ఘనంగా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-14T07:01:52+05:30 IST

జిల్లాలో దేశభక్తి, సాంస్కృతిక గుబాళింపులు గుప్పుమంటున్నాయి. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ భావితరాలకు వారి సేవలను తెలిసేలా చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున వజ్రోత్సవాల్లో పాల్గొంటు దేశభక్తిని చాటుకుంటున్నారు.

ఘనంగా వజ్రోత్సవాలు
జిల్లా కేంద్రంలో భారీ జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

- జిల్లా అంతటా తిరంగా ర్యాలీలు

- వాడవాడన జాతీయ జెండాలతో సందడి

- తిరంగా ర్యాలీలో పాల్గొంటున్న అన్ని వర్గాల ప్రజలు, నేతలు

- కామారెడ్డిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

- బాన్సువాడలో క్రీడలను ప్రారంభించిన స్పీకర్‌

- దోమకొండ నుంచి కాంగ్రెస్‌ పాదయాత్ర

- కామారెడ్డి పట్టణంలో 3వేల అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

- జిల్లాలో వజ్రోత్సవాల సందడి


కామారెడ్డి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి)/కామారెడ్డి: జిల్లాలో దేశభక్తి, సాంస్కృతిక గుబాళింపులు గుప్పుమంటున్నాయి. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ భావితరాలకు వారి సేవలను తెలిసేలా చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున వజ్రోత్సవాల్లో పాల్గొంటు దేశభక్తిని చాటుకుంటున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలను ఈ వజ్రోత్సవాల్లో భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ భారీ ర్యాలీ నిర్వహించి తిరంగ బెలూన్‌లు ఎగురవేశారు. బాన్సువాడలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి క్రీడలను ప్రారంభించారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ దోమకొండ గడికోట నుంచి తిరంగ ర్యాలీని చేపట్టి పాదయాత్ర నిర్వహించారు. కామారెడ్డి బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో 3వేల అడుగుల భారీ జాతీయ జెండాతో పట్టణ మంతా ర్యాలీ నిర్వహించారు.

అందరూ ఒక్కటై జాతీయ స్ఫూర్తిని చాటి

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల గడుస్తున్నందున జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై జాతీయ స్ఫూర్తిని చాటి తమ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు సైతం వజ్రోత్సవాల్లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ఇతర పార్టీల నేతలు నాయకులు కార్యకర్తలు సైతం 75 సంవత్సరాల భారత స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం కామారెడ్డిలోని పట్టణ యువతి, యువకులతో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం రన్‌ నిర్వహించగా శనివారం ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభలు, కలెక్టర్‌, ఎస్‌పీలు తిరంగబెలూన్‌లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దోమకొండలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ర్యాలీ చేపట్టి పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్‌  వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణమంతా జాతీయస్ఫూర్తిని నింపేందుకు కామారెడ్డిలో మొట్టమొదటిసారి భారీ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

ప్రతీ ఇంట జాతీయ జెండా

స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఈనెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు ప్రారంభం కావడంతో గల్లి, గల్లినా, వాడవాడన, గ్రామ గ్రామానా జాతీయ జెండాల ప్రదర్శన కొనసాగుతుంది. ఇప్పటికే  పలు గ్రామాలలో జాతీయ జెండాల ఊరేగింపు నిర్వహిస్తుండడంతో ఊరురా పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేసి తమ దేశభక్తిని చాటుతున్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆటల పోటీలను నిర్వహించారు.


త్యాగాలు, పోరాటాల ఫలితమే దేశానికి స్వాతంత్రం

- మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. భావితరాలకు స్వాతంత్య్ర సమరయోదుల స్ఫూర్తిని తెలియజేయడం, వారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరిని ప్రేరేపించడం వేడుకల ముఖ్య ఉద్దేశ్యం. ఈనెల 15న విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి జెండాల ద్వారా దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి.


స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే మనకు దక్కిన స్వేచ్ఛ

- గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌

స్వాతంత్య్ర సమరయోదుల త్యాగఫలమే మనం ఇప్పుడు పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు. స్వాతంత్య్రంలో మనకు పాల్గొనే అదృష్టం లేకపోయినప్పటికీ దాని సాధించిపెట్టిన పూర్వికుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటేందుకే ఈ వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ దేశభక్తిని జాతీయ జెండాలు ఎగురవేసి చాటాలి. అన్ని వర్గాల ప్రజలు తమ సమైక్య స్ఫూర్తిని తెలిపి తామంతా ఒక్కటేనని చాటి చెప్పాలి. 16న పెద్ద ఎత్తున జాతీయ గీతాలపన చేయాలి.


మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

- జితేష్‌ వి.పాటిల్‌, కలెక్టర్‌

మహనీయుల త్యాగాలను ఈ తరం యువతి, యువకులు తెలుసుకోవాలి. ప్రతిరోజూ 4,500 మందికి గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని 15 రోజుల పాటు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తాం. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జాతీయ స్ఫూర్తిని గొప్పగా చాటాలి.


16న పెద్ద ఎత్తున గీతాలాపనలో పాల్గొనాలి

- శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. ఈనెల 16న 11.30 గంటలకు నిర్వహించబోయే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు అందరూ పాల్గొనాలి. జాతీయ గీతాలాపన చేసే సమయంలో వాహనాల రాకపోకలు అన్నీ జంక్షన్‌లలో ట్రాఫిక్‌ని నిలిపివేయడం జరుగుతుంది.

Updated Date - 2022-08-14T07:01:52+05:30 IST