స్ఫూర్తి ప్రదాత వెంకయ్య

ABN , First Publish Date - 2022-08-09T06:27:31+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్ఫూర్తి ప్రదాత అని, ఆయన మార్గదర్శనంలో సుదీర్ఘకాలం సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ధర్మం, కర్తవ్య నిర్వహణే లక్ష్యంగా ఆయన తన..

స్ఫూర్తి ప్రదాత వెంకయ్య

ఆయన మార్గదర్శనంలో పనిచేయడం గర్వకారణం’

ప్రతి మాటలోనూ చమత్కారం, వివేకం

పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేశారు

ఆయన ప్రమాణాలతో ప్రజాస్వామ్యానికి పరిపక్వత

రాజకీయం జీవితం పారదర్శకం, ఎన్నో మైలురాళ్లు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం

రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు సమావేశం

రాజకీయాల్లో సహనం అవసరం: వెంకయ్య


న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్ఫూర్తి ప్రదాత అని, ఆయన మార్గదర్శనంలో సుదీర్ఘకాలం సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ధర్మం, కర్తవ్య నిర్వహణే లక్ష్యంగా ఆయన తన భావితరాలకు మార్గదర్శనం చేశారని ప్రశంసించారు. దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి ప్రధానమంత్రిగా పార్లమెంట్‌ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకటించారు. ఉపరాష్ట్రపతిగా బుధవారం పదవీవిరమణ చేయనున్న వెంకయ్యనాయుడుకు సోమవారం రాజ్యసభలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మోదీ ప్రసంగిస్తూ.. వెంకయ్య నెలకొల్పిన ప్రమాణాల్లో ప్రజాస్వామ్య పరిపక్వతను చూశానన్నారు. వెంకయ్య చమత్కార సంభాషణలను పలు సందర్భాల్లో మోదీ గుర్తు చేసుకున్నారు.


మాటల మాంత్రికుడు వెంకయ్య..

మాటల మాంత్రికుడిగా పేరు పొందిన వెంకయ్య ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్యాలు తమకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని మోదీ పేర్కొన్నారు. ఆయన భాషా నైపుణ్యం గొప్పదని చెప్పారు. ‘మీ మాటలు వినేలా, ప్రాధాన్యతనిచ్చేలా, ఆరాధించేలా చేస్తాయి. వాటిని ఎవరూ తిప్పికొట్టలేరు. మీ మాటల్లో ప్రగాఢమైన లోతు, అర్థం ఉంటాయి. అందులో బరువు ఉంటుంది. చమత్కృతి ఉంటుంది. వెచ్చదనం ఉంటుంది. వివేకమూ ఉంటుంది. ఆ మాటలను దేనితోనూ పోల్చలేం’ అన్నారు.


అన్ని వర్గాలకూ ప్రేరణ..

గత ఐదేళ్లలో వెంకయ్య దేశం నలుమూలలా పర్యటించారని, అధిక భాగం యువకులతో గడిపారని ప్రధాని మోదీ చెప్పారు. వెంకయ్య ప్రసంగాలు, మాట్లాడిన ప్రతిమాట యువత, మహిళలు, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతో ప్రేరణ నిచ్చాయన్నారు. సామాన్య కార్యకర్త, విద్యార్థి నాయకుడు, ఎమ్మెల్యేగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రస్థానం గొప్పదని కొనియాడారు. పార్టీ, ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా ఎంతో చిత్తశుద్ధి, అంకిత భావంతో నిర్వర్తించి తనలాంటి కార్యకర్తలందరికీ మార్గదర్శకంగా నిలిచార న్నారు.  


మాతృభాషపై భావం ఆదర్శవంతం..

మాతృభాష కళ్లలో వెలుగు లాంటిదని, పరాయి భాష కళ్ల జోడు లాంటిదని అద్భుతంగా అభివర్ణించిన వెంకయ్యకు మాతృభాష పట్ల ఉన్న అభిరుచి అభినందనీయం, ఆదర్శవంతం అని మోదీ పేర్కొన్నారు. సభలో సభ్యులకు వివిధ మాతృభాషల్లో మాట్లాడే అవకాశం కల్పించిన ఘనత వెంకయ్యకే దక్కిందన్నారు. వెంకయ్య హయాంలో రాజ్యసభ ఉత్పాదకత 70ు మేరకు పెరిగిందని, సభ్యుల హాజరు కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.


ఆయన మార్గదర్శనంలో ఎన్నో బిల్లులను విజయవంతంగా ఆమోదించారని చెప్పారు. రాజ్యసభ సచివాలయంలో కాగిత రహిత వ్యవస్థను ప్రోత్సహించారన్నారు. ‘సభలో సభ్యుల ప్రవర్తన, బాధ్యత తదితర విషయాల్లో మీ అనుభవాలు చెబుతూ ప్రేమగా హెచ్చరించినా, మొట్టికాయలు వేసినా ఎవరూ తప్పుగా తీసుకోలేదు. అది మీ పెద్దరికం పట్ల ఉన్న గౌరవం’ అని తెలిపారు. చర్చల ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం అనే విషయంలో వెంకయ్య ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచార ని కొనియాడారు. అన్ని పార్టీల ఎంపీలకు సరైన అవకాశాలిచ్చారని, పరిధి దాటితే సభను ధిక్కరించినట్లేనని స్పష్టం చేశారని తెలిపారు.  


గౌరవానికి సంకేతం..

వెంకయ్య చూపిన బాట, అనుసరించిన విధానాలు, ఆయన తర్వాత ఆ పదవి చేపట్టేవారికి ఉపకరిస్తాయని మోదీ చెప్పారు.  ఆజాదీకా అమృత మహోత్సవ్‌ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అందరూ స్వాతంత్య్రం తర్వాత పుట్టిన వారు కావడం అందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడు సభను నిష్పక్షపాతంగా నడిపించారని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కొనయాడారు. ఈ ఐదేళ్ల కాలంలో తీసుకున్న  నిర్ణయాలన్నీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయని చెప్పారు. ఈ రోజులను తామంతా ఎప్పటికీ మరచిపోలే మన్నారు. ఈ ఐదేళ్లు సభ గౌరవాన్ని మరింత పెంచారని కొనియాడారు. ఈ కాలంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని, వాటి ప్రభా వం దేశరాజకీయాలపై, ఇతిహాసంపై ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. ఆయన సమయంలో ప్రవేశపెట్టిన పలు బిల్లులను ప్రస్తావించారు.   

  

వెంకయ్య తర్వాత ఎలా ఉంటుందో..: ఖర్గే 

వెంకయ్య పదవీవిరమణ తర్వాత సభలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే చమత్కరించారు. అపారమైన అనుభవంతో సంస్కరణలు తేవడంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని కొనియాడారు. రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతను సమర్థంగా నిర్వహించారన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించార ని కొనియాడారు.  


డెరెక్‌ వ్యాఖ్యలతో వెంకయ్య భావోద్వేగం

ఏడాది వయసులోనే వెంకయ్య తల్లిని కోల్పోయిన ఘటనను టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ ప్రస్తావించగా, వెంకయ్య తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘వెంకయ్య తన ఆత్మకథను రాయాలి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీరు 2020 సెప్టెంబరు 20న రాజ్యసభలో సాగు బిల్లులు ఆమోదం పొందిన రోజు సభాపతి స్థానంలో లేరు. అందుకు  కారణాన్ని ఆత్మకథలో పేర్కొనాలి’ అని ఒబ్రెయిన్‌ అన్నారు. కాగా, వెంకయ్యను సింహం వంటివార ని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కొనియాడారు. బ్రిటిష్‌ కాలం నుంచి సభలో కొనసాగుతున్న ‘‘బెగ్‌ టూ లే’’ పదాలను తొలగించారని గుర్తుచేశారు. వెంకయ్య దేశ యువతకు ప్రేరణ అని బీజేడీ ఎంపీ సస్మిత్‌ పాత్ర తెలిపారు. వెంకయ్య నుంచి తనకు ఎంతో మార్గదర్శనం లభించిందని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తెలిపారు. వెంకయ్య సహజ ఆలోచనలతో ఉండే రాజనీతజ్ఞుడని సీపీఎం ఎంపీ జాన్‌ బిటాస్‌ కొనియాడారు.  


ఇంకా ఎవరెవరు మాట్లాడారంటే.. 

వెంకయ్య వీడ్కోలు సమావేశంలో మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పురుషోత్తమ్‌ రూపాలా, రాందాస్‌ అథవాలే, రాజ్యసభ డిప్యుటీ చైర్మన్‌ హరివంశ్‌, ఆర్జేడీ ఎంపీలు మనోజ్‌ కుమార్‌ ఝా, అహ్మద్‌ అష్ఫాక్‌ కరీం, బీజేపీ ఎంపీ రాంనాథ్‌ ఠాకూర్‌, అన్నాడీఎంకే ఎంపీ తంబీదురై, ఎన్సీపీ ఎంపీలు ప్రఫుల్‌ పటేల్‌, వందనా చౌహాన్‌, ఆప్‌ ఎంపీలు విక్రమ్‌ సింగ్‌ సాహ్ని, రాఘవ్‌ చడ్డా, సంత్‌ బల్బీర్‌ సింగ్‌, ఎస్పీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌, వినయ్‌ విశ్వం(సీపీఐ), రాంజీ(బీఎస్పీ), బీరేంద్ర ప్రసాద్‌ బైశ్య(ఏజీపీ), అబ్దుల్‌ వాహబ్‌(ఐయూఎంఎల్‌), జీకే వాసన్‌( టీఎంసీ-ఎం), అసోంకు చెందిన ఇండిపెండెంట్‌ ఎంపీ అజిత్‌ కుమార్‌ భుయాన్‌, కేరళ కాంగ్రెస్‌ ఎంపీ జోస్‌ కె. మణి, సీపీఎం ఎంపీ బికాశ్‌ రంజన్‌ భట్టాచార్యా, టీఎంసీ జౌహార్‌ సర్కార్‌, డీఎంకే ఎంపీ విల్సన్‌ దేశానికి వెంకయ్య అందించిన సేవలను కొనియాడారు. 




రాష్ట్ర ఎంపీల ప్రశంసలు.. 

‘రాజ్యసభ సభాపతి స్థానంలో వెంకయ్య ఉండడాన్ని ప్రతీ తెలుగు వ్యక్తి గర్వంగా భావించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో వెంకయ్య రాజకీయ సభలకు హాజరై తాను స్ఫూర్తి పొందానని తెలిపారు. రాజ్యసభ ప్యానల్‌ చైర్మన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజలకే కాకుండా దేశానికి వెంకయ్య గర్వకారణమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ కొనియాడారు. వెంకయ్య నాయకత్వంలో తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు విశిష్ట వ్యక్తులు సభాపతి స్థానాన్ని అధిరోహించారని, అందులో మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కాగా,  రెండో వ్యక్తి వెంకయ్య నాయుడు అని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ కొనియాడారు. వెంకయ్య నివసించే త్యాగ్‌రాజ్‌ మార్గ్‌ రోడ్డును త్యాగరాజ మార్గ్‌గా మార్చాలని కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్య హామీ ఇచ్చారని ఈ సందర్భంగా జైరాం రమేశ్‌ గుర్తు చేశారు.

Updated Date - 2022-08-09T06:27:31+05:30 IST