మిడత బెడద!

ABN , First Publish Date - 2020-05-27T07:13:39+05:30 IST

‘‘మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగుపెట్టిన రాజ్యం శ్మశానమైపోతుంది’’.. బాహుబలి సినిమాలో ఒక డైలాగ్‌ ఇది. కాలకేయుల సంగతి అలా ఉంచితే..

మిడత బెడద!

  • సౌదీ ఎడారి నుంచి పాక్‌ ద్వారా భారత్‌లోకి..
  • ఉత్తరాది రాష్ట్రాల్లో వణుకు


‘‘మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగుపెట్టిన రాజ్యం శ్మశానమైపోతుంది’’.. బాహుబలి సినిమాలో ఒక డైలాగ్‌ ఇది. కాలకేయుల సంగతి అలా ఉంచితే.. మిడతలు దాడి చేసిన పంట మాత్రం సర్వ నాశనమే. అసలు అక్కడ పచ్చటి పంట ఉండేదనడానికి ఆనవాళ్లే మిగలవు. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా నిపుణులు వీటి గురించి చెబుతారు. ఈ మిడత దండు తాజాగా భారత్‌పై దండెత్తింది. అసలే కరోనాతో విలవిల్లాడుతున్న దేశానికి గోరుచుట్టు మీద  రోకలిపోటులా మిడతల బెడద వచ్చి పడింది. కోట్లాదిగా వచ్చి పంటల మీద దాడి చేస్తున్న మిడతల దండును చూసి ఏకంగా రాష్ట్రాలకు రాష్ట్రాలే వణికిపోతున్నాయి. ముఖ్యంగా.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఎక్కడ నుంచి వస్తున్నాయి? 

2018 మే లో దక్షిణ అరేబియాలోని రుబ్‌ అల్‌ ఖలీ ఎడారి గుండా మెకును తుఫాన్‌ ప్రయాణించింది. ఆ సమయంలో ఎడారిలో అక్కడక్కడా తాత్కాలిక నీటి చెలమలు ఏర్పడ్డాయి. ఎడారి మిడతలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయేందుకు ఈ చెలమలు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాయి. అదే ఏడాది అక్టోబరులో లుబాన్‌ తుఫాన్‌ రావడంతో ఇక వాటి పెరుగుదలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. కేవలం తొమ్మిది నెలల్లో 8వేల రెట్లకు పైగా పెరిగిపోయిన మిడతలు, అక్కడి నుంచి తమ దండయాత్రను ప్రారంభించాయి. సౌదీ నుంచి ఇరాన్‌, పాకిస్థాన్‌ ద్వారా భారత్‌లోకి గత నెల 11న ఈ మిడతల తుఫాను ప్రవేశించింది. భారత్‌లో మిడతల వలన వేలాది కోట్ల మేర పంట నష్టం వాటిల్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో 18జిల్లాలు మిడతల బారిన పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని 17జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. 27ఏళ్లలో ఎన్నడూ లేనంత మిడతల విపత్తు ఎదుర్కొంటున్నామని మధ్యప్రదేశ్‌ పేర్కొంది.


మిడతల సమాచారం 150 కిలోమీటర్లు 

మిడతలు ఒకరోజులో ప్రయాణించే దూరం. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలి ఎటు వీస్తే అటు పగలంతా ప్రయాణిస్తాయి. పచ్చదనాన్ని కబళిస్తాయి. రాత్రుళ్లు మాత్రం ఆగిపోతాయి.


8 కోట్లు

ఒక కిలోమీటర్‌ పరిధిని ఆక్రమించగల మిడతల సంఖ్య 


20 రెట్లు

మూడునెలల్లో మిడతల సంతతి పెరిగే వేగం. బతికే 90రోజుల్లో ఒక్కో మిడత రెండు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు 45రోజుల్లోనే పెరగి పెద్దవై, తర్వాతి నెలరోజుల్లో అవీ గుడ్లను పెడతాయు. 


ఏం తింటాయి?

మిడతలకు ఫలానా పంటే తినాలన్న నియమమేమీ లేదు. పచ్చగా కళకళలాడే ఏ మొక్కైనా వాటికి విందు భోజనమే. ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు ఒక్కొక్కటీ వాటి శరీర బరువుకు ఎన్నో రెట్లు ఎక్కువ స్వాహా చేసేయగలవు. 35వేలమందికి సరిపడా ఆహారాన్ని ఒకేరోజులో లాగించగలవు. అవి వాలిన చోట పచ్చదనం కనుమరుగే.


ఎలా ఆపేది?

మిడతల దాడిని ఎదుర్కోవడంపై ఇప్పటికైతే స్పష్టమైన పరిష్కారమేమీ లేదు. అయితే.. పురుగుమందులు కలిపిన నీటిని ట్రాక్టర్లు, ఇతర మార్గాల ద్వారా చల్లడం కొంతమేర ప్రయోజనం చూపిస్తోంది. దండును తరిమికొట్టేందుకు రైతులు డప్పుల్ని కొట్టడం, టపాసులు పేల్చడం, పెద్ద శబ్దాలు చేయడం వంటి మార్గాలనూ ఆశ్రయిస్తున్నారు. నిపుణుల సూచన మేరకు మట్టిని దున్నడం ద్వారా.. మిడతల సంతానోత్పత్తికి పరిస్థితి అనుకూలించకుండా చేస్తున్నారు. మరోవైపు.. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వైవిధ్యమైన పరిష్కారాన్ని సూచించారు. మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని.. అవి లక్షలాదిగా లభ్యమవుతున్న కారణంగా వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని ప్రతిపాదించారు. చరిత్రలో చాలా దేశాలు వీటిని ఆహారంగా తిని, బెడదను తగ్గించుకున్నాయని వారు పేర్కొంటున్నారు.’’


తెలంగాణ అప్రమత్తం

మిడతల దండు మహారాష్ట్రలోని అమరావతి వరకూ చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. అమరావతిలో అదుపు కాని పక్షంలో.. త్వరలోనే రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం కావాలని సూచించారు. సస్యరక్షణ రసాయన మందులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆయన స్పష్టం చేశారు. 


సెంట్రల్‌ డెస్క్

Updated Date - 2020-05-27T07:13:39+05:30 IST