అక్రమ రవాణా..ఆగేనా?

ABN , First Publish Date - 2022-07-24T05:24:59+05:30 IST

గ్రానైట్‌ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

అక్రమ రవాణా..ఆగేనా?
సంతమాగులూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన ్న పట్టుబడ్డ గ్రానైట్‌

గ్రానైట్‌ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా!

కొత్త పోలీస్‌ సర్కిళ్ళ ఏర్పాటుతో ఆశాభావం

ఇప్పటికే అడపదడపా విజిలెన్స్‌ దాడులు


అద్దంకి, జూలై 23: గ్రానైట్‌ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. గ్రానైట్‌ రంగం నుంచి వచ్చే మామూళ్లకు అలవాటు పడిన పలు శాఖల అధికారులు అక్రమ రవాణాపై కొరడా ఝులిపించకుండా మిన్నకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్వారీల నుంచి అనుమతికి మించి గ్రానైట్‌ రాయి ఫ్యాక్టరీలకు, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు గ్రానైట్‌ స్లాబులు తరలిపోతుంటాయి.  90 శాతం జీఎస్టీ, రాయల్టీ చెల్లించకుండానే రాష్ట్ర హద్దులు దాటుతున్నాయి. రోజుకు సరాసరిన 70 నుంచి 80 లారీల్లో శ్లాబులు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీలోని గ్రానైట్‌ శ్లాబులకు జీఎస్టీ, రాయల్టీ రూపేణ సుమారు రూ.70 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అధికారులకు అక్రమార్కులు ముట్టజెప్పి రాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుండగా, అక్రమార్కులు మాత్రం కోట్లకు పడుగలెత్తుతున్నారు.


కొత్తగా సర్కిళ్లు ఏర్పాటు..

 ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పోలీస్‌ సర్కిళ్లను ఏర్పాటుచేసింది. అద్దంకి, మార్టూరు ప్రాంతాల్లో కొత్తగా మూడు సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. ఇందులో అద్దంకి పోలీస్‌ స్టేషన్‌ అప్‌గ్రేడ్‌ కాగా.. సంతమాగులూరు, మార్టూరు సర్కిళ్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈ రెండు సర్కిళ్ల పరిధిలోనే గ్రానైట్‌ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. సంతమాగులూరు సర్కిల్‌ పరిధిలో సంతమాగులూరు, బల్లికురవ మండలాలు ఉండగా, ఆ పరిధిలోనే గ్రానైట్‌ క్వారీలు  ఉన్నాయి. గ్రానైట్‌ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. మార్టూరు సర్కిల్‌ పరిధిలో మార్టూరు, యద్దనపూడి, పర్చూరు మండలాలు ఉన్నాయి. ఇందులో మార్టూరులో గ్రానైట్‌ ఫ్యాక్టరీలు  పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 

 

 అక్రమ రావాణాకు బ్రేక్‌  పడేనా!

ఈ నేపథ్యంలో ఇటీవల మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారుల దాడులు అడపదడపా చేస్తుండటంతో అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్‌ లారీలు పట్టుబడుతున్నాయి. అయితే అపరాధ రుసుము విధించి వదిలివేస్తుండటంతో దొరికితే దొంగ లేద ంటే దొర అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. కొత్తగా ఏర్పడ్డ సంతమాగులూరు, మార్టూరు  పోలీస్‌ సర్కిళ్ల పరిధి నుంచే గ్రానైట్‌ అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో సీఐలు మరింత నిఘా పెడితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


 

Updated Date - 2022-07-24T05:24:59+05:30 IST