గ్రానైట్‌..రాంగ్‌రూట్‌

ABN , First Publish Date - 2021-06-24T06:38:06+05:30 IST

గ్రానైట్‌ శ్లాబుల అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది. అధికారపార్టీ నాయకులు రాంగ్‌ రూట్‌లో అక్రమార్జనకు తెగబడ్డారు.

గ్రానైట్‌..రాంగ్‌రూట్‌
మార్టూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న గ్రానైట్‌ శ్లాబుల లారీలు, గ్రానైట్‌ శ్లాబులు

ఎల్లలు దాటుతున్న శ్లాబులు

అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో ప్రైవేట్‌ సైన్యం

అత్యధికశాతం అనధికారిక రవాణా

నెలకు రూ.24కోట్ల మేర 

ప్రభుత్వాదాయానికి గండి

అక్రమార్కుల జేబులోకి రూ.2.5కోట్లు

వారి మధ్య విభేదాలతో బహిర్గతమైన వసూళ్ల దందా

గ్రానైట్‌ అక్రమ రవాణా రూటు మారింది. సర్కారు ఆదాయానికి తూట్లు పొడుస్తూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు సరికొత్త దందాకు తెరతీశారు. రేటు ఫిక్స్‌ చేసుకొని లారీలను సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లా నుంచి శ్లాబులు అత్యధిక శాతం మహారాష్ట్రకు ఎగుమతి అవుతుంటాయి. మన రాష్ట్ర సరిహద్దు దాటితే తెలంగాణ, మహారాష్ట్రల్లో ఎటువంటి ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని అక్రమార్కులు అవకాశంగా తీసుకున్నారు. గతేడాది అన్నిరకాల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టులను తర్వాత ఎత్తివేయడం కూడా వారికి కలిసొచ్చింది. అధికారపార్టీ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి ప్రైవేటు సైన్యాన్ని  ఏర్పాటు చేసుకున్నారు. అక్రమ రవాణాకు సహకారం అందిస్తూ దోపిడీ మొదలుపెట్టారు. అధికారులకు మామూళ్ల నుంచి అంతా తాము చూసుకుంటామని గ్రానైట్‌ రవాణాదారులతో బేరాలు మాట్లాడుకొని రేటు నిర్ణయించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అనధికారిక వసూళ్లు చేపట్టారు. అయితే ముగ్గురి మధ్య విభేదాలు రావడంతో వ్యవహారం బట్టబయలైంది.

అద్దంకి/బల్లికురవ/మార్టూరు, జూన్‌ 23 : గ్రానైట్‌ శ్లాబుల అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది. అధికారపార్టీ నాయకులు రాంగ్‌ రూట్‌లో అక్రమార్జనకు తెగబడ్డారు. దీంతో నెలకు సుమారు రూ.24కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. అక్రమార్కుల జేబుల్లోకి నెలకు రూ.2.5 కోట్లు చేరుతోంది. అక్రమ రవాణాతో ఎగుమతి దారులకు ఒక్కో లారీకి రూ.60వేలు ఆదా అవుతోంది. దీంతో అత్యధిక శాతం అనధికారికంగానే రవాణా జరుగుతోంది. 


రోజుకు 150 లారీల్లో గ్రానైట్‌ ఎగుమతి

బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు మండలాల పరిధిలో 400 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి నుంచి సరాసరిన రోజుకు 150లారీల గ్రానైట్‌ శ్లాబులు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి జరుగుతున్నాయి. వీటిలో రోజుకు   దాదాపు వంద గ్రానైట్‌ లారీలు అనధికారికంగా ఎల్లలు  దాటుతుంటాయి. ఒక్కో లారీలో 4 వేల అడుగుల దాకా గ్రానైట్‌ శ్లాబులు రవాణా అవుతాయి. అడుగుకు రూ.10 చొప్పున 4వేల అడుగులకు రూ.40వేలు రాయల్టీ రూపేణా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇక లారీలో సరుకు విలువ రూ.2లక్షలకు జీఎస్టీరూపేణా 18శాతం చొప్పున రూ.36వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో గ్రానైట్‌ శ్లాబుల లారీ నుంచిప్రభుత్వానికి సరాసరిన రూ.75వేల నుంచి రూ.80వేలు రావాల్సి ఉంది. 


అధికారపార్టీ నాయకులు.. ప్రైవేటు సైన్యం

గతంలో గ్రానైట్‌ వ్యాపారులు తనిఖీకి వచ్చిన అధికారులను మామూళ్లతో లోబర్చుకునేవారు. అదే సమయంలో ఆయా శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు అందేవి. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఇటీవల సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లోని అధికారపార్టీకి చెందిన ముగ్గురు కీలక నాయకులు రంగంలోకి దిగారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముగ్గురు నాయకుల మధ్య సెల్‌ఫోన్‌ మెసేజ్‌లతో అక్రమ రవాణా సాగిస్తున్నారు.  ఒక్కో లారీని జిల్లా సరిహద్దులు దాటించినందుకు రూ.8 వేలు వసూలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ఉన్న గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఒక్కో లారీకి రూ.12 వేలు అక్కడి చెక్‌పోస్టు సిబ్బంది వసూలు చేస్తున్నారు. ముగ్గురు నాయకుల నుంచి నగదు లావాదేవీలు పూర్తయ్యాయని సమాచారం వచ్చిన తర్వాతనే గ్రానైట్‌ శ్లాబుల లారీ ముందుకు కదిలేందుకు గ్రీన్‌సిగ్నల్‌ పడుతుంది. ముగ్గురు నాయకులు ఎవరికి వారే సొంత సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కొన్నిసార్లు ఒకరి కళ్లు గప్పి మరొకరు లారీలను దాటవేస్తున్నారు.  


రాత్రి వేళల్లో కార్లలో చక్కర్లు

ఆ ముగ్గురు నాయకుల ప్రైవేటు సైన్యం రాత్రి వేళల్లో కార్లలో చక్కర్లు కొడుతూ గ్రానైట్‌ లారీలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విజిలెన్స్‌  అధికారులు కూడా తనిఖీలకు వస్తుండటంతో, ఎవరు ప్రైవేటు సైన్యమో, ఎవరు విజిలెన్స్‌ అధికారులో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలువురు ఎగుమతిదారులు అయోమయానికి గురవుతున్నారు. 


ముగ్గురు నాయకుల మధ్య విభేదాలు 

నాయకులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యం ఆధ్వర్యంలో వసూలు చేసిన మొత్తంలో పోలీస్‌, మైనింగ్‌, విజిలెన్స్‌, రవాణా, రెవెన్యూ శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టచెప్పేవారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని శాఖల అధికారులకు మాముళ్లు నిలిపివేశారు. ఈక్రమంలోనే విజిలెన్స్‌ అధికారుల దాడులు ముమ్మరం అయ్యాయి. దీంతో ఇటీవల మార్టూరు, బల్లికురవల్లో ఐదు లారీలను సీజ్‌ చేసి రూ.4లక్షల చొప్పున అపరాధ రుసుం విధించారు. దీంతో రవాణాదారులు నాయకులపై తిరగబడ్డారు. ఒక్కో లారీకి రూ.8వేలు చెల్లిస్తున్నప్పటికీ విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి లక్షల రూపాయల అపరాధ రుసుం విధిస్తే ఎవరు చెల్లించాలని ఆ ముగ్గురు నాయకులతో రవాణాదారులు వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో రవాణాకు సంబంధించి కొన్ని విషయాలపై ముగ్గురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈక్రమంలోనే వారి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో వైరల్‌గా మారింది. 


గుంటూరు జిల్లా దాటి..

బల్లికురవ, సంతమాగులూరు మండలాల గుండా ప్రయాణించే లారీల నుంచి మాత్రం ఆ ముగ్గురు నాయకుల ప్రైవేటు సైన్యం వసూలు చేస్తున్నారు. ఇక మార్టూరు నుంచి చిలకలూరిపేట మీదుగా వెళ్లే లారీల రవాణాదారులు మాత్రం గుంటూరు జిల్లా పోలీసులు, అధికారులకు నేరుగా నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈవిధమైన అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఖాజానాకు నెలకు సుమారు రూ.24కోట్ల మేరు ఆదాయానికి గండిపడుతోంది. అయినప్పటికీ ఆయా శాఖల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రైవేట్‌ సైన్యం వసూళ్లదందాకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి గతంలో వలే జిల్లాలోని సరిహద్దు  ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని  పలువురు కోరుతున్నారు.


Updated Date - 2021-06-24T06:38:06+05:30 IST