వలస కూలీల విలాపం

ABN , First Publish Date - 2020-04-04T09:32:25+05:30 IST

లాక్‌డౌన్‌తో ఇళ్ళలో ఉండలేక జనం ఒకరకంగా అవస్థ పడుతూ ఉంటే, ఇళ్లే లేనివారి సమస్యలు ఇంకో రకంగా ఉన్నాయి.

వలస కూలీల విలాపం

వెళ్ళలేరు, ఉండలేరు

పస్తులు, అనారోగ్య సమస్యలు

వీరికి వైరస్‌ సోకితే ప్రమాదం


లాక్‌డౌన్‌తో ఇళ్ళలో ఉండలేక జనం ఒకరకంగా అవస్థ పడుతూ ఉంటే, ఇళ్లే లేనివారి సమస్యలు ఇంకో రకంగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచీ, వివిధ జిల్లాల నుంచీ అనేక పనుల కోసం జిల్లాలో ఉన్న వేలాది మంది వలస కూలీలు విలవిల లాడుతున్నారు. అటు సొంత ఊళ్లకు వెళ్ళలేక, ఉన్నా పనుల్లేక పస్తులపాలవుతున్నారు. టీటీడీ సహా, ఎందరో దాతలు ముందుకొచ్చి ఆహార పొట్లాలు అందిస్తున్నా జిల్లాలో చిక్కుబడిపోయిన అందరికీ ఇవి సరిపోవడం లేదు. ప్రభుత్వ శిబిరాల్లోనూ, బయటా సమూహాలుగానే జీవిస్తున్న వీరు వైరస్‌ బారిన పడితే మాత్రం ప్రమాద తీవ్రత ఊహాతీతం. 


తిరుపతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచీ వచ్చి బతుకుదెరువు కోసం వివిధ రకాల పనులు చేసుకునే వలస కూలీల సంఖ్య గణనీయంగా వుంది. గ్రానైట్‌ పరిశ్రమల్లో పని చేయడానికి తమిళనాడు నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో కార్మికులు వస్తుంటారు. భవన నిర్మాణం, వుడ్‌వర్క్‌, వ్యవసాయం  పనుల కోసం కూడా వీరు పెద్ద సంఖ్యలో జిల్లాలో ఉన్నారు. కూలి పనుల కోసం కూడా  ఇతర జిల్లాల నుంచీ వచ్చిన వారూ వుంటున్నారు. ఇళ్ళ నుంచి వచ్చేసి తిరుపతికి చేరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. ఆథ్మాత్మిక క్షేత్రం అయిన తిరుపతిలో  యాచకుల సంఖ్య కూడా తక్కువేం లేదు.  వీరి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో చాలా మంది ఇరుకిరుకు గదుల్లో కిక్కిరిసి ఉంటారు. చాలా మంది రోడ్ల పక్కన పేవ్‌మెంట్ల మీదే పడుకుంటారు. లాక్‌డౌన్‌ తర్వాత వీరి పరిస్తితి దయనీయంగా తయారైంది.


హఠాత్తుగా కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సమస్తం స్తంభించిపోయాయి. కరోనా భయం వెంటాడుతున్నా సొంత ఊళ్ళకు వెళ్లే మార్గం లేదు. ఉండిపోదామన్నా చేసుకోవడానికి పనుల్లేవు. పనిలేకపోతే పస్తులే గతి.  మరోవైపు లాక్‌డౌన్‌ తర్వాత తమ ప్రాంతాలకు వెళ్లిపోదామనే ఆతృతతో రకరకాల వాహనాల్లోనూ, నడిచీ ప్రయాణం అయినవారు ఎందరో జిల్లాలో చిక్కుబడిపోయారు. ఈ విధంగా తమిళనాడు, కర్నాటక, కొన్ని ఉత్తరాది రాషాల వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 


ఆదుకుంటున్న యంత్రాంగం

ఇటువంటి వారి కోసం జిల్లా యంత్రాంగం 24 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిలో 1028 మందికి బస, భోజనం కల్పిస్తున్నారు. చిత్తూరులో 6, శాంతిపురం, పలమనేరు, యాదమరి, పుత్తూరు, తవణంపల్లె, రేణిగుంట, శ్రీకాళహస్తి, పీటీఎంలలో ఒక్కొక్కటి చొప్పున, తిరుపతి అర్బన్‌లో 5,  మదనపల్లెలో 3, కుప్పంలో 2 చొప్పున ఈ రిలీఫ్‌ క్యాంపులున్నాయి. వీటిలో 3978 మందికి వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌ఘడ్‌, జార్కండ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, హర్యానా, సిక్కిం, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాలతో పాటు నేపాల్‌కు చెందిన వారు కూడా  ఈ శిబిరాల్లో ప్రస్తుతం వున్నారు. ఈ శిబిరాల్లో ఉంటే చిక్కుకుపోతామనే భయంతో చాలా మంది దూరంగానూ ఉండిపోయారు. తిరుపతిలో టీటీడీ, మున్సిపల్‌ యంత్రాంగాలు భారీగానే సాయం అందిస్తున్నాయి.


మరోవైపు జిల్లాకు చెందిన వలస కూలీలున్న మున్సిపల్‌ పట్టణాల్లో 13 తాత్కాలిక వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటిలో 1312 మందికి బస, భోజనం కల్పిస్తున్నారు. తిరుపతి, చిత్తూరుల్లో ఐదు చొప్పున, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరుల్లో ఒక్కొక్కటి చొప్పున వున్నాయి. వీటిని మెప్మా ఆధ్వర్యంలో స్వచ్చంద సంస్థల ద్వారా నడుపుతున్నారు. వీటిలో బస, భోజనంతో పాటు మాస్కులు, శానిటైజర్లు కూడా అందిస్తున్నారు. చివరగా మున్సిపల్‌ నగరాలు, పట్టణాల్లోని నిరాశ్రయుల కోసం చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, శ్రీకాళహస్తి పట్టణాల్లో ఒక్కొక్కటి చొప్పున, తిరుపతిలో రెండు వంతున మొత్తం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 177 మందికి ఆశ్రయం కల్పించారు.

Updated Date - 2020-04-04T09:32:25+05:30 IST