అడవి బిడ్డలకు అందని వైద్యం!

ABN , First Publish Date - 2020-06-03T10:03:56+05:30 IST

ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యం ..

అడవి బిడ్డలకు అందని వైద్యం!

మన్యం ఆస్పత్రుల్లో అరకొర సిబ్బంది

పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఉండాల్సింది 120 మంది...

ప్రస్తుతం ఉన్నది 32 మంది!

అరకులోయ ఏరియా, చింతపల్లి సీహెచ్‌సీలో సైతం ఇదే పరిస్థితి

స్థానికంగా నివాసం ఉండని పీహెచ్‌సీ వైద్యులు

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

నేడు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పాడేరు రాక

విలేజ్‌ క్లినిక్‌లు, మలేరియా నివారణ చర్యలపై సమీక్ష


పాడేరు, జూన్‌ 2:ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదు. మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు, అంటురోగాలతో ఏటా పదుల సంఖ్యలో గిరిజనులు మృత్యువాతపడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో మొత్తం ఆరున్నర లక్షల మంది గిరిజనులుండగా వారిలో ప్రతి ఏడాదీ రెండున్నర లక్షల మంది గిరిజనులు జ్వరాల బారినపడుతున్నారు.



మైదాన ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో జ్వరాలు, అంటువ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల సమస్య అధికంగా ఉంటుంది. మైదానంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఆస్పత్రులు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ మన్యంలో గిరిజనులకు ప్రభుత్వ ఆస్పత్రులే పెద్ద దిక్కు. పాడేరులో 200 పడకల జిల్లా ఆస్పత్రి, అరకులోయలో 100 పడకలతో ఏరియా ఆస్పత్రి, చింతపల్లిలో 50 పడకలతో సీహెచ్‌సీ వున్నప్పటికీ, వీటిలో పూర్తిస్థాయిలో వైద్య నిపుణులు, సిబ్బంది లేకపోవడంతో మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. పాడేరు ఆస్పత్రిలో నలుగురు సివిల్‌ సర్జన్లు ఉండాలి.


కానీ ఒక్కరు కూడా లేరు. ఇంకా పలు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. ఇది పేరుకే 200 పడకలు తప్ప, 50 పడకల సీహెచ్‌సీ స్థాయిలో కూడా వైద్యులు, సిబ్బంది లేరు. అరకులోయ, చింతపల్లి ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితి. ఏజెన్సీలో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో వైద్య సిబ్బంది కొరత అంతగా లేనప్పటికీ, సమయపాలన కొరవడడంతో గిరిజనులకు వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. అదేవిధంగా 80 శాతం మంది వైద్యులు స్థానికంగా నివాసం వుండడం లేదు. పాడేరు, చింతపల్లి, అరకులోయతోపాటు మైదాన ప్రాంతంలోని నర్సీపట్నం, విశాఖ, చోడవరం, అనకాపల్లిల్లో  వుంటూ, వారంలో అప్పుడప్పుడు చుట్టంచూపుగా పీహెచ్‌సీలకు వచ్చిపోతున్నారు. దీంతో చిన్నపాటి జ్వరాలకు సైతం పాడేరు, అరకు, చింతపల్లి ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.


పాడేరు ఆస్పత్రిలో ఉండాల్సింది 120 మంది...ఉన్నది 32 మందే!

పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు సిబ్బంది కలిపి 120 మంది వుండాలి. కానీ ప్రస్తుతం 32 మంది మాత్రమే ఉన్నారు. కీలకమైన సివిల్‌ సర్జన్‌, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌నర్సుల్లో సగం మంది కూడా లేరు. చింతపల్లి సీహెచ్‌సీలో మొత్తం 55 మంది వుండాలి. కానీ ప్రస్తుతం 20 మందికి మించి లేరు. 


పారామెడికల్‌ సిబ్బంది సేవలు అంతంతమాత్రమే.....

గ్రామ స్థాయిలో రోగులకు వైద్యం అందించే పారామెడికల్‌ సిబ్బంది సేవలు సక్రమంగా అందడం లేదు. దీంతో రోగులు చిన్నపాటి జ్వరాలకు కూడా పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు వస్తున్నారు. సబ్‌సెంటర్ల పరిధిలో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్‌లు, ఆశ కార్యకర్తల పనితీరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యసేవలు సరిగా అందడంలేదు.


ఈ ఏడాది దోమల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, కరోనా వైరస్‌తో లాక్‌ డౌన్‌ విధించడంతో మందు పిచికారీ పనులు అంతంతమాత్రంగానే జరిగాయి. ఫలితంగా గత నాలుగు నెలల్లో మలేరియా కేసులు విపరీతంగా పెరిగాయి. బుధవారం పాడేరు పర్యటనకు వస్తున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) ఏజెన్సీలో వాస్తవ పరిస్థితులను గుర్తించి జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లను బలోపేతం చేసి, తమకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మన్యం వాసులు కోరుతున్నారు. 


గిరిజన ప్రాంత వైద్య సేవలపై మంత్రి సమీక్ష నేడు 

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ బుధవారం పాడేరు రానున్నారు. పాడేరు, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందుతున్న తీరుపై ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు, మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి టీడీఏ పీవోలు, మూడు జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, ఎండీఎంహెచ్‌వోలు హాజరుకానున్నారు. కాగా మంత్రి పర్యటన నేపథ్యంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెడికల్‌ కళాశాలకు ఎంపిక స్థలాన్ని పరిశీలించి, రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. 

Updated Date - 2020-06-03T10:03:56+05:30 IST