోంది. ఆయా రోజుల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సెలవులో ఉంటారు. వినాయకచవితి, రెండో శనివారం, ఆదివారం వరుసగా మూడు సెలవుదినాలు రావడంతో మాఫియాకి మంచి అవకాశం దొరికినట్లు అయింది. శనివారం అర్ధరాత్రి తర్వాత పొక్లెయిన్‌లను అక్కడ దింపేశారు. వేకువజాము నుంచే గ్రావెల్‌ని కొట్టి ట్రాక్టర్లలో తరలించడం ప్రారంభించారు. 

వీఎన్‌ పాలెంలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎలాంటి ఎన్‌వోసీలు కూడా మైనింగ్‌, రెవెన్యూ శాఖలు ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. అలాంటప్పుడు అసైన్డ్‌ భూముల్లో ఎలా తవ్వకాలు కొనసాగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. 100 అడుగుల లోతు వరకు గ్రావెల్‌ని తవ్వుతుండటం వలన తమ పొలాల గట్లు అందులోకి ఒరిగిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతోన్నారు. గ్రావెల్‌ మాఫియాపై సీఎంవోకు ఫిర్యాదు చేయాలని స్థానిక నాయకులు నిర్ణయించుకొన్నారు. సీఎంవో కూడా స్పందించని పక్షంలో ఎవరైతే అధికారులు అక్రమ తవ్వకాల విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారో వారిపై హైకోర్టులో కేసు వేయాలని నిర్ణయించారు. 

 

Updated Date - 2021-09-14T04:53:20+05:30 IST