మిడతల కలవరం

ABN , First Publish Date - 2020-06-02T10:08:58+05:30 IST

ఇతర రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న మిడతలు జిల్లా రైతులనూ భయపెడుతున్నాయి. మూడు రోజుల కిందట నెల్లిమర్ల మండలంలో

మిడతల కలవరం

జిల్లాలో అనేక చోట్ల దండుగా కనిపిస్తున్న వైనం

రైతుల్లో దిగాలు

పాచిపెంటలో పరిశీలించిన వ్యవసాయశాస్త్రవేత్తలు


పార్వతీపురం రూరల్‌/గుర్ల/ పాచిపెంట, జూన్‌1:

ఇతర రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న మిడతలు జిల్లా రైతులనూ భయపెడుతున్నాయి. మూడు రోజుల కిందట నెల్లిమర్ల మండలంలో కనిపించాయి. నిన్నటికినిన్న పాచిపెంట మండలం చిమిడివలస అటవీ ప్రాంతంలో తిష్టవేయడం చూసిన అందరూ భయపడ్డారు. అవి ఎడారి మిడతలో, దేశీయ మిడతలో తేల్చుకోలేక సతమతమవున్నారు. తాజాగా సోమవారం పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ కారిమెట్ట వద్ద జీడి తోటలోనూ మిడతలు గుంపుగా కంటపడ్డాయి. జీడి చెట్ల ఆకులపై చేరడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా గుర్ల మండలంలోనూ మిడతల దండు ప్రవేశించింది.


గుర్ల గ్రామానికి సమీపంలో ఉన్న చంపావతి నది తీర ప్రాంతాల్లో జిల్లేడు మొక్కలపై వేలాది మిడతలు  సోమవారం హఠాత్తుగా వచ్చి చేరాయి. చూస్తుండగానే మొక్కలపై వాలి ఆకులు, కాండాలను నమిలేశాయి. మిడతలన్నీ గుంపులుగా చేరి ఆకులను తినేస్తుండడం చూసి అక్కడి రైతులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇక్కడ నువ్వు పంట పండిస్తున్నారు. ఒకవేళ మిడతలన్నీ వచ్చి నువ్వు పంటపై పడితే కష్టపడి పండించిన పంట ఒక్క రోజులోనే తినేస్తాయేమోనని భయాందోళన చెందుతున్నారు. ఇదే మండలం పెనుబర్తి గ్రామంలోనూ సోమవారం మిడతలు కనిపించాయి. జీలుగ చెట్లపై ఉన్న వేల కొద్దీ మిడతలను చూసిన వారంతా ఆశ్చర్చపోయారు. 


ఎడారివలస మిడతలు కావు: శాస్త్రవేత్తలు

అవి ఎడారివలస మిడతలు కావని, కాఫీతోటల్లో పెరిగే మిడతలని విజయనగరం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మణరావు తెలిపారు. పాచిపెంట మండలంలోని గొట్టూరు పంచాయతీ చిమిడివలస ప్రాంతంలో కనిపించిన మిడతల దండును సోమవారం పలువురు శాస్త్రవేత్తలు పరిశీలించారు. అవి సమీప కాఫీ తోటల నుంచి వచ్చినవేనని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. నివారణా చర్యల గురించి వివరించారు. వేపపిండిగానీ, బంకమట్టిగానీ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. స్వయంగా వాటిపై పిచికారీ చేసి రైతులకు చూపించారు.


ఆ మిడతలు అక్రిడిడే కుటుంబానికి చెందినవని, వాతావరణంలో జీవ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు వీటిని తిని బతికే పక్షిజాతులు తగ్గినప్పుడు వీటి ఉధృతి పెరిగి పంటలను నాశనం చేసే పరిస్థితి వస్తుందన్నారు. మిడతల పరిశీలనలో రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తేజేశ్వరరావు, విజయనగరం ఏరువాక కేంద్రంశాస్త్రవేత్త స్వాతి, స్థానిక వ్యవసాయాధికారి బి.గోవిందరావు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T10:08:58+05:30 IST