ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T06:02:26+05:30 IST

కృష్ణాష్టమి వేడుకలతో శుక్రవారం తిరుపతి నగరం పులకించింది. హరేరామ హరేకృష్ణ మార్గంలోని ఇస్కాన్‌ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో వేకువజామున 4.30 గంటలకు తులసి పూజ, నరసింహకీర్తన, మంగళహారతితో వేడుకలు మొదలయ్యాయి.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ప్రత్యేకాలంకరణలో అష్టసఖీ సమేత శ్రీకృష్ణుడు

 తిరుపతి (కల్చరల్‌), ఆగస్టు 19: కృష్ణాష్టమి వేడుకలతో శుక్రవారం తిరుపతి నగరం పులకించింది. హరేరామ హరేకృష్ణ మార్గంలోని  ఇస్కాన్‌ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో వేకువజామున 4.30 గంటలకు తులసి పూజ, నరసింహకీర్తన, మంగళహారతితో వేడుకలు మొదలయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. రాత్రి వరకు రద్దీ కొనసాగింది. భక్తుల నియంత్రణకు నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు కృష్ణాష్టమి విశిష్టతపై ఇస్కాన్‌ అధ్యక్షుడు రేవతీరమణదాస్‌ ప్రసంగంతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సాయంత్రం ఇస్కాన్‌ ఎదురుగా ఉన్న మైదానంలో యువత ఉట్టి కొట్టి సందడి చేశారు. రాత్రి 11 గంటల తర్వాత స్వామివారికి మహాశంఖాభిషేకం నిర్వహించారు. కాగా.. శనివారం ఇస్కాన్‌ సంస్థాపనాచార్యులు  భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల జయంతిని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంటుంది. 

తిరుమల శ్రీవారి ఆలయంలో 

వైభవంగా గోకులాష్టమి ఆస్థానం


తిరుమల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని శుక్రవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిపారు. ఇందులో భాగంగా బంగారు స్వర్ణభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామిని వేంచేపు చేసి నివేదనలు సమర్పించారు. అలాగే ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. తర్వాత ద్వాదశారాధనం చేపట్టారు. దీంతో గోకులాష్టమి పూర్తయింది. ఇకా, శనివారం తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీమలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరుమాడవీధుల్లో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. 




Updated Date - 2022-08-20T06:02:26+05:30 IST