అపూర్వ విజయం

ABN , First Publish Date - 2020-09-01T09:48:03+05:30 IST

163దేశాలు.. వందకు పైగా ఉద్ధండులైన గ్రాండ్‌మాస్టర్లు.. ఓటమి ఎరుగని ప్రత్యర్థులు..

అపూర్వ విజయం

163దేశాలు.. వందకు పైగా ఉద్ధండులైన గ్రాండ్‌మాస్టర్లు.. ఓటమి ఎరుగని ప్రత్యర్థులు.. ఇంతటి పోటీ నడుమ 96 ఏళ్లుగా ఊరిస్తున్న చెస్‌ ఒలింపియాడ్‌ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు భారత్‌ బరిలోకి దిగింది. అంచనాలకు అందని విధంగా హేమాహేమీ జట్లను చిత్తు చేసి విశ్వ కిరీటాన్ని చేజక్కించుకొంది. యావత్‌ భారతావనిని తమ విజయనాదంతో పులకింప చేసిన భారత చదరంగం బృందంలో ముఖ్యభూమిక పోషించిన తెలుగు గ్రాండ్‌ మాస్టర్ల అనుభవాలు వారి మాటల్లోనే..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)


అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాం


సాధారణంగా ఓపెన్‌, మహిళల విభాగా లకు విడివిడిగా ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు. కరోనా కారణంగా తొలిసారి మిక్స్‌డ్‌ ఫార్మాట్‌లో ఒలింపియాడ్‌ను జరిపారు. సీనియర్లు, జూనియర్ల సమ్మేళనం గల మన జట్టు చక్కటి సమన్వయంతో అంచనాలకు మించి రాణించింది. సమష్టి కృషి, అత్యుత్తమ ప్రదర్శనతో సిద్ధించిన విజయం ఇది. ప్రతి ఒక్కరూ జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తమలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటపెట్టారు. సీనియర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సలహాలు, సూచనలు యువ గ్రాండ్‌మాస్టర్లకు ఉపకరించాయి.


క్వార్టర్స్‌లో బలమైన చైనాను నిలువరించగానే మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సెమీ్‌సలో పోలెండ్‌ను చిత్తు చేశాక ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒలింపియాడ్‌ పతకాన్ని అస్సలు చేజార్చుకోకూడదనుకున్నాం. అయితే, ఫిడే గ్లోబల్‌ సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో నాతో సహా మన ఆటగాళ్లు కొందరు టైటిల్‌ పోరులో ఇబ్బంది పడ్డా.. అంతిమంగా విజేతగా నిలవడం సంతోషంగా ఉంది. ఈ విజయం భారత చెస్‌ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.     

- కోనేరు హంపి


ఆనందం పట్టలేకపోయా.. 


మొదట రష్యా చాంపియన్‌గా అవతరించిందన్నారు.. తర్వాత ఫిడే ఫలితాన్ని సవరించి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించిందనే వార్త చూశా. గెలుపు అంచుల వరకు వెళ్లి ఓడిపోయాం అన్న బాధలో ఉన్న నాకు ఒక్కసారిగా ఆ వార్త చూసి పట్టలేని సంతోషం కలిగింది. నా కెరీర్‌లో ఇదొక చిరస్మరణీయ టైటిల్‌. ఆరంభంలో గేముల్లో నాకు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో తుదిపోరుకు ఇంటి నుంచి కాకుండా ఓ లీగ్‌ వేదిక నుంచి పాల్గొనేందుకు ఫిడే అనుమతి తీసుకున్నా. అక్కడ హైక్వాలిటీ లైవ్‌ స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉండడంతో నా ఆటకు అవాంతరాలు కలగలేదు.


మిగిలిన వారి విషయానికొస్తే సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తక ముందు మన జట్టు.. ఒక గేమ్‌లో డ్రా, రెండు గేమ్‌ల్లో గెలిచే స్థితిలో ఉంది. ఈ సమయంలో సాంకేతిక సమస్యలు దెబ్బ కొట్టాయి. కెప్టెన్‌ విదిత్‌ గేమ్‌లో ఉండడంతో ఫలితంపై వెంటనే ఫిడేకు ఫిర్యాదు చేశాం. దీంతో సాంకేతిక సమస్య ఏర్పడక ముందు ఉన్న గేమ్‌ సమీకరణాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫిడే భారత్‌కు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించి డ్రామాకు తెరదించింది. మొత్తంగా ఓ చరిత్రాత్మక విజయంలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది.           

 -పెంటేల హరికృష్ణ

యువతరానికి స్ఫూర్తి..


ప్రపంచానికి భారత చదరంగం సత్తా ఏంటో ఈ విజయంతో నిరూపితమైంది. ఈ విజయం మాటల్లో వర్ణించలేనంత అపురూపమైనది. టోర్నీ ఆరంభం నుంచి జూమ్‌ మీటింగ్‌ల్లో, వాట్సాప్‌ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు జట్టు సభ్యులంతా కలిసి ఆటలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించుకునేవాళ్లం. అనుకున్నది అనుకున్నట్టు పక్కాగా ఆచరించడంతో విజయం సొంతమైంది. టెక్నికల్‌ అంశాలు గేమ్‌ను బాగా ప్రభావితం చేశాయి. మౌస్‌ను ఉపయోగించడం దగ్గర నుంచి ప్రతీ సాంకేతిక అంశం గేమ్‌తో ముడిపడి ఉండడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయితే, సరైన సన్నద్ధత, వ్యూహాలను పక్కాగా అమలు చేస్తే ఎలాంటి ప్రత్యర్థులనైనా బోల్తా కొట్టించవచ్చు అన్నది నిరూపించాం. చెస్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్న యువతరంలో మా విజయం కచ్చితంగా స్ఫూర్తిని నింపుతుంది.

     - ద్రోణవల్లి హారిక

Updated Date - 2020-09-01T09:48:03+05:30 IST