జెండా మెరిసే.. మది మురిసే!

ABN , First Publish Date - 2022-08-16T05:16:03+05:30 IST

నూతన జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర సంబరాలు మిన్నంటాయి. జిల్లాకేంద్రంలో త్రివర్ణ పతాకం మెరిసింది. ప్రతి మదిలో దేశభక్తి వెల్లివిరిసింది.

జెండా మెరిసే.. మది మురిసే!
జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న హోం మంత్రి, కలెక్టర్‌ తదతరులు

  ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

  నూతన జిల్లాలో తొలిసారిగా.. 

    జిల్లాకేంద్రంలో అంబరాన్నంటిన సంబరాలు

  ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 

  పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, ఆగస్టు 15 : నూతన జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర సంబరాలు మిన్నంటాయి.  జిల్లాకేంద్రంలో త్రివర్ణ పతాకం మెరిసింది. ప్రతి మదిలో దేశభక్తి వెల్లివిరిసింది. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల పరేడ్‌ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హోంశాఖ మంత్రి తానేటి వనిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..  కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో తొలిసారిగా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు.  జిల్లా  అభివృద్ధే లక్ష్యంగా అధికారులంతా పనిచేయాలని సూచించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా ఈ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులను విధిగా స్మరించుకోవాలన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కొత్తగా ఏర్పడినప్పటికీ బ్రిటీష్‌ పాలనలో సైతం 23 తాలూకాలు, 6 డివిజన్లు రాష్ట్రంలో ఉండేవన్నారు. అందులో పార్వతీపురం డివిజన్‌ కేంద్రంగా ఉండేదని, పార్వతీపురం, సాలూరు, పాలకొండ తాలూకాలుగా ఉండేవని చెప్పారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను హోం మంత్రి వనిత, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్సీ విక్రాంత్‌, ఎమ్మెల్యే అలజంగి జోగారావు,  ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు,  జేసీ ఒ.ఆనంద్‌, సబ్‌ కలెక్టర్‌ భావ్న, ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, పాలకొండ డీఎస్పీ శ్రావణి, పార్వతీపురం డీఎస్పీ సుభాష్‌, డీఆర్‌వో జె.వెంకటరావు తదితరులు పాల్నొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బెలగాం: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు పిరమిడ్‌ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో అందర్నీ అలరించారు.  టీఆర్‌ఎంఎం, ఉలిపిరి గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాల, జోగింపేట కేజీబీవీ, కొమరాడ మండలం పెదఖేర్జిల గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల విద్యార్థులు, కొమరాడ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులను  హోంమంత్రి వనిత, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు  అభినందించారు. మొదట మూడు స్థానాల్లో నిలిచిన టీఆర్‌ఎంఎం, ఉలిపిరి గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాల, అంబేడ్కర్‌ గురుకులం విద్యార్థులకు బహుమతులు అందించారు. 

శకటాల ప్రదర్శన

 స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా పలు శాఖలు తమ ప్రగతిని శకటాల ద్వారా తెలియజేశారు.  ప్రధానంగా  వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, వైద్య ఆరోగ్య,  హౌసింగ్‌, గిరిజన సంక్షేమ, జిల్లా గ్రామీణ అభివృద్ధి, అగ్ని మాపక, విపత్తుల నిర్వహణ, గ్రామీణ, పంచాయతీరాజ్‌, తదితర శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిల్లో  గ్రామీణ అభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ), వ్యవసాయ ఉద్యానశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌శాఖ శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. 

అనుకూలించిన వాతావరణం

 వాస్తవంగా వారం రోజుల నుంచి జిల్లాలో విరివిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వాతంత్య్ర వేడుకలు ఎలా జరుగుతాయోనని అధికారులు ఆందోళన చెందారు. అయితే సోమవారం వాతావరణం అనుకూలించింది.   మొట్టమొదటిసారిగా జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలు విజయవంతమవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

  సీతంపేట ఐటీడీఏలో  ...

సీతంపేట: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో జాతీయ జెండాను పీవో బి.నవ్య, పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి ఎగురవేశారు. అనంతరం ఐటీడీఏ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన 63 మంది ఉద్యోగులకు  ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం పీవో మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఉద్యోగులు అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకమన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ అధికారులుగా ఎంపికైన నలుగురు పార్వతీ పురంలో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారని చెప్పారు. ఇదే ఉత్సాహంతో ఉద్యోగులు పనిచేయాలని సూచించారు.  వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి, నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.మురళి, ఎడ్యుకేషనల్‌ ఓఎస్‌డీ యుగంధర్‌, సీడీపీవో రంగలక్ష్మి, నందేశ్వరరావు, వెలుగు ఏపీడీ నారాయణరావు పాల్గొన్నారు.  

 


Updated Date - 2022-08-16T05:16:03+05:30 IST