సంక్షోభంలో గ్రానైట్‌ పరిశ్రమ

ABN , First Publish Date - 2022-05-25T08:30:31+05:30 IST

రాష్ట్రంలోని గ్రానైట్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది.

సంక్షోభంలో గ్రానైట్‌ పరిశ్రమ

  • తీవ్ర ప్రభావం చూపుతున్న చమురు ధరలు..
  • తగ్గిన విదేశీ ఎగుమతులు
  • నామమాత్రంగా స్వదేశీ అమ్మకాలు
  • ఆర్థిక భారంతో  తప్పని అగచాట్లు
  • ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్న వ్యాపారులు


ఖమ్మం, మే 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలోని గ్రానైట్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు ఇతర వ్యాపారాల మాదిరిగానే గ్రానైట్‌ పరిశ్రమ కూడా దెబ్బతిన్నది. కానీ, కరోనా ప్రభావం తగ్గి పరిశ్రమ కోలుకుంటున్న దశలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తదితర అంశాలు ఈ రంగాన్ని మరింత దెబ్బతీశాయి. దేశీయంగాను, అంతర్జాతీయంగాను వ్యాపారం లేక పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. తెలంగాణలో గ్రానైట్‌ రంగం గణనీయంగా విస్తరించింది. వెయ్యి వరకు గ్రానైట్‌ క్వారీలు, మూడు వేల దాకా స్లాబ్‌, టైల్స్‌ పరిశ్రమలు ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి సుమారు రూ.3వేల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతుంటాయి.  


ఎగుమతులపై ఇంధన ధరల ప్రభావం 

తెలంగాణలో పలు రంగుల్లో దొరికే గ్రానైట్‌కు విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. రాష్ట్రం నుంచి చైనా, రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా, కెనడా, యూకే తదితర దేశాలకు గ్యాంగ్సా (పెద్ద బండ రాళ్ల రూపంలో ముడిసరుకు)తో పాటు గ్రానైట్‌ టైల్స్‌, స్లాబ్స్‌ ఎగుమతి అవుతుంటాయి. అయితే, కొంతకాలంగా చైనాకు మాత్రమే గ్యాంగ్సా వెళుతుంది. ఇతర దేశాలకు జరిగే ఎగుమతులు నిలిచిపోయాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పలు దేశాల్లో నాటో విధించిన ఆంక్షలు ఇందుకు కారణమని వ్యాపారులు అంటున్నారు. వీటికి తోడు పెరిగిన ఇంధన ధరలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. గతంలో 30 టన్నుల బరువు ఉన్న గ్రానైట్‌ టైల్స్‌ కంటెయినర్‌ను ఓడలో ఎగుమతి చేసేందుకు కనీసం 1500 డాలర్లు వసూలు చేసేవారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఆ ధర 2800 డాలర్లకు చేరింది. రవాణా చార్జీల భారం పెరగడంతో విదేశీ వ్యాపారులు భారత్‌ నుంచి గ్రానైట్‌ను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోపక్కసిమెంట్‌, ఇనుము ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో  దేశీయంగా గృహ అవసరాలకు గ్రానైట్‌ వాడే వారి సంఖ్య తగ్గింది. వ్యయాన్ని తగ్గించుకునేందుకు గ్రానైట్‌ బదులు సిరామిక్‌ టైల్స్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు మూతపడతాయని ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.


ఖమ్మం జిల్లాలో చాలావరకు మూత..

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 355 స్లాబ్‌, 80 టైల్స్‌ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి వెయ్యి నుంచి రూ.1200కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. పన్నులు, మైనింగ్‌ రాయల్టీలు తదితర రూపాల్లో వీటి ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. అయితే, వ్యాపారం లేక ఆర్థిక భారం మోయలేక ఇందులో చాలా పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. ఇక, మిగిలిన పరిశ్రమల్లో ముడి సరుకుతోపాటు ఫినిషింగ్‌ టైల్స్‌ నిల్వలు పేరుకుపోయాయి. 


ప్రభుత్వాలు ఆదుకోవాలి 

గ్రానైట్‌ పరిశ్రమ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అర్థం చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులను ఆదుకోవాలి. కొత్త మైనింగ్‌ లీజులుకు పచ్చజెండా ఊపాలి. దాని వల్ల ఎక్కువ మెటీరియల్‌ అందుబాటులోకి వచ్చి ధరలు తగ్గుతాయి. దాంతో సిరామిక్‌ టైల్స్‌ నుంచి ఎదురువుతున్న పోటీని తట్టుకోగలుగుతాం. ప్రస్తుతం పరిశ్రమ నడవాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. ప్రభుత్వం గ్రానైట్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. లేదంటే మరికొన్ని పరిశ్రమలు మూతపడతాయి

- రాయల నాగేశ్వరరావు, 

గ్రానైట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకుడు


ఆర్థికంగా దెబ్బతింటున్నాం

ఉక్రెయిన్‌, రష్యా, యుద్ధం వల్ల విదేశాలకు టైల్స్‌, స్లాబ్‌ ఎగుమతి చేయలేకపోతున్నాం. ఆంక్షలు, ధరలు, రూపాయి విలువ తదితర అంశాల వల్ల విదేశాల నుంచి ఆర్డర్లు  కూడా రావడం లేదు. దీంతో తీవ్రనష్టాలు ఎదుర్కొంటున్నాం. మా సమస్య ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వాలు స్పందించి మాకు చేయూతనివ్వాలి. గ్రానైట్‌ పరిశ్రమలకు పన్ను రాయితీ, విద్యుత్‌ రాయితీలు ఇవ్వాలి. పెరుగుతున్న డీజిల్‌ భారాన్ని ప్రభుత్వాలు తగ్గించాలి.  

  • - జగదీష్‌, భారతి గ్రానైట్‌ యజమాని

Updated Date - 2022-05-25T08:30:31+05:30 IST