గ్రావెల్‌ గద్దలు.. కొండలు మింగేస్తున్నాయి..!

ABN , First Publish Date - 2022-03-07T05:09:45+05:30 IST

గ్రావెల్‌ గద్దలు.. కొండలను మింగేస్తున్నాయి. కొండలను కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

గ్రావెల్‌ గద్దలు..   కొండలు మింగేస్తున్నాయి..!
10 అడుగుల మేర కిందకు తవ్వి గ్రావెల్‌ లోడ్‌ చేస్తున్న కూలీలు

అధికార పార్టీ నేతల ఇష్టారాజ్యం

ప్రైవేటు లే అవుట్లకు, వ్యక్తులకు తరలింపు  

నిద్రపోతున్న నిఘా వ్యవస్థ  


పొదలకూరు, మార్చి 6 : గ్రావెల్‌ గద్దలు.. కొండలను మింగేస్తున్నాయి. కొండలను కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ అండదండలు, కొందరు అధికారుల సహకారంతో మండలంలో గ్రావెల్‌ అక్రమ దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. రాత్రీ పగలు తేడా లేకుండా గ్రావెల్‌ అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 

పొదలకూరు మేజర్‌ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 707లో ఉన్న చిట్టేపల్లి తిప్పను ఒకసారి చూస్తే గ్రావెల్‌ అక్రమార్కులు ఎంతగా రెచ్చిపోతున్నారో తెలుస్తోంది. కొండను పూర్తిగా తొలిచి సుమారు 10 ఎకరాలకుపైగా 15 అడుగుల లోతులో గ్రావెల్‌ తవ్వి తరలించారు. టిప్పర్లు, ట్రాక్టర్లతో ప్రైవేటు వ్యక్తులకు, లేఅవుట్లకు గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన సొంత వాహనాలు కలిగిన ఇద్దరు నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్ష నాయకులు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా చర్యలు శూన్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఒక చిట్టేపల్లే కాదు.. చాటగొట్ల, నందివాయి, బిరదవోలు, తాటిపర్తి, మహమ్మదాపురం తిప్పలోని గ్రావెల్‌ దోచుకుని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు గ్రావెల్‌ రూ.750 నుంచి రూ.వెయ్యికి అమ్ముకుంటున్నారు. ఈ దోపిడీపై పలువురు అధికారులకు సమాచారమిచ్చినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 తరలిపోతున్న తెల్లరాయి

మండలంలోని తెల్లరాయి (క్వార్డ్జ్‌)ని అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. రెవెన్యూ, అటవీ భూముల్లో నిక్షిప్తమైన ఈ ఖనిజానికి అనుమతి లేకుండానే కొందరు తవ్వుతున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. మండలంలోని పీజీపట్నం, నందివాయి, బత్తులపల్లి, ముదిగేడు, డేగపూడి, నరసింహకండ్రిగ, పార్లపల్లి, తాటిపర్తిలోని క్వార్జ్డ్‌, ఫెలస్పర్‌, వర్మికులేటెడ్‌, క్రూడ్‌మైకాను తవ్వి, లారీల్లో చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   

 

Updated Date - 2022-03-07T05:09:45+05:30 IST