విజ్ఞాన కేంద్రాలు.. విలవిల

ABN , First Publish Date - 2021-09-13T05:13:46+05:30 IST

జిల్లాలోని పలు గ్రంథాయాలకు చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ గ్రంథాలయాల పాత్ర విశేషమైనది. నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఆ స్థాయికి వెళ్లడంలో గ్రంథాలయాలు కీలకపాత్ర వహించాయని ఆయా ప్రముఖులు పలు సందర్భాల్లో చెప్తుంటారు.

విజ్ఞాన కేంద్రాలు.. విలవిల
నిరుపయోగంగా ఉన్న బొల్లాపల్లి గ్రంథాలయం

మనుగడ కోల్పోతున్న గ్రంథాలయాలు

పాలకుల నిరాధరణతో కునారిల్లుతోన్న లైబ్రరీలు

జిల్లాలోని పలు గ్రంథాలయాల భవనాలు శిథిలం

కనీస అవసరాలు లేక ఇక్కట్లు పడుతున్న పాఠకులు

కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది కొరతతో తలుపులు తీసేవారే లేరు

 

గ్రంథాలయమంటే విజ్ఞాన భాండాగారం. అలాంటి విజ్ఞాన భాండాగారాలు పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో కునారిల్లుతోన్నాయి. గతంలో గ్రంథాలయాల వారోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించి గ్రంథాలయాల విశిష్ఠత గురించి ప్రజలకు, విద్యార్థులకు వివరించేవారు. అయితే వీటి గురించి అధికారులు, పాలకులు పట్టించుకోక పోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భావితరాలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల తలుపులు తీసే నాధుడు కొన్ని ప్రాంతాల్లో లేడంటే వీటి దుస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు ప్రాంతాల్లో భవనాలు శిథిలమైనా గ్రంథాలయాల గోడు ఆలకించేవారు లేరు.  కొన్ని గ్రంథాలయాల్లో పుస్తకాలు లేకపోవడంతో న్యూస్‌పేపర్లకే పరిమితం కాగా, మరికొన్ని గ్రంథాలయాల్లో నిర్వహణ లేక, వర్షాలకు తడిచి ఎంతో విలువైన గ్రంథాలు, పుస్తకాలు బూజు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వం, స్థానిక సంస్థలు, దాతలు గ్రంథాలయాలను పరిపుష్టం చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కానరావడంలేదు.  


 (ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలోని పలు గ్రంథాయాలకు చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ గ్రంథాలయాల పాత్ర విశేషమైనది. నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఆ స్థాయికి వెళ్లడంలో గ్రంథాలయాలు కీలకపాత్ర వహించాయని ఆయా ప్రముఖులు పలు సందర్భాల్లో చెప్తుంటారు. ఇంతటి విశిష్టత ఉన్న గ్రంథాలయాలు కొన్నేళ్లుగా సంక్షోభంలో చిక్కుకున్నాయి. భవనాలు లేక కొన్ని.. ఉన్న భవనాలు శిథిలమై మరికొన్ని.. నిధులులేమి.. సిబ్బంది కొరత.. సౌకర్యాలు లేమి.. తదితర సమస్యలతో జిల్లాలోని గ్రంథాలయాలు పాఠకుల ఆదరణ కోల్పోతున్నాయి. నిధుల లేమితో కొత్తగా పుస్తకాలు రావడంలేదు. పుస్తకాలు లేక పోవడంతో పాఠకుల అంతగా రావడంలేదు. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అవసరమైన పుస్తకాలు కూడా అందుబాటులో ఉండటంలేదు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉండటంతో వార్తపత్రికలు కూడా కొన్ని గ్రంథాలయాకు రావడంలేదు.  గ్రంథాలయ స్టేషనరీ అవసరాలకు సొమ్ములే లేవు.  సిబ్బంది కొరతతో కొన్ని ప్రాంతాల్లో గ్రంథాలయాల తలుపులు తీసే నాధుడే లేకుండా పోయాడు.   

- గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంఽథాలయం శిథిలావస్థకు చేరింది. ఇక్కడకు వచ్చే   పాఠకులకు కనీస సౌకర్యాలు లేవు. ఈ గ్రంథాలయానికి ఎక్కువగా పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువగా వస్తుంటారు. వీరు మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి కూడా సరైన స్థలం లేదు. పరిసర ప్రాంతాలు పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తుంది. భవనం సైతం పాడై గోడలు నెర్రిలు ఇచ్చి ప్రమాదకరంగా మారాయి. ఇక పక్కనున్న రిడింగ్‌ రూం అధ్వానంగా ఉంది. సీలింగ్‌ ఊడి ఎప్పుడు మీద పడుతుందా అన్నట్లుగా ఉందని పాఠకులు ఆందోళన చెందుతున్నారు. 

- రేపల్లెలోని చంద్రమౌళిపార్కులో 1960లో ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనం శిఽథిలమై కూలిపోయింది.    గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాన్ని దాసరి కృష్ణకుమారి కాంప్లెక్స్‌లోకి మార్చారు. నూతన భవన నిర్మాణానికి పరుచూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు పరుచూరి శ్రీనాథ్‌ రూ.20 లక్షలు నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఇది నేటికీ అమల్లోకి రాలేదు.  గ్రంథాలయంలో నలుగురు సిబ్బందికి ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని పత్రికలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. పురపాలకసంఘం ఆధ్వర్యంలోని ఇసుకపల్లిలో, పాత పట్టణం ఓల్డ్‌టౌన్‌లో, అరవపల్లి రోడ్డు రామమందిరం వద్ద  ఉన్న గ్రంథాలయాలు ప్రస్తుతం వినియోగంలో లేవు. ఈ గ్రంథాలయాలు బోర్డులకే పరిమితమయ్యాయి.   మండలంలోని నల్లూరుపాలెంలో రూ.5లక్షలతో అరకొరగా గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.  

- వినుకొండ పట్టణంలో లక్షకు పైగా జనాభా ఉన్నప్పటికీ గ్రంథాలయం గురించి పట్టించుకునే నాధుడు లేడు. అద్దెభవనంలోనే గ్రంథాలయాన్ని కొనసాగిస్తున్నారు. నూజెండ్ల గ్రంథాలయాధికారే వినుకొండలో కూడా బాధ్యతలు నిర్వహించాలి.  ఈపూరు గ్రంథాలయం మినహా మిగిలిన గ్రంథాలయాలన్నీ అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. శావల్యాపురంలో గ్రంథాలయం శాశ్వత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతుంది. 

- వేమూరు నియోజకవర్గంలో 89 గ్రామాలకు కేవలం 19 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో 5 భవనాలు శిథిలావస్థకు చేరగా రెండు మూతపడ్డాయి. మూత పడిన వాటిని ప్రాంతీయ పార్టీల నాయకులు తమ పార్టీల ఫ్లెక్సీలతో ప్రచార కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. వేమూరులో శిథిలమైన గ్రంథాలయ భవనాన్ని పునః నిర్మించేందుకు నిధులు విడుదల కాలేదు. చావలిలో ఐదేళ్లుగా గ్రంథాలయాధికారిని నియమించలేదు. దీంతో ఈ గ్రంథాలయం మూతపడింది. అమర్తలూరు, భట్టిప్రోలులోని భవనాలు శిథిలస్థితికి చేరాయి. ఐలవరంలోని బుక్‌డిపాజిట్‌ సెంటర్‌ ఏడాది క్రితం మూతపడింది.  కోళ్ళపాలెం, కన్నెగంటి వారిపాలెంలో కేవలం దినపత్రికలే సరఫరా అవుతున్నాయి. చుండూరు మండలంలోని యడ్లపల్లి, వలివేరు గ్రామాల్లోని భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొల్లూరు మండలంలోని రెండు గ్రామాల్లో భవనాల పరిస్థితి బాగానే ఉంది. 



- మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రంథాలయాలు నిరూపయోగంగా ఉన్నాయి.  దుర్గి, రెంటచింతలలో గ్రంథాలయ భవనాలు శిథిలస్థితికి చేరాయి. కారంపూడిలో గ్రంథాలయం ఉన్నప్పటికీ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ పుస్తకాలు అందుబాటులో లేవు. వెల్దుర్తిలోని గ్రంథాలయం పాఠకులకు ఉపయోగకరంగా లేదు.  

- తెనాలి మండలం సంగంజాగర్లమూడిలో నాలుగు దశాబ్దాలుగా సేవలు అందించిన శాఖా గ్రంఽథాలయం శిథిలావస్థకు చేరింది. పెంకులు ఊడుతూ గోడలకు, పిల్లర్ల మట్టిరాలుతూ ఉంది. వర్షం కురిస్తే గ్రంథాలయంలోకి నీరు కూడా చేరుతుంది. దాదాపు ఏళ్లనాటి గ్రంథాలయంలో ఎందరో పుస్తక పఠనం చేసి ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయం శిఽథిలావస్థకు చేరింది.  

- తాడికొండలోని మహిళల, బాలల గ్రంథాలయము నిరుపయోగంగా ఉన్నది. గ్రంథాలయం ఎప్పుడు తీస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దాతల సహాయంతో 1977లో ఏర్పాటు చేసిన శాఖాగ్రంథాలయం పాఠకుల ఆదరణ కోల్పోయింది. పొన్నెకల్లులో ఉన్న గ్రంథాలయంలో కూడా ఇదే స్థితి నెలకొంది. 

- పుస్తకాలు జాస్తి.. సౌకర్యాలు నాస్తి అన్నచందాన పొన్నూరు శాఖా గ్రంథాలయం కునారిల్లుతోంది. ఈ గ్రంథాలయాన్ని 1985లో తొలుత మార్కెట్‌ సెంటర్‌లోని మున్సిపల్‌ పార్క్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దానిని మున్సిపల్‌ రీడింగ్‌ రూంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పుస్తకాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేదు. పాఠకులు పుస్తకాలు, వార్తాపత్రికలు చదుకోవటానికి కూడా సౌకర్యంగా లేక  ఆరుబయట అరుగులను ఆశ్రయిస్తున్నారు. వర్షం కురిస్తే పాఠకులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవన నిర్మాణానికి నిధులు ఉన్నప్పటికీ  మున్సిపల్‌ అధికారులు, పాలకులు స్థలం సమకూర్చకపోవటంతో ఏళ్ల తరబడి గ్రంథాలయాన్ని అదె ్ద భవనంలో నిర్వహిస్తున్నారు. గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలు 8,400 అందుబాటులో ఉన్నా ప్రయోజనం లేదు.

- పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా చిలకలూరిపేటశాఖా గ్రంథాలయంలో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. యడ్లపాడు మండలంలో జగ్గాపురం గరంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడిందంటే కూర్చోవడానికి కూడా వీలు ఉండటం లేదు. పుస్తకాలు తడచిపోతున్నాయి. పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేవు. యడ్లపాడు మండలంలోని రెండు గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉంది.

- దాచేపల్లి గ్రంథాలయ శాఖాధికారి లేరు. దీంతో నకరికల్లు గ్రంథాలయాధికారే ఇన్‌చార్జిగా ఉండటంతో ఎప్పుడు తీస్తారో ఎవరికీ తెలియది. దీంతో పాఠకులు రోజూ వచ్చి వెనుదిరిగిపోతున్నారు. దాచేపల్లి గ్రంథాలయానికి సొంతభవనం ఉన్నప్పటికీ పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేవు. మాచవరం, మోర్జంపాడులలో ఉన్న గ్రంథాలయాలు అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల గ్రంథాలయం కొన్నేళ్లుగా అద్దెభవనంలోనే కొనసాగుతుంది.  

 

Updated Date - 2021-09-13T05:13:46+05:30 IST