గ్రాసానికి ‘గడ్డు’ కాలం

ABN , First Publish Date - 2020-11-29T04:55:17+05:30 IST

పాడి రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొర తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకూ భారంగా మారుతోంది. నీటి ఎద్దడి ఉండటంతో వరిసాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గింది. దానికి తోడు కూలీల కొరత తీవ్రంగా వేదిస్తుండడంతో పశుగ్రాసం కొరత తీవ్రమవుతోంది.

గ్రాసానికి ‘గడ్డు’ కాలం
మేతకోసం ఎదురు చూస్తున్న గేదెలు

 రూ.10వేలు పలుకుతున్న ట్రాక్టర్‌ లోడ్‌ వరిగడ్డి

ధరలు పెరగడంతో అప్పులపాలవుతున్న పాడి రైతులు

సాకలేక అమ్మేసుకుంటున్న వైనం 


బూర్గంపాడు, నవంబరు 28: పాడి రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొర తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకూ భారంగా మారుతోంది. నీటి ఎద్దడి ఉండటంతో వరిసాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గింది. దానికి తోడు కూలీల కొరత తీవ్రంగా వేదిస్తుండడంతో పశుగ్రాసం కొరత తీవ్రమవుతోంది.  భద్రాద్రి జిల్లాలో పాడిపై ఆధారపడిన రైతులు ఎక్కువగానే ఉన్నారు. అయితే బూర్గంపాడు లాంటి మండలాల్లో పాడికి సరిపడ పశుగ్రాసం దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పశువులకు మేత తగినంత లేకపోవడంతో ఈ మండలానికి చెందిన పాడి రైతులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి తోడు దాణా ఖర్చు పెరిగిపోయింది. 50 కిలోల తవుడు ధర సుమారు రూ.1,000,  బస్తా పిండి ధర రూ.900, 50 కిలోల జొన్నల ధర రూ.1000 ఉండటంతో రైతులకు పశు పోషణపై ఆసక్తి సన్నగిల్లుతోంది. ఒక ట్రాక్టరు ఎండుగడ్డి దాదాపు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు  పలుకుతుండటంతో అప్పులు చేసి మరీ పాడి రైతులు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. అంతేగాక వాగుల దగ్గర, ఊరికి పొలిమేరల్లో, చెరువు ఆయకట్టు కింద, బోరు బావులున్న రైతులు పచ్చి గడ్డి సాగు చేసి ఎక్కువ ధరలకు ఎగుమతులు చేయడంతో ఏం తోచని పాడి రైతులు అప్పులు చేసి పచ్చిగడ్డిని కోనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి వ్యాపారులు వివిధ క్రమాల్లో ధరలను అమాంతం పెంచుతున్నారు. అయినాసరే పాడి రైతులు తప్పని పరిస్థితుల్లో దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర సమస్యల కారణంగా వరి ఎక్కువగా పండించే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో ఎండుగడ్డి ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు. బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర సంతకు వారానికి వందల సంఖ్యలో పశువులు అమ్మకాని వస్తున్నాయి. పని చేసే ఎడ్లను కూడా విక్రయించక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు పాడికి దెబ్బతిన్న గేదెలు కబేళాలకు తరలుతున్నాయి. పశువుల కోసం నిర్మించే పాకల నిర్మాణానికి అధిక వ్యయం అవుతుండటంతో నిర్మాణ భారాన్ని భరించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.  


కూలీల కొరతతో ఎండుగడ్డికి భారీ డిమాండ్‌ 


రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను కూలీలతో కోయించి కుప్పలు చేస్తేగానీ ఎండు గడ్డి లభించదు. కానీ గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో పాటు కూలీ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్క ఎకరానికి వరి కోత మొదలు కుప్పలు చేయడానికి కూలీలకు, ట్రాక్టర్‌ కిరాయిలతో కలుపుకొని సుమారు రూ.15వేలు వరకు ఖర్చవుతుంది. అదే మిషన్‌ ద్వారా ఎకరం పొలాన్ని కోయిస్తే కేవలం రూ.నాలుగు వేలు  మాత్రమే ఖర్చవుతుంది. దీంతో రైతులు ఎక్కువుగా వరికోత మిషన్‌లను ఆశ్రయిస్తున్నారు. మిషన్‌ కోతతో  తక్కువ మొత్తంలో గడ్డి లభిస్తుంది. ఆ గడ్డిని మళ్లీ మోపులుగా చేసుకొని తరలించాల్సిన పరిస్థితి ఉంది. కాగా కూలీల కొరత కారణంగా ఎండుగడ్డి డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో పాడి రైతులు గ్రామ శివారులోని జున్ను గడ్డి, జాడును కిరాయికి తీసుకుని పశువులను మెపాల్సిన పరిస్ధితి నెలకొంది. కొంతమంది పశువులను పోషించలేక కబేళాలకు, సంతలకు తరలించి అమ్ముకుంటున్నారు. 


భారంగా మారిన పశుపోషణ

మేడం రామిరెడ్డి, పాడిరైతు, మోరంపల్లి బంజర


కూలీల కొరత కారణంగా ఎండుగడ్డికి భారీగా డిమాండ్‌ పెరిగింది. దీంతో ఎకరం ఎండుగడ్డి ఇంటికి చేరాలంటే పది వేలకు పైగా ఖర్చువుతుంది. దానికి తోడు దాణా రేట్లు సైతం విపరీతంగా పెరగడంతో పశుపోషణ భారంగా మారింది. 


Updated Date - 2020-11-29T04:55:17+05:30 IST