బాలుడి సంరక్షణ తాతయ్యనానమ్మల వద్దే ఉత్తమం.. పెద్దమ్మకు నిరాశ.. Supreme court ఆసక్తికర తీర్పు

ABN , First Publish Date - 2022-06-09T23:03:20+05:30 IST

తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడు తన పెద్దమ్మ(తల్లి సోదరి) వద్ద పెరగడం కంటే తాతయ్యనాన్నమ్మల(తండ్రి అమ్మానాన్నలు) సంరక్షణలో ఎదగడమే ఉత్తమమని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. 6 ఏళ్ల బాలుడి సంరక్షణ విషయంలో తాతయ్యనాన్నమ్మలకు అనుకూలం

బాలుడి సంరక్షణ తాతయ్యనానమ్మల వద్దే ఉత్తమం.. పెద్దమ్మకు నిరాశ.. Supreme court ఆసక్తికర తీర్పు

న్యూఢిల్లీ : తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడు(boy) తన పెద్దమ్మ(తల్లి సోదరి) వద్ద పెరగడం కంటే తాతయ్యనాన్నమ్మల(తండ్రి అమ్మానాన్నలు) సంరక్షణలో ఎదగడమే ఉత్తమమని సుప్రీంకోర్ట్(supreme court) అభిప్రాయపడింది. 6 ఏళ్ల బాలుడి సంరక్షణ విషయంలో తాతయ్యనాన్నమ్మల(Grand parents)కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా గతంలో గుజరాత్ హైకోర్ట్(Gujarat High court) ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. పెద్దమ్మ కంటే తాతయ్యనాన్నమ్మలే భావోద్వేగపరంగా బాలుడికి ఎక్కువ దగ్గరయ్యారని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే  పెద్దమ్మకు బాలుడిని కలుసుకునే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. గతేడాది బాలుడి తల్లిదండ్రులు కరోనా సెకండ్‌ వేవ్‌లో మృత్యువాతపడ్డారు. దీంతో బాలుడి సంరక్షణ విషయంలో తాతయ్యనానమ్మ-పెద్దమ్మ మధ్య వివాదం చెలరేగింది. పెద్దమ్మకు సంరక్షణ బాధ్యత అప్పగిస్తూ గుజరాత్ హైకోర్ట్ గతంలో తీర్పునివ్వడంతో తాతయ్యనాన్నమ్మలు సుప్రీంకోర్ట్‌ గడపతొక్కారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్ వేశారు.


ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్ట్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘ మన సమాజంలో మనువడి సంరక్షణ విషయంలో తండ్రి తరపు తాతయ్యనానమ్మల సంరక్షణ మెరుగ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.’’ అని జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్దా బోస్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. బాలుడు పెరుగుతున్న అహ్మదాబాద్‌లో మంచి చదువు కూడా అందించేందుకు అవకాశం ఉంటుంది. బాలుడి పెద్దమ్మ అహ్మదాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దహోద్‌లో నివసిస్తోందని ప్రస్తావించారు. తాతయ్య వయసు 71 సంవత్సరాలు కాగా నాన్నమ్మ 65 ఏళ్లు అయినా వారి వయసులను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. వయసు పెరిగినా కొద్ది వారిలో సంకల్పం మరింత దృఢంగా ఉంటుంది. బాలుడి సంరక్షణ కోసం మరింత ఉత్సాహం అందిపుచ్చుకుంటారని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. 

 


కాగా గతేడాది మే 13న బాలుడి తండ్రి, ఆ తర్వాతి నెలలో తల్లి కరోనా సెకండ్ వేవ్‌కు బలయ్యారు. తల్లి  అంత్యక్రియలకు వచ్చిన ఆమె తరపు బందువులు బాలుడిని తమవెంటే తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి బాలుడు అక్కడే పెరుగుతున్నాడు. దీంతో బాలుడి తాతయ్యనానమ్మలు తొలుత గుజరాత్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. బాలుడు ఎలా ఉన్నాడో, ఆరోగ్యం, విద్యపై వారు తమ ఆందోళనను కోర్టుకు తెలిపారు. అయితే గుజరాత్ హైకోర్ట్ తీర్పులో బాలుడి సంరక్షణను 46 ఏళ్ల పెద్మమ్మకే అప్పగించింది. ఈ మహిళకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అలాగే ఆమెకు పెళ్లి కాలేదు. ఉమ్మడి కుటుంబంలో జీవిస్తోంది. కాబట్టి బాలుడు అక్కడ పెరగడమే సబబని పేర్కొంది. ఈ తీర్పును తాతయ్యనానమ్మలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

Updated Date - 2022-06-09T23:03:20+05:30 IST