తవ్వుకో.. దోచుకో..!

ABN , First Publish Date - 2021-04-17T05:26:49+05:30 IST

మండల పరిధిలోని లక్ష్మీపురం, దూపాడు గ్రామాల సమీపంలో ఎర్రమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

తవ్వుకో.. దోచుకో..!
ఎక్స్‌కవేటర్‌తో కొండను తవ్వుతున్నారిలా..

  1. చెలరేగుతున్న మట్టి మాఫియా
  2. దూపాడు భూముల్లో అక్రమ తవ్వకాలు
  3. అనుమతి ఒకచోట.. తవ్వకాలు మరోచోట

కల్లూరు, ఏప్రిల్‌ 16: మండల పరిధిలోని లక్ష్మీపురం, దూపాడు గ్రామాల సమీపంలో ఎర్రమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో మట్టి మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తోంది. ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనులకు మట్టి  తవ్వకాలకు ఒక చోట అనుమతి తీసుకుని, మరోచోట తవ్వుతున్నారు. యంత్రాల సాయంతో టన్నుల కొద్దీ మట్టిని తవ్వి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లలో ఎర్ర మట్టి తరలిపోతోంది.


అనుమతి ఒక చోట..

లక్ష్మీపురం గ్రామ సర్వే నెంబర్‌ 139లో మట్టి తవ్వేందుకు మైనింగ్‌ శాఖ అనుమతి పొందిన ఓ వ్యక్తి, నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. లక్ష్మీపురం మజరా దూపాడులో అదే సర్వే నెంబర్‌ 139లో యంత్రాలు ఏర్పాటు చేసుకుని దర్జాగా మట్టిని తవ్వుకుంటున్నారు. టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్‌వోసీ తీసుకున్నది లక్ష్మీపురం భూములకు కాగా, తవ్వకాలు మాత్రం దూపాడు భూముల్లో సాగుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే.. హైవే పనులు జరుగుతున్నాయని, అనుమతి తీసుకున్నామని నమ్మబలుకుతున్నారు. కొండలను కొల్లగొట్టి దండుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని సమీప గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వ భూముల్లో..

దూపాడు గ్రామం సర్వే నెంబరు 139లో పది రోజులుగా ఎర్రమట్టి తవ్వకాలు, అక్రమ రవాణా జరుగుతోంది. ఈ కారణంగా జగన్నాథగట్టు పర్యాటక కేంద్రానికి కూతవేటు దూరంలో అందమైన కొండల రూపురేఖలు మారిపోతున్నాయి. ఎక్స్‌కవేటర్ల సాయంతో రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. కొండలు తరిగిపోయిన తరువాత చదును చేసి పాసుపుస్తకాలు పొందుతున్నారు. ఆ స్థలాల్లో కొందరు వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారు.


అధికారుల చర్యలేవీ..?

అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న మట్టి మాపియాపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. విజిలెన్స్‌, పోలీసు, మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. 


అనుమతి లేదు..

దూపాడు సర్వే నెంబర్‌ 139లో మట్టి తవ్వకాలకు అనుమతి లేదు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ సిబ్బందిని అక్కడికి పంపించాం. ఎర్రమట్టి తరలింపు జరగకుండా చర్యలు తీసుకుంటాం.  - టీవీ రమేష్‌ బాబు, తహసీల్దారు, కల్లూరు



Updated Date - 2021-04-17T05:26:49+05:30 IST