Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

శంషాబాద్‌ కోసం జగన్‌ పత్రికలో పెట్టుబడి అవాస్తవం

twitter-iconwatsapp-iconfb-icon
శంషాబాద్‌ కోసం జగన్‌ పత్రికలో పెట్టుబడి అవాస్తవం

అది పూర్తిగా కేంద్ర ప్రాజెక్టు.. ఇచ్చింది చంద్రబాబు

భూ కేటాయింపు తీరుపైనే కాగ్‌ అభ్యంతరం

వైశ్యా బ్యాంక్‌ కోసమే రాష్ట్రాన్ని వదిలేశా

విలువలు, సేవా దృక్పథమే జీఎమ్‌ఆర్‌ విజయ రహస్యం

26-8-12న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో గ్రంథి మల్లికార్జున రావు


ఆంధ్రప్రదేశ్‌లో బాగా అభివృద్ధి చెందినవారిలో మీరు ఒకరు. అలాంటిది బెంగళూరులో ఉండటం అన్యాయం కదూ?

1993 దాకా రాజాం(శ్రీకాకుళం)లోనే ఉన్నాను. అప్పట్లో వైశ్యాబ్యాంక్‌ నాయకత్వం చేపట్టాల్సి రావడంతో బెంగళూరు వెళ్లి అక్కడే స్థిరపడిపోయాను.


కుటుంబ నేపథ్యం?

మాది మధ్యతరగతి. నాన్న బంగారం వ్యాపారి. అన్నయ్యలది జూట్‌ వ్యాపారం. నేను చివరివాడిని.


పదో తరగతి ఫెయిలయ్యారు కదా?

అవును. స్నేహితులతో తిరుగుళ్ల వల్ల తప్పాను. మళ్లీ చదవడానికి నాన్న ఒప్పుకోలేకపోతే ఎలాగో ఒప్పించి..మళ్లీ రాసి ఫస్ట్‌ వచ్చాను. బొబ్బలిలో ఇం టర్‌, ఆంధ్రా వర్సిటీలో ఇంజనీరింగ్‌ చేశాను. ఆర్థిక సంస్కరణలకు ముందు వ్యాపారం చేయడం కష్టంగా ఉండేది. అందుకనే.. ఉద్యోగం చేసుకోమని నాన్న గట్టిగా చెప్పారు. ఆస్తి పంపకాలు చేసి నా వాటా కింద మూడు లక్షల దాకా ఇచ్చారు. తదుపరి కాలంలో అదే నా పెట్టుబడి. ఆయన మాట మీద తొలుత రాజమంత్రి పేపర్‌ మిల్లులోనూ, ఆ తరువాత ఇంజనీరింగ్‌ సర్టిఫికేట్‌పై సాగునీటి శాఖలో చేరారు. నాన్న చనిపోవడం, ఆ ఉద్యోగాలు పెద్ద తృప్తిని ఇవ్వకోవడంతో ఆరు నెలల్లోనే ఇంటికి వచ్చాను. అన్నయ్యల జూట్‌ వ్యాపారంలోనే భాగస్వామిగా చేరాను. వ్యాపార ప్రాథమిక సూత్రాలు వారి వద్ద, నాయకత్వ లక్షణాలు కాలేజీ రోజుల్లో అలవర్చుకున్నాను.


చెన్నై వెళ్లి వస్తుండేవారు కదా?

బకాయిల కోసం వెళ్లేవాడిని. ఈ క్రమంలో చెన్నైలో ఓ జూట్‌ మిల్లు అమ్మకానికి రాగా ఆంధ్రా బ్యాంకు నుంచి లోను తీసుకొని రూ.40 లక్షలతో ‘వాసవి జూట్‌ మిల్‌’ పెట్టాను. ఇక వెనక్కి తిరగి చూడలేదు. ఆర్థిక సంస్కరణల ముందు నాటికి మొత్తం 28 పరిశ్రమలు పెట్టాను. విద్యా సంస్థలూ నడిపాను.


మీ స్నేహితుల్లో ఎవరైనా మీ స్థాయికి దగ్గరగానైనా రాగలిగారా?

వారంతా వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. ఆంధ్రా వర్సిటీ క్యాంపస్‌లో వెంకయ్యనాయుడు, హరిబాబు(బీజేపీ) మేమూ ఒకేదగ్గర ఉండేవాళ్లం. వెంకయ్య ఆర్ట్స్‌ విద్యార్థి అయినా హాస్టల్‌లో మాత్రం కలిసే ఉండేవాళ్లం. ఆయన ఇప్పటికీ మల్లిబాబనే అంటారు.


ఈ స్థాయికి చేరుకుంటారని తొలి దశలో ఊహించారా?

లేదు. తొలి నాళ్లలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాను. ఉద్యోగంలో చేరడానికి ముందు ఏపీ స్కూటర్స్‌ డీలర్‌షిప్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యాను. ఆ తరువాత బీర్‌ ఫ్యాక్టరీకి లైసెన్సు వచ్చింది. స్నేహతులనుంచి, ఇతరత్రా రూ. 18 కోట్లు పెట్టుబడిని సమీకరించాం. అయితే, ఎన్టీఆర్‌ ప్రభుత్వం రావడం మద్యనిషేధం ఆలోచన చేయడంతో ఆ ప్రతిపాదన మూలనపడింది. ఒక ఏడాది పాటు కోలుకోలేకపోయాను. అయితే, ఆడబ్బు ఏమి చేయాలనే ఆలోచన రాగా, మౌలిక సదుపాయాల రంగంలోకి అడుగు పెట్టాను. సంస్కరణల ప్రథమార్థంలో మద్రాస్‌లో 2 ఎంయూ సా మర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్‌ను రూ. రూ. 800 కోట్టతో పెట్టాను. విదేశీ పవర్‌ ప్లాంట్లు పెట్టుబడులకు ముందు రావడమే కారణం.


హఠాత్తుగా ఎయిర్‌పోర్టుల్లోకి ఎలా వెళ్లారు?

ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ప్రాజెక్టు చేద్దామని చూస్తుండగా.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కోసం గ్లోబల్‌ టెండర్‌ పిలిచారు. మలేసియా ఎయిర్‌పోర్టుతో కలిసి బిడ్‌ వేశాం. 1999-2000లో అందరి కన్నా తక్కువకు కాంట్రాక్టు దక్కించుకున్నాం. కానీ, 2004లో గానీ ప్రాజెక్టు మొదలు కాలేదు. టెండర్‌ మాకు దక్కినా.. ఎయిర్‌పోర్టు రంగంలో అనుభవం లేనికారణంగా చంద్రబాబు పునరాలోచనలో పడటమే దానికి కారణం. ఆ విషయం తెలిసి వెళ్లి కలిశాను. మద్రాస్‌ పవర్‌ ప్లాంట్‌లో ప్రవేశపెట్టిన అత్యాధునిక పద్ధతులను వివరించి.. ఒక బృందాన్ని పంపి పరిశీలన చేయించమన్నాను. ప్రభుత్వం వైపు నుంచి కొంతమందిని పంపి.. వాళ్లిచ్చిన నివేదికతో ఆయన సంతృప్తి చెందారు. 2003లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు కూడా మాకే వచ్చింది. అప్పట్లో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. 9 కంపెనీలు పోటీకి నిలవగా చాలా పారదర్శకంగా టెండర్‌ ప్రక్రియ సాగింది.

శంషాబాద్‌ కోసం జగన్‌ పత్రికలో పెట్టుబడి అవాస్తవం

మరి ఢిల్లీ ఎయిర్‌ పోర్టు బిడ్డింగ్‌ను కాగ్‌ తప్పుబట్టింది కదా?

ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం ఐదు వేల ఎకరాలను 60 ఏళ్లకు అద్దెకు ఇవ్వడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. ఇలాంటి లీజు ఎక్కడా లేదని, భూకేటాయింపు పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. మాకిచ్చిన భూమిలో ఐదు శాతం (250) వాణిజ్య అవసరాలకు వాడుకునేందుకు అనుమతినిచ్చారు. ఎకరాకు రూ. వంద నిర్ణయించి స్థూల ఆదాయం ఎక్కువగా చూపమని సూచించారు. ఈ మేరకు 49.5 శాతం గ్రాస్‌ రెవెన్యూ చూపించాం. అలాగే, 250 ఎకరాల్లో ఇప్పటిదాకా 45 ఎకరాలను ప్లాట్లుగా వేయగా ఎకరా రూ.1.60 కోట్ల చొప్పున విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి.

 

ఈ లెక్కను కాగ్‌ పరిగణనలోకి తీసుకొని.. 250 ఎకరాలకు 1.60 కోట్ల చొప్పున 60 ఏళ్లకు లెక్కగట్టి 663 లక్షల కోట్లు ఆదాయం లభిస్తున్నట్టు తేల్చింది. అయితే, కాగ్‌ చెప్పినట్టు ప్రస్తుతం మొత్తం 250 ఎకరాల్లోనూ కార్యకలాపాలేవీ లేవు. పైగా గ్రాస్‌ రెవెన్యూ, సబ్సిడీలు(30), డెవలప్‌మెంట్‌ సుంకాలకే సింహభాగం ఆదాయం పోతోంది. పైగా రెండు వేల మంది సిబ్బందికి జీతాలు ఇచ్చుకోవాలి. దాంతో నాన్‌ ఎయిర్‌ (షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు) ప్రాజెక్టులు చేయాల్సి వస్తోంది. అవే లేకుంటే ప్రయాణికులపై ఆ భారం పడేయాల్సి వచ్చేది. ఇక మాకు ఐదువేల ఎకరాలు ఇవ్వడం ఎందుకంటే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు రన్‌వేలు, న్యూ టెర్మినల్‌ బిల్డింగ్‌, కొత్త భవనాలు కట్టాలి.

 

ప్రయాణికుల రద్దీ పెరిగిన కొద్దీ టెర్మినల్స్‌ మరిన్ని అవసరం. అలాగే.. బిల్డింగ్‌ వర్క్స్‌ చేయాలి. అలా చూస్తే అరవై ఏళ్లకు మాకు గిట్టేది కేవలం నాలుగు వేల కోట్లే. ఈ విషయంలో కొన్ని సంస్థలు మాకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లగా, మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ విషయం కాగ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వారు సమాధానపడ్డారు. కోర్టు తీర్పు తమ పరిశీలనకు రాలేదని చెప్పారు. ఇక గవర్నెన్స్‌ విషయంలో మాకు అర్హత లేదని ఢిల్లీ ఎయిర్‌పోర్టు కోసం పోటీపడిన అనిల్‌ అంబానీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. శ్రీధరన్‌ కమిటీ గానీ కోర్టు గానీ మా వాదననే సమర్థించాయి.


శంషాబాద్‌ విషయంలో 50 కోట్లు జగన్‌కు పెట్టుబడి పెట్టారని ఆరోపణ?

సాక్షిలోగానీ వారికి చెందిన మరే సంస్థలోగానీ మా పెట్టుబడులేమీ లేవు. ఎయిర్‌పోర్టు మాకు వచ్చింది చంద్రబాబు హయాంలో..ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో ఏమి సంబంధం?


కనెక్టివిటి విషయంలో సహకరించారని..?

లేదు. కనెక్టివిటిపై తొలినుంచీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఇక్కడ లాగే ఢిల్లీలోనూ రోడ్డు సౌకర్యం వంటివి కల్పించాం. కాబట్టి.. అదీ సరికాదు.


మీ సామాజిక సేవా కార్యక్రమాల గురించి?

నిజానికి.. రాజాంలో ఉన్నప్పుడే ఏవో కార్యక్రమాలు చేస్తుండేవాడిని. సంస్థలు స్థాపించిన తరువాత విద్య, వైద్యం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, ఎన్‌వపర్‌మెంట్‌పై దృష్టి పెట్టాం. ఫౌండేషన్‌ తరఫున కొన్ని, సిబ్బంది వైపు నుంచి మరికొన్ని కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాం. జీఎమ్‌ఆర్‌ గ్రూపులో నాకున్న 11.5 శాతం వాటాను మొత్తంగా సామాజిక సేవా కార్యక్రమాలకు ఇచ్చేశాను. ఈ విషయంలో వారెన్‌ బఫెట్‌, బిల్‌ గేడ్స్‌ నాకు ఆదర్శం.


34 ఏళ్లలో సంతృప్తి ఇచ్చిన ఘటన?

జూటు మిల్లు పెట్టడం; ఢిల్లీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులు కట్టడం, ఫ్యామిలీ గవర్నెన్స్‌ చేయగలగడం సంతృప్తినిచ్చిన విషయాలు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.