ముంబై : మనుమరాలి కలలను నిజం చేయడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన తాతయ్యకు అనేకమంది మానవత్వంతో అండగా నిలిచారు. కాంక్రీట్ అరణ్యంలో సైతం స్పందించే హృదయంగల దాతలు ఉన్నారని నిరూపించారు. వీరికి వారధిగా ‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ నిలిచింది.
‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ పేజ్‌లో దేశ్‌రాజ్ (74) కథను ప్రచురించారు. తన మనుమరాలి కలను సాకారం చేయడం కోసం ఆయన చేసిన త్యాగం గురించి వివరించారు. దీంతో అనేక మంది మానవత్వంతో స్పందించి, విరాళాలు ఇచ్చారు. మొత్తం మీద ఆయనకు రూ.24 లక్షల వరకు విరాళాలు లభించాయి.
ఈ కథనంలో దేశ్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఓ ఆటో డ్రైవర్. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ మరణించారు. దీంతో తన భార్య, కోడలు, మనుమలను ఆయనొక్కరే పోషిస్తున్నారు. ఆయన మనుమరాలికి కళాశాలలో చదవాలనే బలమైన కోరిక ఉంది. తమ కుటుంబంలో కనీసం ఒకరైనా గ్రాడ్యుయేషన్ చేయాలని, టీచర్ అవాలని ఆయన కూడా కోరుకున్నారు.
గత ఏడాది తన మనుమరాలు 12వ తరగతి పరీక్షల్లో తనకు 80 శాతం మార్కులు వచ్చినట్లు చెప్పడంతో ఆయన సంతోషానికి హద్దులు లేవు. ఆమెను పెద్ద చదువులు చదివించాలని గట్టిగా నిర్ణయించుకుని, ఇంటిని అమ్మేశారు. నివసించేందుకు వసతి లేకపోవడంతో తన భార్య, కోడలు, మనుమలను తమ స్వగ్రామంలోని బంధువుల ఇంటికి పంపించారు. తాను మాత్రం ముంబైలోనే ఆటోలో కాలం గడుపుతున్నారు.
దేశ్‌రాజ్ కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సుమారు రెండు లక్షల లైక్స్, వేలాది షేర్లు వచ్చాయి. దాతలు విరాళాల రూపంలో రూ.24 లక్షలు ఇచ్చారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు.