'Whistle Grandpa': నిత్య ప్రయాణికుడు ‘విజిల్‌ తాత’

ABN , First Publish Date - 2022-08-07T16:24:04+05:30 IST

ఆయన వయసు 87 ఏళ్లు. అయితేనేం! వేకువజామున 5 గంటలు మొదలు రాత్రి 8 గంటల వరకు సైకిల్‌పై హుషారుగా తిరుగుతూ అల్లం టీ,

'Whistle Grandpa': నిత్య ప్రయాణికుడు ‘విజిల్‌ తాత’

పెరంబూర్‌(చెన్నై): ఆయన వయసు 87 ఏళ్లు. అయితేనేం! వేకువజామున 5 గంటలు మొదలు రాత్రి 8 గంటల వరకు సైకిల్‌పై హుషారుగా తిరుగుతూ అల్లం టీ, తినుబండారాలు అమ్ముతుంటాడు. అరవయ్యేళ్లకే అంతా అయిపోయిందనుకునేవారున్న ఈ కాలంలో.. 87 ఏళ్ల తాత ఇంత కష్టపడడం తిరుపత్తూరు(Tirupattur) జిల్లా వాణిజంబాడి వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. అన్నట్లు, ఆయన విజిల్‌(Whistle) ఊదుకుంటూ వీధివీధి తిరుగుతుంటారు. తాత విజిల్‌ వింటే చాలు ఎంతోమంది గ్లాసులు, ఫ్లాస్కులు తీసుకుని ఆయన సైకిల్‌ వద్దకు పరిగెత్తుతారంటే నమ్మగలరా?.. కానీ నమ్మాల్సిందే! ఎందుకంటే ఆయన తయారు చేసే అల్లం టీ అంత రుచిగా వుంటుంది మరి. 


విజిల్‌ తాత అసలు పేరు బాబు, ఆయనకు భార్య ఫాతిమా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. పిల్లలంతా వేర్వేరుప్రాంతాల్లో చక్కగా స్థిరపడ్డారు. తాత మాత్రం 30 ఏళ్లుగా ఇదే సైకిల్‌పై టీ, తినుబండారాలు విక్రయిస్తూ కాలం గడుపుతున్నారు. ‘‘ఈ వయసులో ఇంత కష్టపడడమెందుకు? మేం సంపాదిస్తున్నాం కదా. ఇక విశ్రాంతి తీసుకో’’ అని కుమారులు నచ్చచెప్పినా తాత ఊరుకోలేదు. ‘ఎవరో సంపాదిస్తే నేనెందుకు తినాలి? ఓపికున్నంత కాలం సంపాదిస్తాను. మంచానికి పరిమితం చేయడానికా ఈ శరీరమున్నది?’ అంటూ ఆయన అడిగే ప్రశ్నకు చాలామందిలానే ఆయన కుమారుల వద్దా సమాధానం లేక మిన్నకుండిపోయారు.  వళయాంపట్టుకు పంచాయతీ(Panchayat)లోని కామరాజపురానికి చెందిన విజిల్‌ తాత.. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచి, అల్లం టీ తయారు చేసి సైకిల్‌పై పెట్టుకుని బయలుదేరుతాడు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మార్కెట్‌.. ఇలా వరుసగా అన్ని ప్రాంతాలు కలియతిరుగుతూ టీ విక్రయిస్తాడు. ఈ వయసులో కూడా కుర్రాళ్లకు దీటుగా తిరుగాడుతున్న విజిల్‌ తాతను ఎంతోమంది మెచ్చుకుంటున్నారు.



Updated Date - 2022-08-07T16:24:04+05:30 IST