Jul 22 2021 @ 18:26PM

శివాజీగణేశన్‌కు ఘననివాళి

కోలీవుడ్: నడిగర్‌ తిలగం శివాజీగణేశన్‌ 20వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఆయన అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించారు. స్థానిక టి.నగర్‌లో ఉన్న శివాజీగణేశన్‌ నివాసంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఆయన కుమారులు రాంకుమార్‌, నటుడు ప్రభు, కుటుంబసభ్యులు పూలతో నివాళులర్పించారు. అనంతరం అడయార్‌ శివాజీగణేశన్‌ మణిమండపం ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన సంతాప సభలో రాంకుమార్‌, దుశృంత్‌, దర్శన్‌, సీనియర్‌ నటుడు ఎస్వీ శేఖర్‌ తదితరులు పాల్గొని శివాజీగణేశన్‌ విగ్రహానికి పూలదండలు సమర్పించి అంజలి ఘటించారు. రాయపేటలోని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) కార్యాలయం సత్యమూర్తిభవన్‌లో శివాజీగణేశన్‌ వర్ధంతిని పాటిస్తూ ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సెల్వం పెరుందగై, టీఎన్‌సీసీ కార్యదర్శులు పొన్‌.కృష్ణమూర్తి, రంగభాష్యం, డా.సుమతి అన్బరసు తదితరులు నివాళులర్పించారు.


డీఎంకే పాలన భేష్ 

డీఎంకే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేకూరుస్తూ వస్తోందని సీనియర్‌ నటుడు ఎస్వీ శేఖర్‌ పేర్కొన్నారు. శివాజీగణేశన్‌కు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో అధికారం చేపట్టిన డీఎంకే ప్రభుత్వం, వైరస్‌ బారి నుంచి ప్రజలను సంరక్షించేందుకు చేపట్టిన కృషి ప్రశంసనీయమన్నారు.